Medical Colleges: మెడికల్ సీట్ల మాఫియా! సీట్ బ్లాక్ చేసి అక్రమ దందా...

Irregularity in Admission to Medical Seats in Telangana | Telugu News
x

Telangana: తెలంగాణలో మెడికల్ సీట్ల దందా కలకలం

Highlights

Medical Colleges: కోట్లు దండుకుంటున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు

Medical Colleges: తెలంగాణలో మెడికల్ సీట్ల దందా కలకలం రేపుతోంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు కోట్లకు కోట్లు దండుకోవడానికి అక్రమ మార్గాలు పట్టాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీట్లను బ్లాక్ లో అమ్ముకోవడానికి స్టే వెకెన్సీని ఆసరాగా చేసుకున్నారు. సీట్లను బ్లాక్ చేయడంతో పాటు అసలు విద్యార్థులకు సంబంధం లేకుండానే రిజిస్ట్రేషన్ చేయడం వెనక భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు తెలిసింది. మెడికల్ సీట్ల దందా ఆరోపణలపై తెలంగాణ గవర్నర్ స్పందించారు. నివేదిక ఇవ్వాలంటూ కాళోజీ యూనివర్సిటీ వీసీని ఆదేశించారు. మరో వైపు మెడికల్ సీట్ల అమ్ముకుంటున్న విషయాంపై కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పీజీ మెడికల్ సీట్ల దందా వెనుక సూత్రదారులు ఎవరన్నది ఉత్కంఠ కల్గిస్తోంది.

వైద్య విద్యలో సీటు రావాలంటే ఎంతో కష్టపడాలి. నీట్ లో మంచి ర్యాంక్ వస్తేనే మెడికల్ సీటు లభిస్తుంది. అలాంటిది నిబందనల్లో లొసుగులను వాడుకొని ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు సీట్లను అమ్ముకుంటున్నాయి. నీట్ లో మంచి ర్యాంక్ వచ్చిన ఇతర రాష్ట్రాల విద్యార్ధులతో ఇక్కడ దరఖాస్తు చేయించి వారికి మేనేజ్ మెంట్ కోటా సీట్ అలాట్ అయ్యాక వదులుకొని వెల్లిపోతున్నట్టు చెప్పిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నారై కోటా కింద ఆ సీటును అడ్డగోలు రేటుకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీట్ లో మంచి ర్యాంక్ వచ్చినా స్థానికంగా సీటు దొరక్క విద్యార్ధులు నష్టపోవాల్సి వస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. నీట్ ర్యాంకుల ఆధారంగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నీట్ ర్యాంకుల ఆధారంగా మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో 58 మంది విద్యార్ధులు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు పొందినా చేరలేదు. ఇదే జాబితాలో 12 మంది సీటు బ్లాకర్స్ ఉన్నట్లు లోకల్ స్టూడెంట్స్ ఓ జాబితా విడుదల చేశారు. దీనిపై ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ర్టాల్లో మంచి ర్యాంకులు సాధించిన కొందరు అభ్యర్దుల పేరిట అన్ని విడతల్లో ధరకాస్తు చేయిస్తున్నారు. ముందుగానే ఆయా అభ్యర్ధులతో ఒప్పందం కుదుర్చుకుంటూ కాలేజీ యాజమాన్యాలు ఇష్టానుసారంగా తమ దందా కొనసాగిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మెడికల్ సీట్ల బ్లాక్ దందాపై గతంలోనే కొందరు స్టూడెంట్లు కోర్టుకు వెళ్లిన సందర్భాలున్నాయి. కోర్టు సూచనలను సైతం కాళోజీ యూనివర్సిటీ అమలు చేయకుండా నిబంధనల ప్రకారం వైద్య విద్య ప్రవేశాల్లో ప్రైవేట్ వైద్య కాలేజీల్లో మేనేజ్ మెంట్, ఎన్నారై కోటా, వైద్యసంస్థ కేటగిరిల్లోని సీట్లను నీట్ ర్యాంకుల ప్రాతిపదికన భర్తీ చేస్తూ వస్తుంది. రాష్ట్రంలో మెడికల్ పీజీ సీటు వచ్చేందుకు సరిపడా మెరిట్ ఉన్నా ఇతర రాష్ట్రాల ర్యాంకర్లకు రావడంతో రాష్ర్టానికి చెందిన వారికి సీట్లు దక్కడం లేదు. అయితే ఇతర రాష్ర్టాల వారికి సీటు వచ్చినా వదిలేసి వెళ్తున్నారు. అయితే ఆ సీట్లను మేనేజ్ మెంట్లు అమ్ముకోవడంతో ఇక్కడి విద్యార్ధులకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలువెల్లువెత్తుతున్నాయి. బ్లాక్ దందా పై విచారణ జరిపించి బాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మెడికల్ పీజీ సీట్లకు నిర్వహించిన చివరి కౌన్సిలింగ్ లోనూ భారీగా సీట్లు మిగిలిపోయాయి. కౌన్సిలింగ్ లో 40 మంది దరఖాస్తులు అనుమానాస్పదంగా ఉన్నట్టు తేల్చింది. 40 మంది మంచి ర్యాంకులు సాధించిన వారే సొంత రాష్ర్టాల్లోనే సీటు పొందే అవకాశం ఉన్నా యాజమాన్య కోటాలో దరఖాస్తు చేసుకున్నారు. మెడికల్ సీట్ల వ్యవహారంలో అక్రమాలు ఉన్నట్టు గుర్తించిన కాళోజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ దర్యాప్తు చేపట్టాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెడికల్ సీట్ల బ్లాక్ దందాపై పోలీసులు సీరియస్ గా దర్యాప్తు మొదలు పెట్టారు.

మెడికల్ పీజీ సీట్ల కుంభకోణంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. అర్హులైనవారికి జరిగిన అన్యాయంపై తక్షణమే నివేదిక ఇవ్వాలంటూ కాళోజీ వర్సిటీ వీసీని ఆదేశించారు గవర్నర్ తమిళిసై. ఏది ఏమైనా మెరిట్ విద్యార్ధుల పేరుతో సర్టిఫికెట్ల దందా చేస్తున్న అక్రమార్కులకు చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేశారు. మెడికల్ సీట్ల కుంభకోణం వెనుక సూత్రదారులు ఎవరన్నది నిగ్గు తేల్చాల్సిన బాధ్యత పాలకులపై ఉందంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories