గుండెపోటుతో రైతు మృతి.. రోడ్డున పడ్డ కుటుంబం

గుండెపోటుతో రైతు మృతి.. రోడ్డున పడ్డ కుటుంబం
x
Highlights

ఆ కుటుంబానికి ఆయనే పెద్ద దిక్కు. అనారోగ్య సమస్యలున్నా మనవరాళ్ల కోసం కష్టాలకు ఎదురెళ్లాడు. అప్పులు చేసి పంట పండించాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను...

ఆ కుటుంబానికి ఆయనే పెద్ద దిక్కు. అనారోగ్య సమస్యలున్నా మనవరాళ్ల కోసం కష్టాలకు ఎదురెళ్లాడు. అప్పులు చేసి పంట పండించాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు వెళ్లిన ఆ రైతు కొద్ది సేపటికే కన్నుమూశాడు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

కామారెడ్డి జిల్లా పోల్కంపేట గ్రామానికి చెందిన భూమయ్య గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం దగ్గర గుండెపోటుతో మృతిచెందాడు. తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించిన భూమయ్య ఈనెల 19న కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్లాడు. ధాన్యం తడిగా ఉండటంతో ఆరబెట్టి అక్కడే సేదతీరాడు. ఏం ఆందోళన వెంటాడిందో తెలియదు సేదతీరిన కాసేపటికే భూమయ్య కుప్పకూలిపోయాడు.

భూమయ్య దంపతులకు ముగ్గురు సంతానం ఉండగా ఒక్కగానొక్క కొడుకు పదేళ్ల క్రితమే చనిపోయాడు. ఇద్దరు కూతుళ్లు కూడా అనారోగ్య కారణాలతో మృతి చెందారు. దాంతో తన కూతుళ్లకు పుట్టిన ముగ్గురు బిడ్డలకు అన్నీ తామై చూసుకుంటున్నారు ఈ వృద్ధ దంపతులు. వారి బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు. లచ్చవ్వ మానసిక స్ధితి కూడా అంతంత మాత్రంగా ఉండటంతో భూమయ్య చేసిన వ్యవసాయమే వారిని బతికించింది. ఈ ఏడాది అప్పు చేసి పంట సాగు చేసిన భూమయ్య ధాన్యాన్ని అమ్మేందుకు ఉత్సాహంగా వెళ్లాడు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కొనుగోలు కేంద్రం దగ్గర గుండెపోటు రావటంతో అక్కడికక్కడే మృతి చెందాడు భూమయ్య. దాంతో ఆ రైతు కుటుంబం రోడ్డున పడింది.

చిన్నపుడే తల్లిని కోల్పోయిన ఆ చిన్నారులకు అల్లారుముద్దుగా చూసుకునే తాతయ్య కూడా వదిలి వెళ్లటం తీరని శోకాన్ని మిగిల్చింది. పెద్ద దిక్కు లేని ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories