ఇవాళ తెలంగాణ సీజేగా ఉజ్జల్ భూయాన్ ప్రమాణం

Justice Ujjal Bhuyan Appointed Chief Justice Of Telangana High Court
x

ఇవాళ తెలంగాణ సీజేగా ఉజ్జల్ భూయాన్ ప్రమాణం

Highlights

Telangana High Court: రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై జస్టిస్ ఉజ్జల్ భూయాన్‎తో ప్రమాణం చేయించనున్నారు

Telangana High Court: తెలంగాణ హైకోర్టు నూతన చీఫ్ జస్టిస్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై జస్టిస్ ఉజ్జల్ భూయాన్‎తో ప్రమాణం చేయించనున్నారు. ప్రభుత్వ పెద్దలు, హైకోర్టు జడ్జీలు, మంత్రులు హాజరు కానున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మను కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌గా బదిలీ చేసింది. ఆయన స్థానంలో తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తిగా పని చేస్తోన్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌కు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమోషన్ కల్పించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్రం తాజాగా గెజిట్ జారీ చేసింది.

జస్టిస్ ఉజ్జల్ భుయాన్ 1964, ఆగస్టు 2న గువాహటిలో జన్మించారు. ఆయన తండ్రి, సీనియర్ లాయర్ సుచేంద్ర నాథ్ భూయాన్. అసోం అడ్వొకేట్ జనరల్‌గా పని చేశారు. గువాహటిలోని డాన్ బాస్కో స్కూల్లో , కాటన్ కాలేజీలో జస్టిస్ భుయాన్ చదువుకున్నారు. ఢిల్లీలోని కిరోరీ మల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదివారు. గువాహటి గవర్నమెంట్ లా కాలేజీలో ఎల్ఎల్‌బీ చేసిన జస్టిస్ భుయాన్.. గువాహటి యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చదివారు. 2011 అక్టోబర్‌లో ఆయన గువాహటి హైకోర్ట్ అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. 2019లో బాంబే హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. అనంతరం 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గానూ జస్టిస్ భుయాన్ వ్యవహరిస్తున్నారు.

ప్రోటోకాల్ ప్రకారం సీజే ప్రమాణ స్వీకారానికి సీఎం, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరు కావాల్సి ఉంటుంది. సీజే ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు రాజ్ భవన్ వర్గాలు ఆహ్వానం పంపాయి. అయితే గవర్నర్, సీఎం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో సీజే ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరు కాకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇవాళ రెండో టి. హబ్ ప్రారంభం ఉండటంతో కేసీఆర్‌ ఈ కార్యక్రమానికే వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసీఆర్‌కు బదులు న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లేదా న్యాయ శాఖ సెక్రటరీని పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories