రేపే GHMC ఎన్నికల కౌంటింగ్.. మరికొన్ని గంటల్లో తేలిపోనున్న అభ్యర్ధుల భవితవ్యం!

రేపే GHMC ఎన్నికల కౌంటింగ్.. మరికొన్ని గంటల్లో తేలిపోనున్న అభ్యర్ధుల భవితవ్యం!
x
Highlights

గ్రేటర్ విజేత ఎవరు..? మేయర్ పీఠం ఎక్కేదెవరో మరికొద్ది గంటల్లో తేలబోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఏకంగా దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఆసక్తి రేపుతోన్న GHMC ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి.

గ్రేటర్ విజేత ఎవరు..? మేయర్ పీఠం ఎక్కేదెవరో మరికొద్ది గంటల్లో తేలబోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఏకంగా దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఆసక్తి రేపుతోన్న GHMC ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. రేపు ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. మొదట పోస్టల్ ఓట్లు... ఆ తర్వాత బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు.

గ్రేటర్ లో మొత్తం 150 డివిజన్లు ఉండగా... డివిజన్ కు ఒకటి చొప్పున 150 కౌంటింగ్ హాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్ లో 14 టేబుళ్ళను సిద్ధం చేశారు. ఈసారి మొత్తం 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఒక్కో పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లను 25 చొప్పున కట్టలుగా కట్టి.. ఆయా పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓట్లకు సమానంగా బ్యాలెట్ పేపర్లు ఉన్నాయా లేవా అన్నది పరిశీలిస్తారు. ఇదంతా పూర్తయ్యాక లెక్కింపు మొదలు పెడతారు. ఒక్కో టేబుల్ కు 1000 ఓట్లు చొప్పున 14 టేబుళ్ళ పై 14 వేల ఓట్లను ఒక్కో రౌండ్ లో లెక్కిస్తారు. ఇక ఒక్కో టేబుల్ కు ముగ్గురు సూపర్ వైజర్లను నియమించారు.

నగరంలోని 30 కేంద్రాల్లో నిర్వహించే కౌంటింగ్ కోసం 150 హాళ్ళను ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కించాక .. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించనున్నారు. ఈసారి మొత్తం 2,629 పోస్టల్ బ్యాలెట్లను జారీ చేయగా .. కౌంటింగ్ కేంద్రాలకు చేరిన వాటిని ముందుగా లెక్కిస్తారు. ఈ ప్రక్రియ కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి అవుతుందని భావిస్తున్నారు.

బల్దియాలో మొత్తం 74లక్షల 12వేల 601 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో ఓటేసిన వారు 34 లక్షల 54 వేల 552 మంది. ఓటింగ్ కు దూరంగా ఉన్న వారు 39 లక్షల 58 వేల మందికి పైగానే ఉన్నారు. కేవలం 11 వేల 818 ఓట్లు పోలైన మెహదీపట్నం డివిజన్ ఫలితం ముందుగా వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఉదయం 11 గంటల కల్లా తొలి ఫలితం రానుందని భావిస్తున్నారు. అలాగే ఎక్కువ డివిజన్లలో 15 నుండి 27 వేల ఓట్ల వరకు నమోదైన నేపధ్యంలో రెండు రౌండ్ల లెక్కింపులోనే వీటి ఫలితాలు వెలువడనున్నాయని భావిస్తున్నారు.

ఇక 28 వేల కంటే ఎక్కువగా ఓట్లు నమోదైన డివిజన్లలో మూడు రౌండ్లు పూర్తవగానే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అత్యధికంగా ఓట్లు పోలైన మైలార్ దేవర్ పల్లి, సుభాష్ నగర్, గాజుల రామారం, అల్లాపూర్, సీతాఫల్ మండీ, బన్సీలాల్ పేట, తార్నాక డివిజన్ల లెక్కింపు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రంలో ఉన్న ఏజెంట్లు కోరితే మరోసారి ఓట్లు లెక్కించనున్నారు. ఎలాంటి అభ్యంతరాలు.. అడ్డంకులు లేకపోతే అన్ని డివిజన్ల ఫలితాలు త్వరగానే వెలువడే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories