ఆర్టీసీ సమ్మెపై కేంద్రం నజర్‌..హుటాహుటిన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన గవర్నర్ తమిళిసై

ఆర్టీసీ సమ్మెపై కేంద్రం నజర్‌..హుటాహుటిన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన గవర్నర్ తమిళిసై
x
Highlights

తెలంగాణ గవర్నర్‌ హుటాహుటిన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే ఈ ఉదయం హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు. ఈ రెండు విషయాల మధ్య సంబంధం...

తెలంగాణ గవర్నర్‌ హుటాహుటిన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే ఈ ఉదయం హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు. ఈ రెండు విషయాల మధ్య సంబంధం ఏంటనేదానిపైనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. తెలంగాణలో ఉధృతంగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో ఆర్టీసీ స్మమ్మెపై కేంద్రం పరిశీలిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ బాంబు పేల్చారు. దీంతో ఆర్టీసీ కేంద్రంగా తెలంగాణ పాలిటిక్స్‌ హీటెక్కాయి.

అటు ప్రభుత్వం బెట్టువదలకపోవడం ఇటు ఆర్టీసీ జేఏసీ పట్టువీడకపోవడం మధ్యలో సాధారణ కార్మికులు సమిధలు కావడం గత 10 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె ఎటువైపు వెళ్తుందో అన్న సమయంలో తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ఎంటరయ్యారు టీఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు. అన్నదే తడవుగా ఈ ఉదయం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సాయంత్రం ఆయన సీఎం కేసీఆర్‌తో సమావేశమవుతారని తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన సూచన మేరకే ఆర్టీసీ జేఏసీతో కేకే చర్చలు జరుపుతారని చెబుతున్నారు.

ఒకేసారి సుమారు 50 వేల మంది ఉద్యోగాలు తొలగించడం తీవ్ర నిర్ణయంగా చెబుతున్నారు. ఇదే అంశంపై కేంద్రానికి రాష్ట్ర బీజేపీ కమిటీ ద్వారా ఓ నివేదికను అందజేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. ఉద్యోగాల విషయంలో కార్మికులు పడుతున్న ఆవేదనను కూడా నివేదికలో పొందుపర్చామని వెల్లడించారు. ఇప్పటికే ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం మరో ఇద్దరు ఆత్మహత్యకు ప్రయత్నించడం కొందరికి గుండెపోటు రావడం వంటివి పరిస్థితి తీవ్రతను చెబుతున్నాయని వివరించారు.

ఇదిలా ఉండగానే ఈ ఉదయం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. హస్తినకు రావాలంటూ కేంద్రం నుంచి కబురు అందగానే ఫ్లైట్ ఎక్కారు. ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడటంతో పాటు ఇద్దరు కార్మికులు బలవన్మరణాలకు పాల్పడటం స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఢిల్లీ పెద్దలు నజర్ వేశారని తెలుస్తోంది. ఇటీవలే ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమై సమ్మె వివరాలతో పాటు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ఫిర్యాదు చేశారు. ఈ భేటీ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. వెంటనే తమిళిసై ఢిల్లీకి వెళ్లడంతో పరిస్థితులు ఎలా మారుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

తమిళి సై ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోడీతో, సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు ఆర్టీసీ సమ్మె నేపథ్యాన్ని, దాని తాలూకు పరిణామాలను వివరిస్తారని తెలుస్తోంది. దీంతో ఢిల్లీలో గవర్నర్‌ చర్చలు, ఇటు హైదరాబాద్‌లో కేకే చర్చలు ఆర్టీసీ సమ్మెకు బ్రేక్‌ వేస్తాయా..? లేదా..? అన్నది ఉత్కంఠగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories