మున్సిపల్‌ కానుకిచ్చిన కేటీఆర్‌కు కేసీఆర్‌ ఇవ్వబోయే బహుమానమేంటి?

మున్సిపల్‌ కానుకిచ్చిన కేటీఆర్‌కు కేసీఆర్‌ ఇవ్వబోయే బహుమానమేంటి?
x
Highlights

స్థానిక ఎన్నికల్లో ఘన విజయం. హుజూర్ ‌నగర్‌లో బంపర్‌ విక్టరీ. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో విజయఢంకా. ఎన్నికల రణక్షేత్రంలో ఇలా వరుస విజయాలతో...

స్థానిక ఎన్నికల్లో ఘన విజయం. హుజూర్ ‌నగర్‌లో బంపర్‌ విక్టరీ. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో విజయఢంకా. ఎన్నికల రణక్షేత్రంలో ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న, తారక రాముడికి పట్టాభిషేకమే తరువాయా? వేదిక ఏదైనా, బాధ్యత ఏదైనా తిరుగులేకుండా, ఎదురేలేకుండా సత్తా చాటుతున్న యువ నాయకుడికి గురుబాధ్యతలకు వేళయ్యిందా? కేసీఆర్ తర్వాత కేటీఆరేనంటూ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న డిమాండ్‌కు, ఆచరణరూపం ఇచ్చే టైమైందా? మున్సిపల్‌ విజయాన్ని తనకు మరోసారి కానుకగా ఇచ్చిన తనయుడు తారక రాముడికి, తండ్రి బహుమానం సిద్దం చేశారా? పుర ఎన్నికల జోష్‌ తర్వాత, అసలేం జరగబోతోంది?

కేటీఆర్. కల్వకుంట్ల తారక రామారావు. ఐటీ శాఖామంత్రి. పురపాలక మంత్రి. టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్. టీఆర్ఎస్‌లో కేసీఆర్‌ తర్వాత కేటీఆరే కీలక నాయకుడన్నది, తెలంగాణ భవన్‌లో అత్యధికుల మాట. కేసీఆర్‌ తర్వాత ఎవరన్న ప్రశ్న వచ్చిన ప్రతిసారీ మరో మాట తడుముకోకుండా, కేటీఆర్‌ పేరే మారుమోగుతోంది. 2020 కేటీఆర్‌కు అత్యంత కీలకమైన సంవత్సరంగా, పార్టీలో పెను మార్పుల సంవత్సరంగా పార్టీలో చర్చ జరిగింది. ఈ కొత్తేడాదిలో మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను విజయవంతంగా నిర్వహించి, కేసీఆర్‌కు కానుక ఇచ్చారు కేటీఆర్. ఇఫ్పుడు కేటీఆర్‌కు సైతం కేసీఆర్‌ బహుమానం సిద్దం చేశారన్న చర్చ ఊపందుకుంది.

2018, డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. తాను రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే, విజయసంబరాలకు మరింత ఊపునిచ్చేలా కేటీఆర్‌ను కీలక పీఠంపై కూర్చోబెట్టారు. పార్టీలో తన తర్వాత కేటీఆరేనని తేల్చేశారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేందుకు, పార్టీ ఆఫీస్‌కు భారీ ర్యాలీగా తరలివచ్చారు కేటీఆర్. ఇక అతి త్వరలో కేటీఆర్‌ పట్టాభిషేకమని సంకేతాలిచ్చినట్టయ్యింది. దీనికి అనుగుణంగా అప్పుడప్పుడు కొందరు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కూడా వ్యాఖ్యానాలు చేశారు. కేసీఆర్‌ వారసుడు కేటీఆరేనని, ఆయనే తదుపరి ప్రభుత్వాదినేత కాగల సమర్థుడని కితాబులిచ్చారు.

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, వరుసగా అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌ను విక్టరీ ట్రాక్‌లో నడిపారు కేటీఆర్. పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అత్యధిక స్థానాలొచ్చాయి. ఆ తర్వాత పరిషత్‌ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లోనూ విజయం సాధించడంతో, కేటీఆర్‌కు, గ్రామస్థాయిలో కార్యకర్తలు హారతి పట్టినట్టయ్యింది. స్థానిక ఎన్నికల్లో కేటీఆర్ పకడ్బందీ వ్యూహంతోనే విజయం సాధ్యమైందని గులాబీ నేతలు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత హుజూర్‌ నగర్‌ ఎన్నికల్లో విజయం కేటీఆర్‌ గ్రాఫ్‌ను అమాంతం పెంచేసింది. పీసీసీ ప్రెసిడెంట్‌‌ ఉత్తమ్‌ కంచుకోటను కేటీఆర్ బద్దలుకొట్టారు. ఇఫ్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ గులాబీ విజయంఢంకా మోగించారు.

మున్సిపల్ మినిస్టర్‌గా, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పుర ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేశారు కేటీఆర్‌. పార్టీని అన్ని దశల్లోనూ పరుగులు పెట్టించారు. సోషల్ మీడియాలోనూ ప్రచారాన్ని హోరెత్తించారు. ఇన్ని వరుస విజయాలు సాధిస్తున్న కేటీఆర్‌‌కు త్వరలోనే పట్టాభిషేకం ఉండబోతోందన్న అంచనాలు పెరుగుతున్నాయి. అతి త్వరలో తారక రాముడు కిరీటం ధరించబోతున్నారని, కేసీఆర్‌ ముహూర్తం ఫిక్స్‌ చేసే పనిలో వున్నారన్న చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల అఖండ విజయంతో, ఈ చర్చ మరింత ఊపందుకుంది. అయితే కేటీఆర్‌కు పట్టాభిషేకంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు, కేసీఆర్‌ చాలా సరదాగా సమాధానం ఇచ్చారు. తాను ఆరోగ్యంగా, బలంగా వున్నానని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories