Top
logo

యూరియా..రైతు ఉసురు తీసింది..

యూరియా..రైతు ఉసురు తీసింది..
Highlights

తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. యూరియా కోసం రైతన్నలు నానా పాట్లు పడుతున్నారు. పొలాలు,...

తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. యూరియా కోసం రైతన్నలు నానా పాట్లు పడుతున్నారు. పొలాలు, ఇళ్లు వదలి యూరియా పంపిణీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. యూరియా కోసం రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. డిమాండ్‌కు తగ్గ యూరియా సప్లయ్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దుబ్బాకలో యూరియా కోసం క్యూలైన్‌లో నిల్చున్న రైతు గుండెపోటుతో మృతి చెందడం విషాదం నింపింది.

ఈసారి వర్షాలు విరివిగా కురిశాయి. ప్రాజెక్టులు నిండిపోయాయి చెరువుల్లోకి భారీగా నీరు చేరింది. పుష్కలంగా నీరు రావడంతో అన్నదాతలు జోరుగా సాగు చేపట్టారు. వరి, పత్తి, మొక్కజొన్న పంటలు వేశారు. సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. సాగు స్థాయి పెరిగినా అందుకు తగినవిధంగా ఎరువుల సరఫరా జరగటం లేదు. యూరియా కోసం నానా పాట్లు పడుతున్నారు రైతులు.

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం చోటుచేసుకుంది. యూరియా కొరత ఓ అన్నదాతను బలితీసుకుంది. యూరియా కోసం వచ్చిన ఓ రైతు ప్రాణం గాలిలో కలిసిపోయింది. రోజుల తరబడి యూరియా కోసం అన్నదాతలు క్యూలైన్లలో నిల్చుంటున్నారు. ఆకలి దప్పికలు మాని రైతులు యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నారు.

యూరియా కోసం క్యూలైన్‌లో నిల్చున్న రైతు పెరు ఎల్లయ్య గుండెపోటుతో చనిపోయాడు. దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద మూడు రోజులుగా యూరియా కోసం అచ్చుమాయపల్లికి చెందిన రైతు ఎల్లయ్య క్యూలైన్‌లో నిల్చున్నాడు. ఒక్కసారి కుప్పకూలిన ఎల్లయ్య అక్కడిక్కడే చనిపోయాడు. తమతో పాటు క్యూలైన్‌లో నిల్చున్న ఎల్లయ్య కుప్పకూలిపోయాడని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయిందని రైతు బంధువు తెలిపారు. ఎల్లయ్య మృతి చెందడంతో కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.

సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు పాట్లు పడుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో యూరియా లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గజ్వేల్ మండలానికి 40 టన్నుల యూరియా అవసరం ఉండగా 20 టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. దానికోసం రైతులు కేంద్రం వద్ద ఉదయం నుంచే బారులు తీరి ఉంటున్నారు. అయినా యూరియా దొరకకపోవడంతో నిరాశ చెందుతున్నారు.

మెదక్ జిల్లా వెల్డుర్తి తూప్రాన్ మండల కేంద్రంలో యూరియా కొరతపై రైతులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం నుండి యూరియా వస్తుందని పడిగాపులు కాసి రాత్రి వరకు అక్కడే ఉండి ఇంటికి వెళ్లారు. గురువారం ఉదయం ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద బారులు తీరారు. చెప్పులు లైన్‌లో పెట్టి యూరియా కోసం ఎదురు చూశారు. అధికారులు ఎవరు రాకపోవడంతో రైతులు ఆందోళనబాట పట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లా అల్లీపూర్‌లో యూరియా కోసం తెల్లవారుజాము నుంచే రైతులు క్యూలైన్‌లో నిలబడ్డారు. నిలబడే ఓపిక లేక ఆధార్ కార్డులు పెట్టి క్యూలైన్‌ ఏర్పాటు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని సొసైటీలలో యూరియా సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లింగారెడ్డిపేట్ సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు భారీ ఎత్తున తరలివచ్చారు. పోలీసుల పహారా మధ్య యూరియా పంపిణీ నిర్వహించారు. రైతులు వరుసలలో నిలబడటం ఇబ్బంది కావడంతో పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు వరుసలో పెట్టారు.

నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం నుంచి క్యూలైన్లలో నిలబడి రైతులు నీరసించారు. నిలబడే ఓపిక లేక అన్నదాతలు క్యూలైన్‌లో ఆధార్ ‌కార్డులు పెట్టారు. యూరియా సరఫరా లేకపోవడంతో పంటలు దక్కించుకునే మార్గం లేక రైతులు ఆవేదన చెందుతున్నారు. సరియేంత యూరియా పంపిణీ చేయాలని కోరుతున్నారు.

Next Story

లైవ్ టీవి


Share it