
పులిని చంపి ఎముకలు మాయం..చైనా చీకటి దందా బయటపెట్టిన ఐఎఫ్ఎస్ అధికారిణి
Tiger Poaching : పులి కనిపిస్తే చాలు వేటాడతారు.. చర్మాన్ని వలిచేస్తారు..అంతర్జాతీయ మార్కెట్లో పులి చర్మం కంటే దాని ఎముకలకే ఎక్కువ డిమాండ్ ఉంది. కోట్ల రూపాయల లావాదేవీలతో కూడిన ఈ అక్రమ నెట్‌వర్క్ వెనుక చైనా ట్రెడిషనల్ మెడిసిన్ హస్తం ఉందని భారత అటవీ శాఖ అధికారిణి శ్వేత బొడ్డు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. అడవికి రారాజు లాంటి పులిని ఈ ముఠాలు ఎంత కిరాతకంగా చంపుతున్నాయో ఆమె వివరించిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.
ఆ ఎముకల వెనుక కోట్ల దందా
సాధారణంగా పులి చర్మాన్ని అలంకరణ కోసం వాడతారని మనకు తెలుసు. కానీ చైనాలో ఉండే టైగర్ ఫామ్స్ ద్వారా చర్మాలు ఎలాగో దొరుకుతాయి. అయితే, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్‌లో అడవి పులుల ఎముకలకు, ముఖ్యంగా వాటిలోని గుజ్జుకు అమితమైన శక్తి ఉంటుందని అక్కడి వారి నమ్మకం. ఇవి లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయని, ఇతర రోగాలను నయం చేస్తాయని నమ్మి కోట్ల రూపాయలు పోసి కొనుగోలు చేస్తారు. ఈ డిమాండే అంతర్జాతీయ నేర ముఠాలను అడవుల వైపు నడిపిస్తోంది.
కుటుంబాలతో సహా వచ్చి.. పక్కా రెక్కీ
వేటగాళ్లు అడవిలోకి ఏదో దొంగల్లా వచ్చి వెళ్లరు. వీరు చాలా తెలివైన వారు. పత్తి పొలాల్లో పని చేసే కూలీలమని నమ్మించి తమ భార్యాపిల్లలతో సహా అడవి అంచున మకాం వేస్తారు. టార్పాలిన్ షీట్లతో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని నెలల తరబడి అక్కడే ఉంటారు. పులులు ఏ మార్గంలో వెళ్తున్నాయి? ఎప్పుడు నీళ్లు తాగడానికి వస్తున్నాయి? ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాయి? అనే విషయాలపై పక్కాగా రెక్కీ చేస్తారు. అధికారులకు అనుమానం రాకుండా ఉండేందుకు వీరు స్థానికుల్లో కలిసిపోతారు.
అవే మృత్యుపాశాలు
పులిని వేటాడేందుకు వీరు తుపాకులు వాడరు. ఎందుకంటే శబ్దం వస్తే అటవీ శాఖకు దొరికిపోతారు. అందుకే ఇనుప ఉచ్చులు ఉపయోగిస్తారు. ఇవి తుప్పు పట్టిన ఇనుప ముక్కల్లా, చెత్తలా కనిపిస్తాయి. కానీ పులి పాదం ఆ స్నేర్(ఉచ్చు)పై పడగానే అది బలంగా బిగుసుకుపోతుంది. ఆ నొప్పికి పులి కదలలేదు, గట్టిగా అరవలేదు. అలా 5 నుంచి 10 గంటల పాటు పులి నరకయాతన అనుభవిస్తుంది. అది నీరసించి స్పృహ కోల్పోయే స్థితికి రాగానే, సుమారు 8-10 మంది వేటగాళ్లు గుంపుగా వచ్చి దానిని చంపేస్తారు.
ఆనవాళ్లు లేకుండా డిస్కిన్
పులిని చంపిన తర్వాత వీరు చేసే పని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. చాలా వృత్తిపరంగా పులి చర్మాన్ని వలుస్తారు. ఆ తర్వాత ఎముకలను, గోళ్లను వేరు చేస్తారు. అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకకుండా మిగిలిన మాంసాన్ని కాల్చివేయడం లేదా లోతుగా గొయ్యి తీసి పూడ్చిపెడతారు. షిల్లాంగ్‌లోని ఒక కోఆర్డినేటర్, మయన్మార్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక మహిళ, హవాలా ఏజెంట్లతో కూడిన ఒక భారీ నెట్‌వర్క్ ఈ అక్రమ రవాణాను నిర్వహిస్తోందని ఆమె బొడ్డు వివరించారు. మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి వంటి దట్టమైన అడవుల్లో ఈ ముఠాలు ఎక్కువగా తిరుగుతుంటాయి.
ప్రజల భాగస్వామ్యం అవసరం
ఈ వేటను కేవలం తుపాకులతో ఆపలేమని, స్థానిక ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆమె పేర్కొన్నారు. కార్వా సఫారీ వంటి పర్యాటక కార్యక్రమాల వల్ల స్థానికులకు ఉపాధి దొరుకుతుందని, అప్పుడు వారు అడవిని తమ సొంత ఆస్తిగా భావిస్తారని తెలిపారు. అలాంటప్పుడు వేటగాళ్లు అడవిలోకి వస్తే స్థానికులే అటవీ శాఖకు సమాచారం అందిస్తారు. ఇది పోచింగ్‌ను అడ్డుకోవడంలో పెద్ద అస్త్రంగా మారుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




