Janasena: తెలంగాణలో ఒంటరిపోరుకు సిద్ధమైన జనసేన

Janasena is Ready to Fight alone in Telangana
x

Janasena: తెలంగాణలో ఒంటరిపోరుకు సిద్ధమైన జనసేన

Highlights

Janasena: 32 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటన

Janasena: తెలంగాణలో వచ్చే ఎన్నికలకు జనసేన పార్టీ రెడీ అయ్యింది. ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు సన్నాహాలు ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో 32 స్థానాలలో పోటీ చేయడానికి జనసేన సిద్ధమైంది. ఇక జనసేన పోటీ చేసే స్థానాలపైనా రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర నాయకులతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఇటీవల సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలను ఎంపిక చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో 32 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది జనసేన.

కూకట్‌పల్లి, ఎల్బీనగర్, నాగర్ కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్, ఉప్పల్, కొత్తగూడెం, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘనపూర్, హుస్నాబాద్, జగిత్యాల, నకిరేకల్, హుజూర్‌నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మల్కాజ్‌గిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మధిర అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేయడానికి రెడీ అయింది.

అయితే ఎన్నికల్లో ఎవరితో పొత్తులు లేవని చెబుతున్నారు జనసేన నేతలు. తెలంగాణలోనూ పవన్‌కల్యాణ్ వారాహి యాత్ర ఉంటుందన్నారు. అయితే జనసేన కేవలం ఏపీలోనే పోటీ చేస్తుందని ముందు అందరూ భావించారు. అయితే అకస్మాత్తుగా నేతలతో పవన్‌ జరిపిన సమావేశంలో తెలంగాణలోనూ పోటీ చేయాలని డిసైడ్ చేశారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది జనసేన. అయితే గ్రేటర్‌పై భారీ ఆశలు పెట్టుకున్న కమలం పార్టీకి జనసేన గండి కొడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అందుకోసమే పొత్తులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా పోటీ చేసే నియోజవర్గాలను ముందుగానే జనసేన ప్రకటించిందనే చర్చ జరుగుతోంది.

ఇక ఏపీలో తెలుగు దేశం పార్టీతో పొత్తు ప్రకటించిన ఆ పార్టీ.. తెలంగాణలో టీడీపీతో పొత్తుపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఎన్నికల నాటికి తెలంగాణ టీడీపీ, వామపక్షాలతో కలిసి పొత్తుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు రాజకీయవర్గాలో చర్చ జరుగుతోంది. మరో వైపు జనసేన ఒంటరిపోరు అధికార బీఆర్‌ఎస్‌కు లాభం చేకూర్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో జనసేన పార్టీ ఎన్నికల బరిలో ఉండనున్న నేపధ్యంలో పవన్ పార్టీ ఓటు బ్యాంకును ఏ మేరకు ప్రభావితం చేస్తుంది. పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చెయ్యటం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది? ఎవరికి నష్టం జరుగుతుందన్న చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories