Mancherial: మంచిర్యాలో జిల్లాలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

Demolition of Illegal Constructions in Mancherial
x
మంచిర్యాల జిల్లాలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత (ఫైల్ ఇమేజ్)
Highlights

Mancherial: అనుమతి లేని నిర్మాణాలపై మున్సిపల్ శాఖ నిఘా

Mancherial: మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణలు, అనుమతులకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలపై ప్రభుత్వం నిఘా పెట్టింది. కానీ క్షేత్రస్థాయిలో రాజకీయ అండదండలు ఉన్నవారికి మినహాయింపు ఇస్తూ, సామాన్యులపై కొరడా ఝళిపిస్తు్న్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధుల తీరుతో ఏం చేయాలో ఎవరికి సర్దిచెప్పాలో తెలియక తలపట్టుకుంటున్నారు మంచిర్యాల జిల్లా అధికారులు.

మంచిర్యాల జిల్లాలో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. ఏడు మున్సిపాలిటీల్లో 154 వరకు అక్రమ కట్టడాలను గుర్తించారు. అయితే కొన్ని చోట్ల స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. మున్సిపాలిటీల్లోని పలు చోట్ల అక్రమ కట్డడాలకు స్థానిక ప్రజాప్రతినధులే సహకరిస్తున్నారని, వారిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ నేతలు అంటున్నారు.

బెల్లంపల్లి, చెన్నూరు, నస్పూర్ మున్సిపాలిటీల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. చెన్నూరులో మాత్రం ఇటువంటి కట్టడాలకు అధికారులే వత్తాసు పలుకుతున్నారని, సామాన్యుల ఇళ్లను మాత్రం టార్గెట్ చేసుకుని కూల్చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

ఆగస్ట్ 30న బెల్లంపల్లి 11వ వార్డు పరిధిలో రైల్వేస్టేషన్ ఏరియాలో అనుమతి లేకుండా ఇళ్లు కడుతుండగా టాస్క్‌ఫోర్స్ అధికారులు అక్కడికి చేరుకుని కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఆ భవన యజమానికి మద్దతుగా ఏకంగా పాలకవర్గం ధర్నా చేసి తమ మద్దతను చాటి చెప్పారు. ఇంటి నిర్మాణాలను కూల్చివేయొద్దని మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ సహా కౌన్సిలర్లు ఎదురుగా నిలబడి అధికారులకు నిరసన తెలిపారు. కమిషనర్ సహా ఎవరూ చెప్పినా వినకపోవడంతో చివరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెనుదిరిగారు. ఆ ఇల్లు మున్సిపల్స్ చైర్ పర్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో ఉండడంతో అటు అధికారులు సైతం వెనకడుగువేసారు.

నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆసైన్డ్, ప్రభుత్వ భూముల్లో, నాలాలను కబ్జా చేస్తూ బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ భవనాలపై కన్నెత్తి చూసే అధికారి ఉండరు. కానీ ఎవరైనా చిన్నాచితక నిర్మాణాలు చేపడితే మాత్రం అక్రమ నిర్మాణమని పేర్కొంటూ అధికారులు కూల్చివేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. అటు చెన్నూరులోనూ భవన నిర్మాణ నిబంధనలను తుంగలో తొక్కుతూ అనేక కట్టడాలు వెలుస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మేల్కొని అక్రమ నిర్మాణాల కూల్చివేతలలో రాజకీయ జోక్యం ఉండకుండా, అధికారులు పూర్తి స్వేచ్ఛతో విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories