భిక్షాటన చేసి.. పిల్లల కడుపు నింపుతున్న గంగవ్వ

భిక్షాటన చేసి.. పిల్లల కడుపు నింపుతున్న గంగవ్వ
x
భిక్షాటన చేసి.. పిల్లల కడుపు నింపుతున్న గంగవ్వ
Highlights

ఆ ముగ్గురికి వృద్దురాలే అమ్మా- నాన్న. పుట్టినప్పుడే తల్లిదండ్రులను కొల్పోయిన ఆ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతోంది. దారిద్ర్యంలో ఉన్నా బిక్షాటన చేస్తూ...

ఆ ముగ్గురికి వృద్దురాలే అమ్మా- నాన్న. పుట్టినప్పుడే తల్లిదండ్రులను కొల్పోయిన ఆ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతోంది. దారిద్ర్యంలో ఉన్నా బిక్షాటన చేస్తూ వాళ్ల ఆకలి తీరుస్తోంది. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ పూరి గుడిసెలో ఆ ముగ్గురిని పోషిస్తోంది. అర్ధాంతరంగా మరణించిన కొడుకు పిల్లలను ప్రయోజకులుగా చేసేందుకు ఏటికి ఎదురీదుతోంది. కామారెడ్డి జిల్లాలో ఆ నలుగురి దీనగాథపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

ఈ వృద్ధురాలి పేరు గంగవ్వ. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్‌కు చెందిన గంగవ్వది నిరుపేద కుటుంబం. ఇద్దరు మనవరాళ్లు ఓ మనవడు ఆమె ఆస్తి. ఊరి చివర పూరి గుడిసెలో ఉండే గంగవ్వ తన కొడుకు పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు 70 ఏళ్ల వయస్సులో పడరాని పాట్లు పడుతోంది. పనిచేసే సత్తువ లేక తన గ్రామం నుంచి కామారెడ్డి బస్టాండ్‌కు వచ్చి సాయంత్రం వరకు భిక్షాటన చేసి వచ్చిన డబ్బులతో ముగ్గురు పిల్లల కడుపు నింపుతోంది.

అర్ధాంతరంగా మరణించిన కొడుకు పిల్లలను తన ఒడికి చేర్చుకుని సాకుతోంది. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియని ఆ పిల్లలకు అన్నీ తానై వ్యవహరిస్తోంది గంగవ్వ. చిన్నప్పటి నుంచి నానమ్మ తమను సాకుతుందని ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఇచ్చే బియ్యం సరిపోవడం లేదని, అంత్యోదయ కార్డు ఇచ్చి తమ ఆకలి తీర్చాలని కోరుతున్నారు ఆ అభాగ్యులు. దాతలు ఆదుకుంటే బాగా చదువుకుంటామని వేడుకుంటున్నారు.

గంగవ్వకు ముగ్గురు కొడుకులు-కోడళ్లు ఉండగా ఒక్కొక్కరుగా అందరూ చనిపోయారు. పెద్ద కొడుకు సంజీవులు- కోడలు పోచమ్మకు ముగ్గురు పిల్లలుండగా గంగవ్వ వాళ్లకు అన్నీతానై సాకుతోంది. అదే సమయంలో భర్త కూడా అనారోగ్యంతో చనిపోవడంతో ఇద్దరు మనవరాళ్లు, ఓ మనవడి బాధ్యత భుజాన వేసుకుంది. పదేళ్ల క్రితం చిన్న పిల్లలుగా ఉన్న చామంతి, శ్రీకాంత్, వసంతలను అక్కున చేర్చుకుని వాళ్లే ఆస్తిగా బతుకుతోంది. కంటికి రెప్పలా కాపాడుతుంది.

ఇటు స్కూల్ ఉపాద్యాయులు సైతం గంగవ్వ మనవరాళ్ల పరిస్ధితిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చదువులో ముందుంటారని ఉన్నత చదువుకు స్థోమతలేక ఇబ్బందిపడుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం గంగవ్వ భిక్షాటన చేస్తు తిండి పెడుతున్నా వృద్దాప్యం మీద పడి గంగవ్వ చేతకాకుండా మారుతుందంటున్నారు గ్రామస్తులు. ఒకవేళ గంగవ్వకు జరగకూడదని ఏదైనా జరిగితే ఆ పిల్లల పరిస్ధితి ఏంటని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. తినడానికి తిండిలేక ఉండటానికి ఇళ్ల లేక గంగవ్వ, ముగ్గురు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుప్రియాల్‌లో ఊరి చివరన ఓ పూరి గుడిసెలో బతుకీడుస్తున్నారు. పిల్లలను పోషణ రోజురోజుకు భారంగా మారుతుందని తమను ఆదుకోవాలని ముగ్గురు పిల్లలతో సహా గంగవ్వ వేడుకుంటోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories