పోడు రైతులకు హరితగండం

Greenery for Podu farmers
x

పోడు రైతులకు హరితగండం

Highlights

Podu Farmers: *హరితహారంతో ఏజెన్సీలోని పోడుభూముల్లో అలజడి

Podu Farmers: పోడు రైతుకు హరితగండం ముంచుకోస్తుంది. వర్షాకాలం ఆరంభం కాగానే ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టే హరితహారం కార్యక్రమంలో ఏజెన్సీలోని పోడు భూముల్లో అలజడి మొదలవుతుంది. ఈసారి ముందుగానే అప్రమత్తమైన ఏజెన్సీ పోడు భూముల రైతులు వామపక్షాల ద్వారా తమ భూములను కాపాడుకునేందుకు ప్రతిఘటనకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి దున్నేవారిదే భూమి నినాదం ఆచరణ రూపంలోనూ అడవుల్లో ఎప్పట్నుంచో కొనసాగుతూ వస్తోంది. అందులో భాగంగానే ఏజెన్సీలో పోడు భూముల్ని సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.

అడవి బిడ్డలకు ఆ భూములపై హక్కు పత్రాలు ఇవ్వకపోగా ఉన్న భూములను ఏటేటా హరితహారం పేరిట అటవీశాఖ అధికారులు లాక్కొనే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. వేసవి కాలం పోతుందనగానే అటవీశాఖ హరితహారం పేరిట పోడు భూములపై కన్నెస్తోంది. పోడు రైతులకు రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల మద్దతు లభిస్తూ వస్తోంది. మహబూబాబాద్‌ జిల్లా వ్యాప్తంగా లక్ష ఎనిమిది వేల ఎకరాలకు పైగా పోడు భూముల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు. వాటిపై హక్కుపత్రాలు సాధించేందుకు పోడు రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.

పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలని అనేక ఏళ్లుగా పోడు ఉద్యమాలు సాగుతున్నప్పటికీ పరిష్కార మార్గం కన్పించడం లేదు. అంతేకాదు ఆ భూమి అటవీశాఖ పరిధిలో ఉందంటూ అధికారులు ట్రెంచ్‌లు కొడుతుండడంతో అడ్డుపడ్డ పోడు రైతులపై దాడులు జరుగుతున్న సంఘటనలు ప్రతియేట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు పోడు భూముల జోలికి వెళ్లోద్దని స్పష్టంగా చెప్పినప్పటికి దాడుల పరంపర మాత్రం ఆగడం లేదని రైతులు వాపోతున్నారు. 2005 అటవీహక్కుల చట్టం ప్రకారం పోడు రైతులకు హక్కుపత్రాలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడంతో గిరిజన ప్రాబల్యం ఈ జిల్లాలో ఏకంగా 32వేల, 694 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆరు నెలలు గడుస్తున్నా నేటికి హక్కు పత్రాలు లభ్యం కాలేదు. పోడు సాగు దారులకు హక్కు పత్రాలివ్వాలని వామపక్ష పార్టీలు, అనుబంధ రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. స్వరాష్ట్రం ఆవిర్భవించి ఎనిమిదేళ్లనా పోడు భూములకు పరిష్కారం లభించడంలేదని రైతులు వాపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories