బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు హైకోర్టు నోటీసులు

Telangana High Court notice to Bellampalli MLA
x

తెలంగాణా హైకోర్టు 

Highlights

డీఎమ్ ఎఫ్ టీ నిధుల దుర్వినియోగంపై అధికారుల గట్టి చర్యలు తీసుకోకపోవడంతో మంచిర్యాల బీజేపీ నాయకుడు, గొల్లపల్లి ఎంపీటీసీ హరీష్ గౌడ్ ఈ నెల ఆరో తేదిన హైకోర్టులో పిటిషన్ వేశారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గానికి డీఎమ్ ఎఫ్ టీ కింద 90 లక్షల రూపాయల నిధులను సింగరేణి సంస్థ కేటాయించింది. ఈ నిధులను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఓ లేఖ రాసి క్యాన్సల్ చేయించారు. నిబంధనలను తుంగలో తొక్కి కన్నాల గ్రామంలో ప్రైవేట్ వెంచర్లకు లబ్ధి చేకూర్చేందుకు 53 లక్షల రూపాయలు కేటాయించారు. ఆ వెంచర్లలో డీఎమ్ ఎఫ్ టీ నిధులతో రోడ్ల నిర్మాణం చేపట్టారు.

డీఎమ్ ఎఫ్ టీ నిధులను వెనుకబడిన గ్రామాలకు కాకుండా కన్నాలలోని ప్రైవేట్ వెంచర్లకు కేటాయించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. డీఎమ్ ఎఫ్ టీ నిధులను ఎమ్మెల్యే సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపించాయి. ఈ విషయంపై పంచాయితీరాజ్ అధికారులకు ఆయా పార్టీల నేతలు ఫిర్యాదు చేశారు.

డీఎమ్ ఎఫ్ టీ నిధుల దుర్వినియోగంపై అధికారుల గట్టి చర్యలు తీసుకోకపోవడంతో మంచిర్యాల బీజేపీ నాయకుడు, గొల్లపల్లి ఎంపీటీసీ హరీష్ గౌడ్ ఈ నెల ఆరో తేదిన హైకోర్టులో పిటిషన్ వేశారు. మారుమూల గ్రామాల్లో సరియైన రోడ్డు సౌకర్యంలేక ప్రజలు అవస్థలు పడుతుంటే, ప్రైవేట్ వెంచర్లలో రోడ్లు వేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి తదితర అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై ఈ నెల 22లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

హై కోర్టు నోటీసులపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో పాటు ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఇప్పటికైనా డీఎమ్ ఎఫ్ టీ నిధులను వెనుకబడిన గ్రామాలకు కేటాయించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి. కన్నాల గ్రామంలో ప్రైవేట్ వెంచర్లలో డీఎమ్ ఎఫ్ టీ నిధులతో వేస్తున్న రోడ్లపై ప్రభుత్వం హై కోర్టుకు ఏం వివరణ ఇవ్వనుంది అనే విషయంపై మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories