24గంటలు గడిచినా దొరకని చిరుత జాడ

24గంటలు గడిచినా దొరకని చిరుత జాడ
x
Highlights

హైద‌రాబాద్ సిటీలో చిరుత పులి క‌ల‌క‌లం రేపింది. కాటేదాన్ ప్రాంతంలోని జాతీయ ర‌హ‌దారి.. మైలార్ దేవ్ పల్లిలోని అండర్ పాస్‌ బ్రిడ్జి వద్ద గాయాలతో రోడ్డుపై...

హైద‌రాబాద్ సిటీలో చిరుత పులి క‌ల‌క‌లం రేపింది. కాటేదాన్ ప్రాంతంలోని జాతీయ ర‌హ‌దారి.. మైలార్ దేవ్ పల్లిలోని అండర్ పాస్‌ బ్రిడ్జి వద్ద గాయాలతో రోడ్డుపై పడిఉన్న చిరుతను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పులిని చూసిన ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ప్రధాన రహదారి నుంచి అటవీ ప్రాంతంలోకి పారిపోతన్న చిరుతను చూసేందుకు యత్నించిన ఓ లారీ డ్రైవర్ పై దాడి చేసింది. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 24 గంటలు గడిచినప్పటికీ చిరుత ఆచూకీ లభించకపోవడంతో స్థానికులు, అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది.

గురువారం ఉదయం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ రైల్వేఅండర్ బ్రిడ్డి చిరుతపులి కన్పించింది. చిరుతను చూసిన స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. అయితే పులి గాయాలతో ఉండటంతో ఎటూ కదలలేక కాసేపు అక్కడే ఉండిపోయింది. పులి రోడ్డుమీదే ఉందని తెలిసి కూడా చాలా మంది వాహనదారులు నిర్లక్ష్యంగా అటూ ఇటూ తిరిగారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న లారీ డ్రైవర్ చిరుతను చూసేందుకు ప్రయత్నించడంతో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. చిరుత సంచారంపై స్థానికులు అటవీ శాఖ అదికారులకు సమాచారం ఇచ్చారు. మత్తు మందు ఇచ్చి చిరుతను బంధించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

రోడ్డు పక్కన చిరుత సుమారు గంటన్నరపాటు నిద్రించింది. జనాలను చూసి ఏ మాత్రం భయపడకుండా అక్కడే ఉండిపోయింది. జనాలు ఎక్కువ మంది గుమిగూడటంతో భయంతో అక్కడి నుంచి చిరుత అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. అయితే ఘటనాస్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది.. పారిపోయిన చిరుత కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. డ్రోన్‌ కెమెరాల ఆధారంగా చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. చిరుత రాజేంద్రనగర్‌ అగ్రికల్చర్‌ యూనివర్శిటీ వెనుక నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల వాసులను అధికారులు హెచ్చరించారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దంటూ సూచించారు.

రాత్రిపొద్దుపోయే వరకు చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నాలుగు సార్లు డ్రోన్‌ కెమెరాలను ఉపయోగించి గాలించినా చిరుత ఆచూకీ లభించలేదు. ఫారెస్ట్‌ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి చిరుత కోసం విస్తృతంగా గాలించారు. అయినప్పటికీ అది చిక్కడం లేదు. చిరుతను పట్టుకోవడం కోసం మేకలను ఎరవేశారు. కుక్కలను రంగంలోకి దించారు. చిరుతను గుర్తించడానికి ఫాంహౌజ్‌లోకి కుక్కలను వదిలారు. బోన్ల‌లో మేకలను ఎరవేసి చిరుతను బందించే ప్రయత్నం చేస్తున్నారు. జూ అధికారులు బోన్లు సిద్ధం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories