టీఆర్ఎస్ పాలనకు ఎనిమిదేళ్లు.. ప్రభుత్వానికి భారంగా మారిన ఆర్ధిక పరిస్థితి

Eight Years have Passed Since the Formation of the TRS Government | TS News
x

టీఆర్ఎస్ పాలనకు ఎనిమిదేళ్లు.. ప్రభుత్వానికి భారంగా మారిన ఆర్ధిక పరిస్థితి

Highlights

TRS Government: రెండో టర్మ్‌లో పూర్తిగా దేశ రాజకీయాలపైనే కేసీఆర్ ఫోకస్

TRS Government: నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన ఎజెండాతో సాగిన తెలంగాణ ఏర్పాటు జరిగి అప్పుడే ఎనిమిదేళ్లు గడిచాయి. ఎనిమిదేళ్ల కాలంలో అనేక ఆటుపోట్లు, విజయాలు, అపజయాలు, వీటన్నిటికీ ఎదురిది వెళ్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుపై hmtv ప్రత్యేక కథనం..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి సరిగ్గా ఎనిమిదేళ్లు. అటు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఎనిమిది ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఉద్యమ సమయంలో ఫక్తు స్వరాష్ట్ర కాంక్షతో పురుడుపోసుకొని పని చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పూర్తిగా ఉద్యమ పార్టీగానే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పని చేస్తుందని అప్పట్లో కేసీఆర్ ప్రకటించారు. 2014 ఎన్నికల్లో మొన్నటి వరకు తెలంగాణ ప్రజల కోసం రాష్ట్ర సాధన కోసం పని చేసిన పార్టీ ఇక మీదట పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ఉంటుందని ప్రకటన చేశారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కేవలం 63 స్థానాలను కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసే అదృష్టం టీఆర్ఎస్‌నే వరించింది.

ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధన కోసం పోరాడిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2018లో జరిగిన ఎన్నికలు చాలా భిన్నమైనవి. ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి కేసీఆర్ మీద టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాల మీద చేసిన ఆరోపణలను ఎదురుకొనేందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లి 88 స్థానాలను కైసవం చేసుకున్నారు. అయితే అంతకు ముందు జరిగిన ఎన్నికలతో పాటు ముందస్తు ఎన్నికల్లో తెలంగాణను తామే ఇచ్చామనే భావాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయింది. దీంతో రెండు సార్లు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ ఎనిమిదేళ్ళల్లో అనేక విజయాలు అనేక అపజయాలు చవి చూసింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. 2014లో వ్యవసాయం, ఇరిగేషన్ మీదనే పూర్తి దృష్టి పెట్టారు. ఆ తరువాత పూర్తిగా రాజకీయ పరమైన అంశాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందనే విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో జరిగిన వివిధ బై ఎలక్షన్స్ లో తాకత్ కు మించి ఖర్చు చేయడం.. ఎలాగైనా గెలవాలన్నా ఉద్దేశ్యంతో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం లాంటి అంశాలు పూర్తిగా టీఆర్‌ఎస్‌కు నెగెటివ్‌గా మారాయి. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మొదటిసారి ఓటమి చవి చూసింది. ఆ తరువాత జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తరువాత టీఆర్‌ఎస్ మానియా మొత్తం మారిపోయింది. గత ఏడేళ్ళల్లో ఎప్పుడు లేనంత వ్యతిరేకత సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఎదురుకొన్నారు. ఇటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల చరిత్రలో ఎప్పుడు లేనంతగా బీజేపీ తన ప్రాబల్యాన్ని చాటుకొని 48 స్థానాలను గెలుచుకోంది. ఇలా రెండో టర్మ్ పూర్తి కాకముందే టీఆర్‌ఎస్ ప్రభుత్వ విదానాలపై, కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది.

పాలన పరమైన నిర్ణయాల్లో కొంత మేరకు అభివృద్ధి చేపట్టిన ఘనత టీఆర్‌ఎస్‌కు దక్కుతుంది. అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో ఉన్న కరెంటు సంక్షోభాన్ని తట్టుకొని 24 గంటల కరెంటు సరఫరా ఇవ్వగలిగింది. పాత విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి చేసి కొత్తగా యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచింది. భారీ స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. పొరుగు రాష్ట్రాలతో నీటి వివాదాలకు స్వస్తి పలికి ఒప్పందాలు చేసుకొంది. దీని కోసం ప్రాజెక్టులను రీ-డిజైన్ చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ-డిజైనింగ్ చేసి కాళేశ్వరంగా మార్చారు. గోదావరిపై తలపెట్టిన సీతారామ, దేవాదుల ఫేస్, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల పనులు పరుగులు పెట్టిస్తున్నారు.

ఇలా అనేక ప్రాజెక్టులను పూర్తి చేసి చెరువులను నిండుకుండలా తలపించేలా చేసింది ప్రభుత్వం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి భారీ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది సర్కార్. కంటి వెలుగు కార్యక్రమంతో కోటిన్నర మందికి ఉచిత పరీక్షలు నిర్వహించి, 35 లక్షల మందికి కళ్ళద్దాలు పంపిణీ చేసింది. కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసింది. రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించడమే కాకుండా, జోనల్ వ్యవస్థను సవరించి జోన్లు ఏర్పాటు చేశారు. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కేల తెలంగాణలో నూతన జోనల్, మల్టీ జోనల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానంలో భాగంగా కొత్తగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించింది.

ఈ ఎనిమిది ఏళ్ళల్లో అనేక కొత్త పథకాలు, సంక్షేమ రంగానికి కూడా సీఎం కేసీఆర్ పెద్ద పీట వేశారు. ఇచ్చిన హామీ మేరకు ఆసరా పథకం అమలు చేశారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లాంటి పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో రైతులకు వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం వంటి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాల స్వరూపం మార్చే ప్రణాళికలు రూపొందించారు. కొత్త పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలతో పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. యాదాద్రి దేవాలయాన్ని కనీవినీ ఎరుగని రీతిలో పునర్నిర్మాణం చేశారు.

ఇక రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా దాదాపు 90వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నూతనంగా ఏర్పడిన తెలంగాణలో పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత కొత్త కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు నిర్మాణం చేపడుతున్నారు. అదేవిధంగా నూతన సచివాలయ నిర్మాణాన్ని దాదాపు వెయ్యి కోట్లతో చేపట్టింది ప్రభుత్వం. మొత్తంగా ఈ ఎనిమిదేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసింది. ఒకటో తేదీన జీతాలు ఇచ్చే ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి ఆలస్యం అవుతుంది. ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అనుకునంత స్థాయిలో అభివృద్ధి జరగలేదని విమర్శలు కూడగట్టుకుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories