సిసిఐ కోసం పోరాటం ఉధృతం.. వివిధ రూపాల్లో ఆందోళన...

Employees and Labour Protest to Reopen CCI in Adilabad | Live News Today
x

సిసిఐ కోసం పోరాటం ఉధృతం.. వివిధ రూపాల్లో ఆందోళన...

Highlights

CCI: పరిశ్రమను మూసివేస్తే భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్...

CCI: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిమెంట్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ మినహా అన్నీ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి. CCI సాధన కమిటీ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా కేంద్రానికి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు సిద్ధమౌతున్నారు.

సిమెంట్ పరిశ్రమను పున:ప్రారంభించాలంటూ గత కొంతకాలంగా CCI సాధన కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తుంటే.. మరోవైపు అవేమి పట్టించుకోకుండా సిమెంట్ ఫ్యాక్టరీని పూర్తిగా మూసివేసే దిశగా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల CCIలో ఉన్న యంత్రాలను తొలగించి వాటిని స్క్రాప్‌లో విక్రయించేందుకు గానూ ఈ టెండర్ పిలిచింది. దీంతో ఇన్నాళ్లు ఈ పరిశ్రమ పునరుద్ధరణపై ఆశలు పెట్టుకున్న స్థానికులకు నిరాశే ఎదురైంది. అయితే కేంద్రం సిమెంట్ ఫ్యాక్టరీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవరించడంపై CCI ఉద్యోగులు, భూ నిర్వాసితులు మండిపడుతున్నారు.

అన్నీ రంగాల్లోనూ వెనకబడిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి తలమానికంగా ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదువేల మందికి ఉపాధి దొరుకుతుందని కార్మిక సంఘ నాయకులూ చెప్తున్నారు. గతంలో సిమెంట్ ఫ్యాక్టరీని సందర్శించిన కేంద్ర మంత్రులు ఈ పరిశ్రమను పునరుద్ధరిస్తామంటూ హామీ ఇచ్చారు. అయితే అది ఇంతవరకు నెరవేరక పోగా సిమెంట్ ఫ్యాక్టరీని శాశ్వతంగా తొలగించే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సిసిఐ ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి పరిశ్రమ ప్రాంగణంలో నిరసన తెలిపారు. పట్టణంలో ర్యాలీ చేపట్టి జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో తమ పిల్లలకు ఉగ్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో తమకున్న వ్యవసాయ భూములను సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అప్పగించామని తెలిపారు. అయితే ఇప్పుడు ఈ పరిశ్రమను పూర్తిగా మూసివేస్తే తమ భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో CCI గేటు ఎదుటే నిరసన కార్యక్రమాలు చేపడతామని, కేంద్రం చర్యలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories