iBomma రవి రహస్యాలు బట్టబయలు: 12 రోజుల విచారణలో సంచలన నిజాలు

iBomma రవి రహస్యాలు బట్టబయలు: 12 రోజుల విచారణలో సంచలన నిజాలు
x

iBomma రవి రహస్యాలు బట్టబయలు: 12 రోజుల విచారణలో సంచలన నిజాలు

Highlights

ఐబొమ్మ (iBomma) వెబ్‌సైట్ ద్వారా సినిమా పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టం కలిగించిన ఇమంది రవి కస్టడీ సోమవారంతో ముగిసింది.

ఐబొమ్మ (iBomma) వెబ్‌సైట్ ద్వారా సినిమా పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టం కలిగించిన ఇమంది రవి కస్టడీ సోమవారంతో ముగిసింది. గత 12 రోజులుగా పోలీసులు రవిని ముమ్మరంగా విచారించగా, కేవలం పైరసీ మాత్రమే కాకుండా ఐడెంటిటీ థెఫ్ట్ (గుర్తింపు దొంగతనం), నకిలీ డాక్యుమెంట్ల సృష్టి వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడ్డట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి.

విచారణ ప్రారంభంలో రవి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ప్రహ్లాద్ అనే వ్యక్తి తన రూమ్‌మేట్ అని, అతని పేరుతోనే లావాదేవీలు జరిగాయని చెప్పాడు. అయితే పోలీసులు బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను రప్పించి, రవి ఎదుటే విచారణ జరపగా అసలు నిజం బయటపడింది. తనకు రవి ఎవరో తెలియదని, తామిద్దరం ఎప్పుడూ కలవలేదని ప్రహ్లాద్ స్పష్టంగా వెల్లడించాడు. సోషల్ మీడియాలో లభించిన ప్రహ్లాద్ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను ఉపయోగించి రవి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన పేరుతో ఇన్ని అక్రమాలు జరిగాయని తెలుసుకున్న ప్రహ్లాద్ తీవ్ర షాక్‌కు గురయ్యాడు.

రవి అక్రమ వ్యాపారం ఎంత భారీ స్థాయిలో సాగిందో అతని వద్ద స్వాధీనం చేసుకున్న డేటా చూస్తే అర్థమవుతోంది. దాదాపు 28 వేలకుపైగా సినిమాలను అతడు తన వద్ద స్టోర్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో తెలుగు, తమిళం, హిందీ భాషలకు చెందిన పాతవి, కొత్తవి అన్నీ ఉన్నాయి. వీటిని అత్యంత నాణ్యమైన (హై క్వాలిటీ) ప్రింట్లుగా మార్చి 10కి పైగా హార్డ్ డిస్క్‌లలో భద్రపరిచాడు. ఒక సర్వర్ బ్లాక్ అయినా, మరో సర్వర్ ద్వారా నిమిషాల్లోనే వెబ్‌సైట్‌ను మళ్లీ ఆన్‌లైన్‌లోకి తెచ్చేలా అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను కూడా రవే స్వయంగా రూపొందించుకున్నాడని పోలీసులు తెలిపారు.

కొత్త సినిమాల పైరసీ ప్రింట్లను ఆటోమేటెడ్ టెలిగ్రామ్ బాట్ల ద్వారా సేకరించి, వాటిని డీఆర్‌ఎం (DRM) సాఫ్ట్‌వేర్ సహాయంతో హైఎండ్ క్వాలిటీగా మార్చేవాడని విచారణలో వెల్లడైంది. అయితే విచారణ అనంతరం రవి తనపై ఆరోపణలను ఖండిస్తూ, తాను పైరసీ చేయలేదని, కేవలం ఇంటర్నెట్‌లో దొరికిన సినిమాలనే అప్‌లోడ్ చేశానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, తాను విదేశీయుడినని పేర్కొంటూ తనపై కేసులు పెట్టడం సరికాదని వాదించే ప్రయత్నం కూడా చేశాడు.

కస్టడీ ముగియడంతో రవిని పోలీసులు తిరిగి కోర్టులో హాజరుపరిచారు. నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారంలో ప్రహ్లాద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రవిపై మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ కేసు తెలుగు సినిమా పరిశ్రమతో పాటు సైబర్ క్రైమ్ విభాగంలోనూ తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories