Koti Lingala Temple : కొలిచినవారి కొంగు బంగారు దేవుడు కోటిలింగేశ్వరుడు

Koti Lingala Temple : కొలిచినవారి కొంగు బంగారు దేవుడు కోటిలింగేశ్వరుడు
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

జగమంతా అయన స్వరూపమే అంటారు. భక్త జన కోరికలు తీర్చే కొంగుబంగారమని విశ్వసిస్తారు. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని నమ్ముతారు. ఆయనే బోళాశంకరుడు. అభిషేక...

జగమంతా అయన స్వరూపమే అంటారు. భక్త జన కోరికలు తీర్చే కొంగుబంగారమని విశ్వసిస్తారు. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని నమ్ముతారు. ఆయనే బోళాశంకరుడు. అభిషేక ప్రియుడు.. సమస్త జగానికీ సృష్టి స్థితి లయకారుడు ఆ పరమశివుడే అని భక్త జనకోటి మొక్కుతారు. ఆయన దర్శనమే సర్వపాపహరణం అనీ, శివ నామ స్మరణే మోక్ష మార్గమని ప్రగాఢమైన విశ్వాసంతో ఆయనకు పూజాదికాలు నిర్వహిస్తారు భక్త జనాళి!

సృష్టిని నడిపించే లయకారుని ఆజ్ఞ లేనిదే గాలి కూడా ముందుకు సాగదు. ఇలాంటి శివుడ్ని ఎంతో మంది భక్తులు కొలుస్తారు. ప్రతి నిత్యం అభిషేకాలతో ముంచుతారు. తెలంగాణ రాష్ట్రంలో మహాశివుడ్ని కొలవడానికి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాలను భక్తులు నిర్మిస్తే, మరికొన్ని ఆలయాల్లో దేవదేవుడే స్వయంభూగా వెలిశివునట్లు చరిత్ర చెబుతోంది. ఇలాంటి ఆలయాల్లో ఒకటి ఇప్పటి జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల క్షేత్రం. ఆ క్షేత్రానికి వెళ్లిన భక్తుల కోరికలను ఇట్టే తీర్చేస్తాడని ప్రతీతి. పిల్లలు లేనివారికి సంతాన ప్రాప్తిని కలిగిస్తాడని భక్తుల విశ్వసం.

ఆ క్షేత్ర విశేషాలు ఇవీ!

ఇంత ప్రఖ్యాతి గాంచిన ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలోని ఒక కుగ్రామంలో ఉంది. ఒక వైపు గ్రామానికి ఉత్తరాన, పడమర నుండి తూర్పుకు ప్రవహించే గోదావరి, మరో వైపు పిల్లకాలువలు, పంటపొలాలు, పచ్చని వాతావరణం ఉంటుంది. ఈ నదీ ఒడ్డునే వెలిసాడు కోటిలింగేశ్వరుడు. ఈ క్షేత్రానికి ఇంకా కొద్ది దూరంలోనే పెద్దవాగు, గోదావరి నది సంగమిస్తాయి. ఆ సన్నివేశాన్ని చూస్తేచాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రెండు కలిసే చోటును మునేరు అంటారు. పూర్వకాలంలో ఇక్కడ మునులు స్నానం చేసేవారట. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.

కోటిలింగాల అంటే ఇక్కడ కోటి శివలింగాలు ఉండడం కాదు. శాతవాహనుల కాలంలో 110 ఎకరాల విస్తీర్ణంలో దీర్ఘచతురస్రాకారంలో ఉన్న పెద్దకోటలో ఒక లింగాన్ని ప్రతిష్టించారు. ఈ కోటలో ఎత్తైన గోడలతో పాటు నాలుగు మూలల్లో ఎత్తైన కోట బురుజులు కూడా ఉంటాయి. వాటి ఈశాన్య మూలన ఉన్న కోట బురుజు శిథిలమై ఎత్తైన గడ్డగా మారిన తర్వాత కాలంలో ఈ గడ్డపైన గుడికట్టి, లింగాన్ని ప్రతిష్ఠించారు. అప్పటినుంచి దాన్నే కోటలింగం అని అనేవారు. ఆ ఆలయమే కాలక్రమేణ కోటిలింగంగా రూపాంతరం చెందింది. అందులో వెలసిన దేవుడు కోటేశ్వరస్వామిగా పిలవబడుతున్నాడు.

అంతే కాదు ఒకప్పుడు ఈ క్షేత్రం చారిత్రక బౌద్ధక్షేత్రంగా ఉండేది. మూడు దశాబ్దాల క్రితం చారిత్రక పట్టణంగా వెలుగులోకి వచ్చిన కోటిలింగాల శాతవాహనుల రాజధానిగా చారిత్రక పరిశోధకులు భావించారు. క్రమక్రమంగా త్రవ్వకాలలో లభించిన ఆధారాలను బట్టి ఇదే శాతవాహనుల తొలి రాజధానిగా నిర్థారించారు. కోటిలింగాలలో లభించిన శ్రీముఖుని నాణేలు వారి రాజధాని కోటలింగాల అని నిరూపించినట్లు ప్రముఖ చారిత్రక పరిశోధకులు తెలిపారు. పురావస్తు శాఖ వారు రెండు సార్లు త్రవ్వకాలు జరిపారు. మొదట 1979 నుండి 1984 వరకు, రెండవసారి ఫిబ్రవరి 2009లో జరిగాయి. మొదటిసారి 1979లోత్రవ్వకాలు జరిపినపుడు ఈ ప్రాచీన నగరం బయల్పడింది. ఇకపోతే ఈ ఆలయానికి అతి చేరువలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంది.

ఈ క్షేత్రానికి ఇలా చేరుకోవచ్చు..

ఈ క్షేత్రం హైదరాబాద్ నుంచి దాదాపుగా 220 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి బస్సు మార్గం ద్వారా, రైలు మార్గం ద్వారా వెళ్లొచ్చు. బస్సు మార్గం ద్వారా వెళ్లాలనుకున్నవారు హైదరాబాద్ నుంచి రెండు దారుల గుండా చేరుకోవొచ్చు. హైదరాబాద్ నుంచి సిద్ధిపేట మీదుగా వేముల వాడ చేరుకొని అక్కడ నుంచి జగిత్యాల చేరుకోవొచ్చు. అక్కడి నుంచి ఆటో ద్వారా కోటిలింగాల ఆలయానికి చెరుకోవొచ్చు.

మరోదారి గుండా వెళితే కరీంనగర్ చేరుకొని అక్కడి నుంచి జగిత్యాల చేరుకోవాల్సి ఉంటుంది. జగిత్యాల నుంచి బస్సు ద్వారానో, ఆటో ద్వారానో ఆలయానికి చేరుకోవొచ్చు.

ఇక పోతే రైలు మార్గం ద్వారా వెళితే సికింద్రాబాద్ స్టేషన్లో రైలు ఎక్కి పెద్దపల్లి స్టేషన్ లో దిగాలి. అక్కడి నుంచి బస్సు ద్వారా సుగమంగా ఆలయానికి చేరుకోవొచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories