Telangana Budget 2021-22: తెలంగాణ బడ్జెట్ పై ఉత్కంఠ

Excitement Over Telangana Budget 2021-22 hmtv Special Story
x

తెలంగాణ అసెంబ్లీ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Highlights

Telangana Budget 2021-22: ఈ ఆర్థిక సంవత్సరంలో 1.9 లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Telangana Budget 2021-22: సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈనెల 15 నుంచి బడ్జెట్ సమావేశాల నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 18వ తేదీన ఉదయం ఉభయ సభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపు 15 రోజుల పాటు సమావేశాలు సాగనున్నట్లు సమాచారం. కరోనా కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్ర ఖజానాను దారికి తెచ్చేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. తొలిరోజైన 15న ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం.... 16వ తేదీన దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సంతాప తీర్మానం. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు.. ఇక 18వ తేదీన ఉదయం 11.30 నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

నెమ్మదిగా అడుగులు...

కోవిడ్‌ సృష్టించిన కల్లోలం నుంచి కోలుకొని వివిధ రంగాలను పునరుద్ధరించుకునే క్రమంలో ప్రభుత్వం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. నేల చూపులు చూస్తున్న రంగాలకు ఊపిరిలూది వాటిని తిరిగి మేలుబాట పట్టించడం ఏ ప్రభుత్వానికైనా కత్తిమీద సామే. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్‌ ఎలా ఉంటుందని ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. కిందటేడాది 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ 1.82 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి... కరోనా ఆర్థిక మాంద్యం దెబ్బకు ఆశించిన స్థాయిలో ఆదాయం అందలేదు. అందుకే ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు ఎక్కువ ఉండే అవకాశాలపై చర్చ జరుగుతోంది.

అత్యంత జాగ్రత్తగా బడ్జెట్...

సీఎం కేసీఆర్ఆదేశాల మేరకు ఈసారి రాష్ట్ర బడ్జెట్‌ను అత్యంత జాగ్రత్తగా రూపొందించారు అధికారులు. ప్రస్తుత రాబడి, వ్యయాలకు అనుగుణంగా పద్దులు ఉండబోతున్నవి. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు, ఖజానాకు సమకూరే సొంత రాబడులు, కేంద్ర బడ్జెట్ తర్వాత నిధులు, నిధుల కోత, బడ్జెట్ కేటాయింపుల ప్రాధాన్యతపై కూడా దృష్టి సారించారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులున్నా సాగునీటి రంగంపై రాష్ట్ర ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది. చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లులు పెద్ద మొత్తంలోనే పెండింగ్‌లో ఉన్నాయి.

ఇప్పటి వరకు 15,150 కోట్లు ఖర్చు...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్ర బడ్జెట్‌, బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలతో కలిపి 15,150 కోట్లు ఖర్చు చేసింది. గుత్తేదారులు చేసిన పనులు, భూసేకరణ, పునరావాసానికి చెల్లించాల్సిన మొత్తం, విద్యుత్తు బిల్లులు కలిపి సుమారు రూ.10,500 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చులో సగానికి పైగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోనివే. ఈ ప్రాజెక్టులో బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణంతో చెల్లించింది ఎక్కువ.

తమ అస్త్రాలకు పదును పెడుతున్న ప్రతిపక్షాలు...

బడ్జెట్ ప్రతిపాదనలు ఇలా తుదిరూపులు దిద్దుకుంటున్న వేళ... ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షాలను తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఉద్యోగాల నియామకాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి కత్తులు నూరుతున్నాయి. అదే స్థాయిలో ప్రతిపక్షాలను తిప్పికొట్టేందుకు సర్కార్ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని రెడీ అయింది. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికకు ముహుర్తం ముంచుకొస్తుండటంతో అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న గొల్ల కురుమలను ఆకర్షించేందుకు బడ్జెట్‌లో భారీ తాయిలాలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోన్నట్లు సమాచారం.

సాగర్‌ కోసం సర్వశక్తులూ...

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక అధికార పక్షానికి పరువు-ప్రతిష్టలకు సంబంధించిన విషయం. ఇప్పటికే దుబ్బాక, గ్రేటర్‌ ఫలితాలతో అంతర్మథనం చెందుతున్న గులాబీ శ్రేణులు... సాగర్‌ కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అందులో భాగంగానే పలు సంక్షేమ, అభివృద్ది పథకాల అమలుతో పాటు, ఇప్పటికే అమలులో వున్న గొర్రెల పెంపకం కార్యక్రమాన్ని కూడా కొనసాగించనున్నట్లు తెలిపారు సీఎం. ఇప్పటికే గొల్ల కురుమలకు పంపిణీ చేసిన 3 లక్షల 70 వేల గొర్రెల యూనిట్ల పంపిణీతో పాటు అదనంగా మరో 3 లక్షల యూనిట్లను పంపిణీ చేసేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదనలను పొందపర్చారు..

కుదిపేసిన ఆర్థిక మాంద్యం...

కిందటేడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 1 లక్షా 82 వేల 914 కోట్లు. లాక్‌డౌన్ వల్ల ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిగా మారడంతో పాటు ఆర్థిక మాంద్యం కుదిపేసింది. ఇంకా కుదిపేస్తూనే ఉంది. అందుకే ఈసారి బడ్జెట్‌లో గత సంవత్సరంతో పోలిస్తే కేటాయింపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కరోనా కారణంగా దాదాపు 50 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోయిన తెలంగాణ ప్రభుత్వం- తర్వాత ఆ నష్టాన్ని అంచనాలతో సహా లక్ష కోట్లుగా చూపించింది.

రూ.1.9 లక్షల కోట్ల కన్నాఎక్కువగానే...

ఈసారి బడ్జెట్‌ అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1.9 లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులు, గ్రాంట్లలో ఆర్థిక మందగమనం కారణంగా కేటాయింపులు ఎలా ఉండనున్నాయో అనేది చర్చ జరుగుతుంది. కేంద్ర పన్నుల పంపిణీలో కోత, ఇంధనంపై వ్యవసాయ సెస్ విధించడంతో కేంద్ర బడ్జెట్ కూడా తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద నిరాశ కలిగించింది. 2021-22లో 5 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుందని అంచనా వేశారు. బడ్జెట్ పరిమాణాన్ని కత్తిరించే అవసరాన్ని అధికారులు సీఎంకు గత బడ్జెట్ సమావేశంలో వివరించారు. 2020-21 బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటును 15 శాతంగా అంచనా వేసింది. అంతేకాదు ఆదాయాలు కూడా పడిపోయాయి. బడ్జెట్ లక్ష్యాలు ఏవీ నెరవేరలేదు. ఈ ఏడాది మార్చి 31తో 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మిగిలిన వారంలో నష్టాలను తీర్చడానికి పెద్దగా అవకాశం లేదు.

సంక్షేమ రంగానికి పెద్దపీట...

ఈ బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేయనుంది సర్కార్. మైనార్టీల సంక్షేమానికి దాదాపు 1,500 కోట్లు, విద్యుత్ రంగానికి 11 వేల కోట్లు, ఆర్అండ్‌బీ శాఖకు 3,494 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి 15 వేల కోట్లు, వైద్య రంగానికి 7,500 కోట్లు, పోలీస్ శాఖకు 5,000 కోట్లు, పంచాయితీ రాజ్ శాఖకు 20,000 కోట్లు, పారిశ్రామిక రంగానికి 2,000 కోట్ల కేటాయింపులు చేసే అవకాశం ఉందని అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. రైతుబంధు పథకానికి 15,300 కోట్లు, రైతు బీమాకు 1,200 కోట్లు, రైతు రుణమాఫీకి 2,230 కోట్లు కేటాయించే వీలుంది. సాగునీటి రంగానికి 10 వేల కోట్లు కేటాయించాలని కూడా అనుకుంటున్నట్టు సమాచారం.

కేంద్రం ఇచ్చే నిధుల్లో కోత...

కేంద్రం ఇచ్చే నిధుల్లో కోత పెట్టడంతో... పెట్రోల్, డీజిల్‌పై జీఎస్‌టీ, ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపు ద్వారా అదనపు ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు. రిజిస్ట్రేషన్‌లో ఆదాయాన్ని పెంచుకుని లోటు బడ్జెట్‌ను పూడ్చుకునేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అనంతరం ఏడాదికి అదనంగా కనీసం రూ.10వేల కోట్లు అవసరమవుతాయని ఆర్థికశాఖ అంచనా వేస్తోంది. కనీసం 29 శాతం ఫిట్‌మెంట్ఇచ్చినా ఏ మేరకు నిధులు సమకూర్చుకోవాలన్నదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆర్థికంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో ఉద్యోగులకు వేతనాలు పెంచడం, కొత్త ఉద్యోగాలు భర్తీ చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ చేయబోయే ప్రకటన ఆధారంగా బడ్జెట్‌ లెక్కలు కూడా మారిపోనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories