logo
తెలంగాణ

తెలంగాణకు మరో రెండ్రోజుల పాటు భారీ వర్ష సూచన

Heavy Rains In Telangana For Next Two Days
X

తెలంగాణకు మరో రెండ్రోజుల పాటు భారీ వర్ష సూచన

Highlights

Telangana: నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

Telangana: నిన్న ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్‌ నగరం తడిసి ముద్దవుతోంది. కుండపోత వర్షంతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుత్బుల్లాపూర్ పరిసరాల్లో భారీ వర్షం కారణంగా ప్రసూననగర్, మల్లికార్జున నగర్, వాని నగర్, ఇంద్రసింగ్ నగర్, శ్రీనివాస్ నగర్ ను వరద ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రంగంలోకి దిగిన GHMC సిబ్బంది ఎప్పటికప్పుడు రోడ్లపై నీటిని క్లియర్‌ చేస్తున్నారు. అటు DRF టీమ్స్ అలర్టయ్యాయి.

నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కూకట్‌పల్లిలో రోడ్లన్నీ నీటమునిగాయి. మెట్రో స్టేషన్ల కింద మోకాలు లోతుకు పైగా వాటర్‌ నిలిచిపోయింది. దీంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు మెట్రో స్టేషన్ల కింద ఉన్న టైల్స్‌ను తొలగించారు.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణకు మరో రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన చేసింది. ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఐదు జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన చేసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్‌, ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. యాదాద్రి, సూర్యాపేట, జనగాం, మహబూబాబాద్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణశాఖ. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ ప్రకటించింది.

మరోవైపు తెలంగాణలో గత వారంలో కురిసిన వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 వందల కోట్ల మేర నష్టం జరిగినట్టు.. ప్రాథమిక అంచనాలను కేంద్రానికి పంపించింది టీ సర్కార్. భారీ వర్షాలతో రోడ్లు భవనాల శాఖకు సంబంధించి 498 కోట్లు, పంచాయితీ రాజ్‌ శాఖలో 449 కోట్లు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో 379 కోట్లు, ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో 33 కోట్లు, విద్యుత్‌శాఖలో 7 కోట్లు నష్టం వాటిల్లినట్టు నివేదికలు సిద్ధం చేసి, కేంద్రానికి పంపింది ప్రభుత్వం. ముంపు బాధితులను ఆదుకోవడం, వారిని తరలించే క్రమంలో 25 కోట్లు ఖర్చయినట్టు కేంద్రానికి పంపిన నివేదికలో తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. తక్షణ సాయంగా వెయ్యి కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరింది టీ సర్కార్.

తెలంగాణలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించింది. ఆరుగురు సభ్యుల బృందం.. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిలాల్లో పర్యటించి జిల్లాల కలెక్టర్ల నుంచి ఎక్కడ, ఎంత నష్టం జరిగిందన్న దానిపై చర్చించింది. కడెం ప్రాజెక్టు నుంచి భద్రాచలం వరకు జరిగిన నష్టంపై పూర్తి అంచనాలను సిద్ధం చేసుకుంది కేంద్ర బృందం. అనంతరం తెలంగాణ సచివాలయంలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో భేటీ అయ్యారు కేంద్ర బృందం సభ్యులు. వరదల కారణంగా రాష్ట్రంలో భారీగా నష్టం వాటిల్లిందని సీఎస్‌ కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. తక్షణ సాయంగా వెయ్యి కోట్లు విడుదల చేయాలని బృందం సభ్యులను కోరారు. మరి ప్రభుత్వం విన్నపంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Web TitleHeavy Rains In Telangana For Next Two Days
Next Story