Telangana: రాష్ట్రంలో తెల్లబంగారానికి మంచి గిరాకీ

Good Demand for Cotton in Telangana | TS News Today
x

Telangana: రాష్ట్రంలో తెల్లబంగారానికి మంచి గిరాకీ

Highlights

Telangana: క్వింటాల్‌కు రూ.500 నుంచి... వెయ్యి రూపాయలు నష్టపోతున్న రైతులు

Telangana: తెల్లబంగారం ధగధగా మెరిసిపోతోంది. బహిరంగ మార్కెట్లలో రికార్డు స్థాయిలో క్వింటాలు పత్తి ధర 10వేల రూపాయల పైచిలుకు పలుకుతోంది. రాష్ట్రమంతటా ఈ ధర ఉంటే.. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా క్వింటాలుకు 10వేల రూపాయల కంటే తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలుకు 500 నుంచి 1000 రూపాయలు వరకు తగ్గించి కొనుగోలు చేస్తుండడంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో లభించే నాణ్యమైన పత్తి రాష్ట్రంలో మరెక్కడా కనిపించదు. అందుకే ఆసియాలోనే అదిలాబాద్‌ జిల్లా పత్తికి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పత్తి ధర భారీగా పెరిగింది. రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్ , ఖమ్మం మార్కెట్లలో క్వింటాలు పత్తి ధర 10 వేల రూపాయల పైచిలుకు పలుకుతోంది. కానీ ఆదిలాబాద్ జిల్లాలో అందుకు భిన్నంగా 9వేల నుంచి 10వేల రూపాయల లోపే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పత్తి రైతులు క్వింటాల్‌కు 500 నుంచి వెయ్యి రూపాయల వరకు నష్టపోతున్నారు.

ఈ ఏడాది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- సీసీఐ పత్తి కొనుగోళ్లను చేపట్టడం లేదు. ఇదే అదునుగా పత్తి వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడ్డారు. వారు నిర్ణయించిన ధరలకే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. రవాణా ఖర్చులు పెరిగిపోవడంతో ఇతర ప్రాంతాలకు తరలించలేక రైతులు స్థానికంగానే పత్తిని విక్రయిస్తున్నారు. వ్యాపారుల మాయాజాలంతో రైతులు నష్టపోతున్నారు. అధికారుల సమక్షంలోనే ఈ తంతు జరుగుతున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అసలే పంటలు దిగుబడులు రాక.. దిగాలుతో ఉన్న రైతులు.. వ్యాపారుల తీరుతో తీవ్ర నష్టాల బారిన పడుతున్నారని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ ఏడాది ప్రభుత్వం క్వింటాల్‌ పత్తికి 6వేల 25 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. అనూహ్యంగా బహిరంగ మార్కెట్లో క్వింటాల్‌ ధర 10 వేల రూపాయల పైచిలుకు పలుకుతోంది. దీంతో తమకు మేలు జరుగుతుందని రైతులు ఆశించారు. కానీ వ్యాపారులు మాత్రం రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. చాలా మంది రైతులు ఇప్పటికే పత్తిని విక్రయించగా మరికొదరు మాత్రం ఇంకా ధర పెరుగుతుందని నిల్వ ఉంచుకున్నారు. వ్యాపారుల దోపిడీకి అధికారులు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories