కరోనా పేరుతో కన్నతల్లిని ఇంట్లోకి రానివ్వని కుమారుడు.. రంగంలోకి దిగిన..

కరోనా పేరుతో కన్నతల్లిని ఇంట్లోకి రానివ్వని కుమారుడు.. రంగంలోకి దిగిన..
x
Highlights

కరోనా పేరుతో కన్నతల్లిని ఇంట్లోకి రానివ్వని ఘటన కరీంనగర్ కిసాన్‌నగర్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోగం లేకున్నా.. ఆ లక్షణాలు కూడా కనిపించకపోయినా.....

కరోనా పేరుతో కన్నతల్లిని ఇంట్లోకి రానివ్వని ఘటన కరీంనగర్ కిసాన్‌నగర్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోగం లేకున్నా.. ఆ లక్షణాలు కూడా కనిపించకపోయినా.. ఆ కర్కశ కుమారుడు తల్లిని ఇంటి నుంచి గెంటేశాడు. కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. స్థానిక కార్పొరేటర్‌ రంగంలోకి దిగడంతో చేసేదేం లేక కుమారుడు దిగొచ్చాడు. చివరకు తల్లిని ఇంట్లోకి రానిచ్చాడు.

ఈ అవ్వ పేరు శ్యామల. లాక్‌డౌన్‌ కంటే ముందు ఓ ఫంక్షన్ కోసం మహారాష్ట్రలోని షోలాపూర్‌ వెళ్లింది. అంతలోనే లాక్‌డౌన్‌ విధించడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో శుక్రవారం ఉదయం 6 గంటలకు కరీంనగర్‌లోని తన ఇంటికి వచ్చింది. అయితే ఆమెను తన కుమారుడు నర్సింహాచారి ఇంట్లోకి రానివ్వలేదు. ఏమీ చెప్పకుండానే ఇంటి నుంచి గెంటేశాడు.

కన్నకొడుకే ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇంటి పక్కనే మురికి కాల్వ పక్కన కూలబడింది. చెట్టునీడన తన వెంట తెచ్చుకున్న బ్యాగులతో ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక బిత్తర చూపులతో అటూ ఇటూ చూస్తుండీ పోయింది.

ఎండ వేడి పెరిగింది. ఒంట్లో నీరసం వచ్చింది. అయినా కొడుకు కనికరించలేదు. కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. దీంతో ఓపిక లేక అవ్వ అక్కడిక్కడే కుప్పకూలింది. పరిస్థితిని గమనించిన స్థానికులు హుటాహుటిన మంచినీరు, కాస్త కడుపులో పడేందుకు టిఫిన్‌ ఇచ్చారు. అప్పటికి కానీ శ్యామల తేరుకోలేదు. ఇద్దరు కుమారులున్నా ఇంట్లో చోటు కూడా లేదంటూ కన్నీరుమున్నీరైంది.

ఇటు స్థానిక కార్పొరేటర్‌ రంగంలోకి దిగాక సీన్ మారింది. ఆయన డైరెక్ట్‌గా ఇంట్లోకి వెళ్లి ఆ అవ్వ కొడుకును, కోడలిని నిలదీశారు. కన్నతల్లిని కష్టపెట్టొద్దని హితవు పలికారు. ఒకవేళ ఆమెకు కరోనా వచ్చి ఉంటే ప్రభుత్వం ఇలా ఒంటరిగా పంపించేది కాదని పరీక్షలు నిర్వహించేవారని చెప్పారు. ఆయన మాటలకు ఒక్కసారిగా భగ్గుమన్న శ్యామల కోడలు మండిపడింది. ఆమెను లోనికి రానిస్తే డ్యామ్‌లో దూకి ఛస్తామంటూ బెదిరింపులకు దిగింది.

అయినా వెనక్కు తగ్గని కార్పొరేటర్‌ కుమారుడిపై ఒత్తిడి పెంచారు. పోలీసులు కూడా వచ్చారు. ఇంటి ముందు నానా హంగామా జరిగింది. చివరకు చేసేదేం లేక కుమారుడు నర్సింహాచారి తల్లిని ఇంట్లోకి రానిచ్చాడు. అసలు తనకే రోగం లేదని లాక్‌డౌన్‌ కంటే ముందు వెళ్లడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని శ్యామల చెబుతోంది.

కరోనా మానవ సంబంధాలను దెబ్బతీస్తుందని ఇలాంటి విషయంపై ప్రజల్లో ఉన్న అపోహలను ప్రభుత్వం తొలగించేలా ప్రచారం చేయాలని కార్పొరేటర్ హెచ్‌ఎంటీవీతో తెలిపారు. ఇలాంటి మూర్ఖులకు బుద్దిచెప్పేందుకు అధికారులు సత్వరం చర్యలు చేపట్టాలని కోరారు.

నిజానికి కరోనా ఉంటే తల్లిపై మరింత శ్రద్ధ చూపాలి. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి. కానీ ఈ కుమారుడు మాత్రం కరోనా పేరుతో తల్లిని ఇంట్లోకి రానివ్వకపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories