గ్రేటర్‌ అనుభవాన్ని గులాబీ సేన ఎలా తీసుకుంటోంది..?

గ్రేటర్‌ అనుభవాన్ని గులాబీ సేన ఎలా తీసుకుంటోంది..?
x
Highlights

సీమాంధ్ర ప్రజలు గత ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్‌నే బలపరిచారు. ఇప్పుడు కూడా వారి మద్దతు గులాబీ పార్టీకే లభించింది. టీడీపీ 106 సీట్లలో పోటీ చేసినా...సీమాంద్ర పార్టీ అయినా...ఒక్క స్థానంలో కూడా డిపాజిట్లు దక్కలేదు.

గ్రేటర్‌ అనుభవాన్ని గులాబీ సేన ఎలా తీసుకుంటోంది..? లోపాల్ని సరిదిద్దుకుంటుందా? దూరమైన వర్గాలను దగ్గర చేసుకుంటుందా? పార్టీలో, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఎలా చల్లారుస్తారు..? కాషాయసేనను ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఎటువంటి వ్యూహం అనుసరించబోతోంది..?

గడచిన ఆరున్నరేళ్ళుగా గులాబీదళం సాగించిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ రాజకీయాలతో కాంగ్రెస్‌ పతనావస్థకు చేరుకుంది. ఎమ్మెల్సీలు...ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్‌ను దెబ్బతీసానని కేసీఆర్‌ భావించారు. కాని కాంగ్రెస్‌ లేని లోటును భర్తీ చేయడానికి కాషాయసేన దూసుకొచ్చిన విషయాన్ని ఆలస్యంగా గ్రహించారాయన. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం అవసరం తెలిసినప్పటికీ ..కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం మీదున్న కోపంతో...రాష్ట్రంలో ఆ పార్టీని నిర్వీర్యం చేశారు. దీంతో ప్రతిపక్షంలో ఉన్న శూన్యాన్ని భర్తీ చేసే అవకాశం బీజేపీ దక్కించుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో కాషాయసేన దూకుడు స్పష్టంగా కనిపించింది. గ్రేటర్‌లో గులాబీదళానికి చుక్కలు కనిపించాయి..

టీఆర్‌ఎస్‌ పాలనలో తొలి ఐదేళ్ళు ఎదురులేకుండా సాగింది. లో్క్‌సభ ఎన్నికల్లో సీట్లు తగ్గడాన్ని మోడీ గాలిగా భావించారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్‌నగర్‌ సీటును గెలుచుకోవడంతో...గులాబీ పట్టు మరింత బిగుసుకుందని భావించారు. అయితే దుబ్బాక ఉప ఎన్నిక తేడా కొట్టింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో తేడా మరింత స్పష్టమైంది. దీంతో ఫలితాలను సమీక్షించుకుని ముందుకు సాగుతామని చెప్పారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైనప్పటినుంచీ పార్టీలో కొనసాగిన వారిని పక్కన పెట్టి...రాష్ట్రం వచ్చిన తర్వాత చేరినవారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శ ఉంది. ఈ ఆరోపణలతోనే శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ గులాబీ గూటిని వదిలి కమలం చెంతకు చేరారు. ఇలా ఎందరో నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అధికార పార్టీ కావడంతో బయటపడలేకపోతున్నారు. బహిరంగంగా తమ ఆవేదనను పంచుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో అటువంటి వారు సరిగా పనిచేయలేదనే వాదన వినిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ నాయకత్వం మీదున్న కోపం తెలంగాణ ప్రజానీకాన్ని బీజేపీకి దగ్గర చేసింది. గ్రేటర్‌లో సీమాంధ్ర ప్రజలు ఎక్కువగా టీఆర్‌ఎస్‌కు ఓటేయగా...ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు, తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి సెటిలైనవారు...హైదరాబాద్‌ స్థానికులంతా బీజేపీకి జై కొట్టారు.

సీమాంధ్ర ప్రజలు గత ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్‌నే బలపరిచారు. ఇప్పుడు కూడా వారి మద్దతు గులాబీ పార్టీకే లభించింది. టీడీపీ 106 సీట్లలో పోటీ చేసినా...సీమాంద్ర పార్టీ అయినా...ఒక్క స్థానంలో కూడా డిపాజిట్లు దక్కలేదు. అయితే తెలంగాణ ప్రజల అసంతృప్తి మొన్న దుబ్బాకలోను..ఇప్పుడు హైదరాబాద్‌లోను బయటపడింది. గ్రేటర్‌లో ఉద్యోగులు, నిరుద్యోగులు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనే వాదన కూడా వినిపిస్తోంది. వరద బాధితులైతే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సహాయం కొందరికే ఇచ్చారని...అది కూడా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తినేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇల్లీగల్‌ లేఅవుట్స్‌కు LRS కట్టాలనే ఉత్తర్వులు..ధరణి వెబ్‌సైట్‌తో ఇబ్బందులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాయి.

రెండోసారి అధికారంలోకి రాగానే ప్రతి జిల్లాలోనూ రెండు మూడు రోజులుండి.. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కాని ఒక్క జిల్లాలో కూడా పర్యటించలేదు. ప్రజాక్షేత్రంలో అనేక సమస్యలు పేరుకుపోతున్నాయి. కేసీఆర్‌ ప్రగతి భవన్‌ నుంచి బయటకు రారనే అసంతృప్తి ప్రజల్లోను..కార్యకర్తల్లోనూ తీవ్రంగా ఉంది. గ్రేటర్‌ ప్రజల్లో ఉన్న అసంతృప్తి కారణంగానే 35 మంది సిటింగ్‌ కార్పొరేటర్లు ఓటమి చెందారు. ప్రజల్లో వ్యతిరేకత గూడు కట్టుకుని ఉంది. సరైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇప్పటివరకు అది బయటపడలేదు. బీజేపీ దూకుడుతో వ్యవహరిస్తూ...తానే ప్రత్యమ్నాయమనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించింది. దీంతో టీఆర్‌ఎస్‌ కోల్పోయిన సీట్లన్నీ బీజేపీ ఖాతాలో పడ్డాయి.

గ్రేటర్‌లో లక్ష ఇళ్ళ హామీ నెరవేర్చలేకపోయారు. అలాగే దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ మరచిపోయారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదు. ఇలా ఎన్నో సమస్యలు, హామీలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇప్పటికైనా పార్టీలోను...ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లోనూ ఉన్న లోపాలను సరిదిద్దుకుని...హామీల అమలుకు కార్యాచరణలోకి దిగడం అవసరమనే వాదన వినిపిస్తోంది. త్వరలోనే గ్రేటర్‌ ఫలితాలపై టీఆర్‌ఎస్‌లో సమీక్ష జరిగే అవకాశం కనిపిస్తోంది. లోపాలన్నీ సరిచేసుకుని..ప్రజలకు మళ్ళీ దగ్గరైతేనే బీజేపీకి చెక్‌ పెట్టడం సాధ్యమవుతుందని విశ్లేషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories