Traffic Police Alert : హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్..మార్చి 1 నుంచి లైసెన్స్ లేకపోతే బండి గల్లంతే

హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్..మార్చి 1 నుంచి లైసెన్స్ లేకపోతే బండి గల్లంతే

CR Reddy
Published on: 12 Feb 2026 7:02 AM IST
Traffic Police Alert : హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్..మార్చి 1 నుంచి లైసెన్స్ లేకపోతే బండి గల్లంతే
X

Traffic Police Alert : హైదరాబాద్ వాహనదారులారా జాగ్రత్త. ఇప్పటిదాకా హెల్మెట్ లేకపోతేనో, సిగ్నల్ జంప్ చేస్తేనో పోలీసులు జరిమానాలు వేసేవారు. కానీ ఇకపై మీ జేబులో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మాత్రం బండి నేరుగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లే ప్రమాదం ఉంది. మార్చి 1 నుంచి భాగ్యనగరంలో ట్రాఫిక్ పోలీసులు భారీ ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. లైసెన్స్ లేని వారి పని పట్టేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరవాసులకు తేల్చి చెప్పారు. మార్చి 1 నుంచి ప్రతి జంక్షన్‌లోనూ తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. మీ దగ్గర వాహనం నడపడానికి అవసరమైన ఒరిజినల్ లైసెన్స్ లేదా డిజిటల్ కాపీ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటి వరకు కేవలం రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌పై దృష్టి పెట్టిన పోలీసులు, ఇకపై ప్రతి వాహనదారుడి లైసెన్స్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. ఒకవేళ లైసెన్స్ లేకుండా పట్టుబడితే భారీ జరిమానాతో పాటు వాహనాన్ని సీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

చాలామంది తమ ఇంట్లో పిల్లలకో లేదా స్నేహితులకో లైసెన్స్ లేకపోయినా బండి ఇస్తుంటారు. అయితే ఇకపై ఇది చెల్లదు. లైసెన్స్ లేని వ్యక్తికి వాహనాన్ని అప్పగిస్తే, ప్రమాదం జరిగినప్పుడు వాహన యజమానిని కూడా బాధ్యుడిని చేస్తారు. అంతేకాదు లైసెన్స్ లేని వ్యక్తి వాహనం నడిపి ప్రమాదం చేస్తే, ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక్క రూపాయి కూడా క్లెయిమ్ ఇవ్వవు. దీనివల్ల ప్రమాద బాధితులకు చెల్లించాల్సిన పరిహారం మొత్తం యజమాని జేబు నుంచే చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. వాహన రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుంటున్నారని, పెండింగ్ చలాన్ల డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచే కట్ అవుతాయని చాలామంది ఆందోళన చెందుతున్నారు. దీనిపై రవాణా శాఖ క్లారిటీ ఇచ్చింది. అలాంటి ఆదేశాలు ఏమీ లేవని, చలాన్ల కోసం బ్యాంక్ అకౌంట్లను లింక్ చేసే ఆలోచన ప్రస్తుతం లేదని స్పష్టం చేసింది. వాహనదారులు ఇలాంటి రూమర్లను నమ్మవద్దని కోరింది. అయితే, చలాన్లు సకాలంలో కట్టడం మాత్రం మీ బాధ్యత అని గుర్తు చేసింది.

నగరంలో ఇప్పటికే రాంగ్ రూట్ డ్రైవింగ్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత పది రోజుల్లోనే వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు లైసెన్స్ డ్రైవ్ కూడా తోడవడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీకు లైసెన్స్ లేకపోతే, వెంటనే సమీపంలోని ఆర్టీఏ కార్యాలయంలో ఎల్ఎల్ఆర్ కోసం స్లాట్ బుక్ చేసుకోండి. మార్చి 1 నాటికి మీ దగ్గర చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉండేలా చూసుకోవడం వల్ల జరిమానాలు, చట్టపరమైన సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

CR Reddy

CR Reddy

Next Story