నల్గొండ జిల్లాలో సబ్సిడీ పేరుతో మోసం.. మోసపోయిన రైతులు.. ఉడాయించిన కేటుగాడు...

Fake Subsidy Frauds in Cheated Farmers Escaped with Money in Nalgonda | Live News
x

నల్గొండ జిల్లాలో సబ్సిడీ పేరుతో మోసం.. మోసపోయిన రైతులు.. ఉడాయించిన కేటుగాడు...

Highlights

Nalgonda: మోసగాళ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు...

Nalgonda: వ్యవసాయ ట్రాక్టర్ యంత్రాలు, పరికరాలు సబ్సిడీ ఇప్పిస్తామంటూ రైతులకు కుచ్చుటోపి పెట్టారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం నూకలవారి గూడెంకు చెందిన నూకల నాగరాజు 2016 నుంచి 18 వరకు వాటర్ షెడ్ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేశాడు. ఈ క్రమంలో సమీప ప్రాంతాల రైతులతో పరిచయాలు పెంచుకున్నాడు. ఆతర్వాత ఉద్యోగం మానేశాక రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, ట్రాలీలు, కల్టివేటర్లు, పంపులు, డ్రిప్ ఇరిగేషన్ సామాన్లు ఇలా వ్యవసాయ అనుబంధ పరికరాలు సగం ధరకే ఇస్తామని రైతులకు ఆశ చూపారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 18 మండలాల్లో రైతులకు సబ్సిడీపై పరికరాలు సగం ధరకే ఇవ్వడం ప్రారంభించారు. గత రెండేళ్లుగా ఆయా ప్రాంతాల్లో కొంత మంది రైతులకు సబ్సిడీపై పరికరాలు అందించారు. వారిలో కొందరిని ఎజెంట్ గా పెట్టుకున్నాడు. ఒక్కో రైతుకు సగం ధరకే వ్యవసాయ అనుబంధ పరికరాలు యంత్రాలు వస్తుండడంతో ఆశపడిన మిగతా రైతులు ఎవరికి వారే ఆయా గ్రామాల్లో రైతుల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారు.

అయితే ఈ దందాలో నాగరాజు ఒక్కడి వల్ల కాదని మరికొంతమంది ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో కొంతమంది వ్యవసాయ అధికారులు ఉండటంతోనే సాధ్యమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు, జిల్లా వ్యవసాయ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే పెద్ద మొత్తంలో వ్యవసాయ పరికరాలు పొందిన రైతులు 8 లక్షలు ఉన్న ట్రాక్టర్ సైతం సగం ధరకే వస్తుందని చెప్పడంతో పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించినట్టు సమాచారం.

అయితే డబ్బులు చెల్లించిన రైతులు నెలల తరబడి తిరుగుతున్నా.. వ్యవసాయ పరికరాలు రాకపోవడంతో ఆవేదన చెందిన రైతులు తిరుగుబాటు ప్రారంభించారు. మోసపోయామని భావించిన రైతులు పెద్ద ఎత్తున తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సుమారు వంద మందికి పైగా రైతులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని తమ గోడును వెళ్లబోసుకున్నారు. అయితే పోలీసులు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజుతో పాటు ఏజెంట్ గా ఉన్న కొంతమంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. నాగరాజు ఒక్కడికే ఈ దందాలో భాగస్వామ్యం ఉందా మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు టాస్క్ ఫోర్స్ పోలీసులచే రహస్యవిచారణ చేస్తున్నారు.

ఈ దందాలో చాలా మంది రైతులు మోసపోయినప్పటికీ కొంత మంది రైతులకి ప్రయోజనం కలిగింది. అయితే నిందితులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇక పోలీసుల విచారణపై బాధిత రైతుల్లో గుబులు మొదలైంది. రైతులు చెల్లించిన డబ్బు రికవరీ చేస్తారా అన్న సందేహం వారిని వెంటాడుతుంది. అప్పులు చేసీ మరీ మాయమాటలు నమ్మి పెద్ద ఎత్తున పెట్టిన సొమ్మును తిరిగి ఇప్పించాలని వేడుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories