logo
తెలంగాణ

దసరా పండుగకి పప్పన్నం అయినా తినగలమా?

దసరా పండుగకి పప్పన్నం అయినా తినగలమా?
X
Highlights

Dasara Festival: కొండెక్కి పోయిన నిత్యావసరాల ధరలతో ఈదసరా పండుగ సామాన్యులకు తీపి తినే అవకాశం కూడా లేకుండా చేస్తోంది.

పండగ ఏదైనా సరే నోరు తీపి చేసుకోవడం తప్పనిసరి. ఇక దసరా..దీపావళి అంటే స్వీట్ లేకుండా పండగ జరగదు. దసరా పండుగకు అయితే, నాన్ వెజ్ కచ్చితంగా ఉండాల్సిందే చాలా మందికి. మాంసాహారులు కాకపొతే రెండు మూడు రకాల కూరలతో విందు భోజనం ప్రజలకు అలవాటైన వ్యవహారం. మరి ఈ పండుగ నోటిని తీపి చేసే అవకాశం ఉందా? ఆహార ప్రియులకు ఈ దసరా పస్తులు తప్పవా? పరిస్థితులు అలానే ఉన్నాయి. ఒక్కసారిగా ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో ఈసారి పండుగ పూట పప్పన్నమూ కష్టంగానే ఉండేలా మారింది సామాన్యుల పరిస్థితి. కొత్త బట్టలు.. కోటి సంబరాల మాట దేవుడెరుగు కనీసం భగవంతునికి ఇంత నైవేద్యం పెట్టి కొంత నోట్లో వేసుకునేలా కూడా ప్రసాదం దక్కే పరిస్థితి కనిపించడం లేదు..

చక్కర తలుచుకుంటే చక్కర్ వచ్చేట్టుంది..

కిలో చక్కర కొనాలంటే 40 రూపాయలు పెట్టాల్సిందే. పోనీ అర్ధో.. పావో తీసుకుని మామ అనిపించాలంటే ఆ ధర 50 రూపాయలుగా మారిపోతుంది. దసరా పండుగ కోసం చక్కర కొని ప్రసాదం చేసుకుని తృప్తిగా ఉండే పరిస్థతి లేదు.

నూనెల ధర వింటే గుండె జారిపోతోంది..

కేజీ మంచి నూనె రిఫైండ్ అయితే 110 రూపాయలు.. అదే పామాయిల్ అయితే..95 రూపాయలు. ఇక ఇంత ధరతో కనీసం పోపు పెట్టడానికి కూడా నూనెలు కొనగలమా అనే సందిగ్ధం వ్యక్తం అవుతోంది సామాన్యులలో..

ఉల్లి ఘాటుకు ఒళ్లంతా మంటెక్కుతోంది

ఉల్లిపాయ వాసన చూస్తేనే ఒళ్లంతా ఘాటెక్కి మంటెక్కి పోతోంది. వంద నుంచి నూట ఇరవై రూపాయలకు కిలో ఉల్లి దొరకడం గగనంగా మారింది. ఉల్లి లేని కూరతో పండగ వెళ్ళాల్సిందే అనిపించేలా ఉంది పరిస్థితి.

కూరగాయలు గూబ పగలగొడుతున్నాయి..

కూరగాయల ధరలు కూడా ఏ మాత్రం అందుబాటులో లేవు. కేజీ టమాట 60 రూపాయల వరకూ ఉంటోంది. ఒక్క ములక్కాడ పదిరూపాయలు.. ఎఏ కూరగాయ అయినా సరే కిలో 60 రూపాయల నుంచి 80 రూపాయల వరకూ చెబుతున్నారు. దీంతో ఒక్క ముద్దన్నా కూరన్నం తినేలా లేదు ఈ పండుగ వేళ!

పప్పుల ధరల పరుగు..

సరే పప్పన్నంతో సరిపేట్టుకుందామని చూసినా ఒక కిలో కందిపప్పు 100 నుంచి 120 రూపాయలుంది. పెసరపప్పు కూడా ఏమాత్రం తీసిపోలేదు. ఇక ఇంత ధర పెట్టి పప్పన్నం తినే పరిస్థతి సామాన్యులకు లేదు.

బిరుసెక్కిన బియ్యం ధరలు..

కనీసం 45 రూపాయలు.. మంచి రకం అయితే 55 రూపాయలు పెడితేనే కానీ బియ్యం దొరకడం లేదు. దీంతో పండగ వేళలో ఇంటికి వచ్చే బంధు మిత్రులకి ఒక్క పూట కడుపు నిండా అన్నం పెట్టగాలమా అనే మీమాంసలో ఉన్నారు జనం.

కోడి గుడ్డు కూడా అందుబాటులో లేదు..

ఇక మాంసాహార ప్రియులు దసరా అంటే చాలు కోడిని కోసుకోవాలా..మేక మాంసం కొనుక్కోవాలా అని చూసేవారు గతంలో. ఇప్పుడు ఆ సీన్ లేదు మాంసం మాటెలా ఉన్నా కనీసం కోడి గుడ్డు కొనాలన్నా 8 రూపాయలు పెట్టాల్సిందే. మరిక కోడిని ఎలా కొనగలరు? పోనీ చికెన్ కొని కానిడ్డామా అంటే కిలో 250 రూపాయలకు పై మాటే ఉంది దాని ధర. ఇదిలా ఉంటే దసరా అంటే ఎక్కువగా వేట మాంసం తినాలని కోరుకుంటారు. కానీ, ఈసారి వంద గ్రాములు కూడా కొనుక్కోగలిగే అవకాశం లేదు. ఎందుకంటే కిలో మటన్‌ రూ. 750 నుంచి 800 వరకు ధర ఉంది.

మొత్తమ్మీద ఈ దసరా పండగ చుక్కలను అంటిన ధరలతో చప్ప చప్పగా సాగుతోంది. కరోనా దెబ్బకి బంధు మిత్రుల రాకపోకలు పెద్దగా ఉండే అవకాశం లేదు. ఇంట్లో ఉన్న నలుగురూ అయినా కాస్త చక్కని భోజనం చేసే అవకాశం మరీ ముఖ్యంగా పండుగ విందు చేసుకునే పరిస్థితీ లేకపోవడం సామాన్యుల్లో పండుగ సందడి అంతంత మాత్రంగానే ఉందని చెప్పాలి.

Web TitleDasara Festival became dull due to all essentials along with vegetables and other food items rates hike
Next Story