Rythu Bharosa: సార్.. మాకు ఈసారైనా రైతు భరోసా వస్తుందా..? అర్హులకు రైతు భరోసా ఏది..?

Rythu Bharosa: సార్.. మాకు ఈసారైనా రైతు భరోసా వస్తుందా..? అర్హులకు రైతు భరోసా ఏది..?
x
Highlights

Rythu Bharosa: సార్.. మాకు ఈసారైనా రైతు భరోసా వస్తుందా..? అర్హులకు రైతు భరోసా ఏది..?

Rythu Bharosa: దేశంలో రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి ఆర్థిక సాయం జమ చేసే విధానాన్ని మొదటిగా అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. సాగుకు పెట్టుబడి సమస్యలు తగ్గించాలన్న ఉద్దేశంతో రైతు భరోసా వంటి పథకాలు తీసుకొచ్చినా, వాస్తవంగా భూమి సాగు చేస్తున్న రైతులకు మాత్రం ఆ సాయం అందని దయనీయ పరిస్థితి చాలా గ్రామాల్లో కనిపిస్తోంది. ఏళ్ల తరబడి “దున్నేవాడిదే భూమి” అంటూ పోరాటాలు చేసిన నేలలోనే, అదే భూమిని సాగు చేస్తున్న రైతుకు పట్టా లేకపోవడం అతిపెద్ద సమస్యగా మారింది.

ఈ పరిస్థితికి కారణాలు ఒక్క ప్రభుత్వానికే పరిమితం కావు. రాష్ట్రం విడిపోవడానికి ముందు నాటి పాలకుల నిర్లక్ష్యం ఒకవైపు ఉంటే, గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పిదాలు మరోవైపు రైతులను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చిన సమయంలోనే అనేక లోపాలు బయటపడ్డాయి. ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని అప్పట్లో ప్రకటనలు చేసినా, దానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన భూ భారతి వ్యవస్థ ఇప్పటికీ పూర్తిగా అమల్లోకి రాలేదు. గ్రామాల్లో అధికారులు తిరుగుతూ భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకున్నారు. కానీ వాటికి ఫలితం మాత్రం చాలా చోట్ల శూన్యమే. అసలు భూ భారతి అంటే ఏమిటో కూడా చాలామంది రైతులకు తెలియని పరిస్థితి నెలకొంది. ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయి? ఎక్కడికి వెళ్లాయి? అన్న అనుమానాలు గ్రామాల్లో చర్చగా మారాయి.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం “సాగు చేస్తున్న భూమికే రైతు భరోసా ఇస్తాం” అని చెబుతోంది. కానీ సాగు చేస్తున్న రైతుకే పట్టా ఇవ్వకుండా, రైతు భరోసా ఎలా ఇస్తారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. కొన్ని గ్రామాల్లో మరింత విచిత్రమైన పరిస్థితి ఉంది. భూమిని ఒకరు సాగు చేస్తుంటే, రైతు భరోసా డబ్బులు మాత్రం మరొకరి ఖాతాలోకి వెళ్తున్నాయి. ఇది రైతుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. “మా భూమికి మాకు పట్టా ఇచ్చి, సాగుకు సాయం చేయండి” అని అడిగితే వినే నాయకుడే కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల ముందు రైతు సమస్యలే తమ ప్రధాన అజెండా అని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక “చేస్తున్నాం… పరిశీలిస్తున్నాం” అంటూ కాలం గడుపుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు సంవత్సరాలు గడిచినా భూ సమస్యలపై స్పష్టమైన పరిష్కారం కనిపించడం లేదు. రైతులు ప్రయత్నాలు చేయడం లేదన్న మాట కూడా కాదు. చెప్పులు అరిగేలా, కాళ్లు నొప్పిపడేలా అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోతోందని వారు వాపోతున్నారు. కలెక్టర్ కార్యాలయాలకు వినతులు వెళ్తున్నాయి. అవి తిరిగి రెవెన్యూ అధికారుల వద్దకు పరిశీలన కోసం పంపబడుతున్నాయి. కానీ అక్కడితో ఆ ఫైళ్లు నిలిచిపోతున్నాయి.

తెలంగాణలో చాలా ఏళ్లుగా సమగ్ర భూ సర్వే జరగలేదు. ఈ కాలంలో భూముల స్వరూపాలు మారాయి, యాజమాన్యాల్లో అనేక మార్పులు వచ్చాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి గ్రామంలో భూ సర్వే చేయడం అంత కష్టం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఇంటికి కుటుంబ సర్వే చేసినట్లే, భూములకు కూడా సర్వే చేస్తే కనీసం 90 శాతం సమస్యలు, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల ఇబ్బందులు పరిష్కారమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయినా ప్రభుత్వం ఎందుకు ముందడుగు వేయడం లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం కొనసాగుతోంది. అక్టోబర్ 7న వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూ.171 కోట్లను విడుదల చేయగా, ఈ మొత్తం 8.55 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా జమైంది. ఇందులో 85 వేల మందికి పైగా మహిళా రైతులు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఇప్పటివరకు రైతులకు మొత్తం రూ.4,052 కోట్లు పీఎం కిసాన్ ద్వారా అందాయి. ఇతర రాష్ట్రాల్లో రైతులు 21వ విడత కోసం ఎదురుచూస్తుండగా, దీపావళికి ముందు వస్తుందన్న అంచనాలు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు అధికారిక తేదీ ప్రకటించలేదు. అందువల్ల నవంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

గ్రామాల్లోని రైతుల మాట మాత్రం చాలా స్పష్టంగా ఉంది. “మాకు రైతు భరోసా డబ్బులు వద్దు, ముందుగా మా భూమికి పట్టా ఇవ్వండి” అని వారు కోరుతున్నారు. పట్టా చేతిలో ఉంటే కనీసం బ్యాంకుల నుంచి రుణాలు అయినా పొందగలమని, సాగుకు అవసరమైన పెట్టుబడి సమకూరుతుందని చిన్న రైతులు భావిస్తున్నారు. మరి ప్రభుత్వం ఇకనైనా నిజంగా రైతుల సమస్యలపై దృష్టి సారించి, భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకునే దిశగా అడుగులు వేస్తుందా? లేక గత ప్రభుత్వాల మాదిరిగానే కాలం గడిపేస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories