రేవంత్ సర్కార్ తొలి కానుక.. రేపటి నుంచే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం

Free Bus Travel For Women In Telangana
x

రేవంత్ సర్కార్ తొలి కానుక.. రేపటి నుంచే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం

Highlights

Revanth Reddy: రేపటి నుంచే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం

Revanth Reddy: తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్ మహిళామణులకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చి లేడీస్‌కు తొలి కానుక అందజేయాలని చూస్తోంది రేవంత్ సర్కార్. ఆరు గ్యారెంటీ స్కీమ్‌ల్లో ఒకటైన మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కీమ్‌ను ఇంప్లిమెంట్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు మంత్రి వర్గంలో నిర్ణయం కూడా తీసుకున్నారు. సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా రేపటి నుంచే స్కీమ్‌ను అమలు చేయబోతున్నారు. దీంతో ఎలాంటి విధివిధానాలు ఉండబోతున్నాయి. ఓన్లీ ఆర్డీనరీ, ఎక్స్‌ప్రెస్‌లోనేనా లేక సూపర్ లగ్జరీలోనూ అవకాశం కల్పిస్తారా..?

అనే చర్చ మొదలైంది. ఉచిత ప్రయాణం కోసం ప్రత్యేక కార్డులు ఇస్తారా లేక ఆధార్ చూపిస్తే సరిపోతుందా..? ఫ‌్రీ జర్నీ కేవలం రాష్ట్రం వరకైనా లేక అంతరాష్ట్ర సర్వీస్‌లోనూ వర్తిస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఇంతకు కర్నాటకలో ఈ స్కీమ్ ఎలా అమలు అవుతోంది. దీని వల్ల.. టీఎస్ ఆర్టీసీ ఎలాంటి ప్రభావం ఉంటుందో ఓ సారి చూద్దాం.

ప్రమాణం స్వీకారం చేసిన తొలి రోజే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కీలక నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసి..రేపటి నుంచి అమలు చేయాలని తొలి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో రేపటి నుంచే ఈ పథకం అమల్లోకి రాబోతోంది. ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వస్తే మహిళలు ఆధార్‌ కార్డును చూపిస్తే సరిపోతుందని అధికారులు వివరించారు. వారికి ‘సున్నా’ చార్జీ టికెట్లు ఇస్తారని.. దీనిపై ఇంకా ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉందని చెబుతున్నారు.

తెలంగాణ కంటే ముందు కర్నాటకలో కూడా ఇలాంటి గ్యారెంటీలను ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడ కూడా మహిళల ఉచిత ప్రయాణం అనే పథకాన్ని అమలులోకి తెచ్చింది కాంగ్రెస్. మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా.. తర్వాత అంతా సర్దుకుపోయింది. కర్నాటక ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌ నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చింది. కర్నాటకలో మొత్తం 22 వేల పైచిలుకు బస్సులున్నాయి. ఇందులో ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం ఉంది. ఈ పథకం అమలులోకి వచ్చాకా ఆర్టీసీలో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రారంభంలో ఫోటో గుర్తింపు కార్డు, అడ్రెస్ ప్రూఫ్ చూపించినా సరే బస్సుల్లో ప్రయాణానికి అనుమతించారు. ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం శక్తి స్మార్ట్ కార్డులను తీసుకొచ్చింది.. సేవా సింధ్ వెబ్‌సైట్ ద్వారా మహిళలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కర్ణాటకకు చెందిన మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా కేవలం సిటీ, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల వరకు మాత్రమే ఈ ఉచితం అమలు. కర్ణాటక ఆర్టీసీ బస్సులు వేరే రాష్ట్రాలకు వెళ్లే బస్సులకు కూడా ఈ పథకం వర్తించదు. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ బస్సు ఎక్కితే ఉచిత ప్రయాణం వర్తించదు.

డీలక్స్, సూపర్ డీలక్స్, గరుడ, లగ్జరీ, సెమీ లగ్జరీ, ఏసీ, ఏసీ స్లీపర్, నాన్ ఏసీ స్లీపర్ బస్సులకు ఉచిత ప్రయాణం ఉండదు. ఉచిత ప్రయాణం పేరుతో మహిళలే బస్సు మొత్తం ఎక్కేందుకు వీలు ఉండదు. అందుకే బస్సులో మగవారి కోసం సీట్లు రిజర్వ్ చేస్తారు.. గతంలో మహిళలకు బస్సుల్లో కొన్ని సీట్లు కేటాయిస్తే.. ఇప్పుడు మగవారికి ఈ సౌకర్యాన్ని తీసుకొస్తారన్నమాట. కర్ణాటక మార్గదర్శకాలను తెలంగాణలో అమలు చేయాలనేమీ లేదు.. ఇక్కడా ప్రత్యేకంగా మార్గదర్శకాలను రూపొందించే అవకాశం ఉంది.

రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కర్ణాటకలో ఈ పథకం అమలు తీరును పరిశీలిస్తోందని చెబుతున్నారు. అక్కడ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలుతీరు, సంస్థపై ఆర్థిక ప్రభావం, ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సాయం వంటి వివరాలను అడిగి తెలుసుకునే పనిలో ఉన్నారట. అంతేకాదు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు కూడా సీఎం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశానికి అందుబాటులో ఉండాలని సజ్జనార్‌కు ఇప్పటికే సమాచారం అందిందని చెబుతున్నారు. ఏఏ బస్సుల్లో మహిళలను అనుమతిస్తారు, ప్రయాణ పరిధి ఎంత, ప్రయాణించే వారు ఏఏ గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది వంటి అంశాలపై క్లారిటీ రానుంది. మరి రేవంత్ సర్కార్ కర్ణాటక తరహాలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తుందా.. ఏవైనా మార్పులు ఉంటాయా అన్నది తేలనుంది.

బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలైతే.. టీఎస్‌ ఆర్టీసీకి ఏటా 3 వేల కోట్ల మేర అదనపు భారం పడుతుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ పథకంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడిన తర్వాత.. భారం ఎంత అనేదానిపై స్పష్టత చెబుతున్నారు. తెలంగాణలో అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశమిస్తే.. ఏటా వేల కోట్ల మేర అదనపు భారం పడుతుందని, అదే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులతో సరిపెడితే.. 2వేల 500 కోట్ల భారం ఉంటుందని ఆర్టీసీ అధికారులు వివరిస్తున్నారు. ఆర్టీసీ ప్రస్తుత ఆక్యుపెన్సీ రేషియోలో మహిళల వాటానే అధికంగా ఉంది. ఆర్టీసీ బస్సులు రోజూ సగటున 40 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తుండగా.. వారిలో మహిళల వాటా 50-55శాతంగా ఉంటోంది. ఇప్పుడు రోజుకు 15 కోట్ల నుంచి 16 కోట్ల మేర ఆర్టీసీకి చార్జీల రూపంలో ఆదాయం వస్తుండగా.. ఉచిత ప్రయాణ పథకంతో ఆ రెవెన్యూ సగానికి పడిపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల.. ఆర్టీసీపై రోజుకు 4కోట్ల భారం పడుతుందనే ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories