Pod Taxi : ఆటో డ్రైవర్లతో గోల లేదు.. ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఐటీ కారిడార్‌లో డ్రైవర్ లేని ట్యాక్సీలు

Pod Taxi : ఆటో డ్రైవర్లతో గోల లేదు.. ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఐటీ కారిడార్‌లో డ్రైవర్ లేని ట్యాక్సీలు
x
Highlights

ఆటో డ్రైవర్లతో గోల లేదు.. ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఐటీ కారిడార్‌లో డ్రైవర్ లేని ట్యాక్సీలు

Pod Taxi : హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చే దిశలో తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న అడుగు వేసింది. నిత్యం ట్రాఫిక్ నరకంతో సతమతమయ్యే ఐటీ కారిడార్ ప్రయాణికుల కోసం పాడ్ టాక్సీ లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీనినే సాంకేతిక భాషలో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్(PRT) అని పిలుస్తారు. మెట్రో రైలు దిగాక ఆఫీసులకో, ఇళ్లకో వెళ్లడానికి ఆటోలు, బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, నేరుగా గాలిలోనే ప్రయాణించేలా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నారు. బుధవారం ఈ ప్రాజెక్టుకు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ అధ్యయనానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

సాధారణంగా మెట్రో దిగిన తర్వాత ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇబ్బంది పడుతుంటారు. ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ సమస్యను తీర్చడమే ఈ పాడ్ టాక్సీల ప్రధాన లక్ష్యం. ఇవి రోడ్డుపై కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎలివేటెడ్ ట్రాక్‌లపై నడుస్తాయి. ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో చేపట్టబోతున్నారు. దీనికోసం ఎంపికైన కన్సల్టెంట్ సంస్థ 120 రోజుల్లో సాధ్యాసాధ్యాల నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రాబోయే కొద్ది నెలల్లోనే ఈ డ్రీమ్ ప్రాజెక్టు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.

తొలి దశలో ఈ పాడ్ టాక్సీలను రాయదుర్గం - కూకట్‌పల్లి మార్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సిటీ, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ పరిసరాలు, కొత్త సచివాలయం వంటి రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇవి పూర్తిగా ఆటోమేటెడ్, అంటే డ్రైవర్ అవసరం లేకుండా కంప్యూటర్ నియంత్రణ ద్వారా నడుస్తాయి. బ్యాటరీ లేదా విద్యుత్‌తో నడవడం వల్ల శబ్ద కాలుష్యం గానీ, వాయు కాలుష్యం గానీ ఉండదు. ఒక్కో పాడ్‌లో 6 నుంచి 8 మంది కూర్చునే వీలుంటుంది. గంటకు సుమారు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, గంటకు 10 వేల మందిని గమ్యస్థానాలకు చేర్చే సామర్థ్యం వీటికి ఉంటుంది.

ఈ పాడ్ టాక్సీల వల్ల కలిగే మరో పెద్ద ప్రయోజనం సమయం ఆదా. మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడే యాప్ ద్వారా పాడ్ టాక్సీని బుక్ చేసుకుంటే, మీరు స్టేషన్ చేరుకునే సరికి టాక్సీ సిద్ధంగా ఉంటుంది. భారతదేశంలో ఇప్పటికే ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‎లో ఇలాంటి ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్ కూడా అదే బాటలో పయనిస్తూ దేశంలోనే అత్యాధునిక రవాణా సౌకర్యం ఉన్న నగరంగా నిలవబోతోంది. ఈ ప్రాజెక్టు గనుక పూర్తయితే ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాల నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories