CM KCR: హుజూరాబాద్‌ నుంచే దళిత బంధు

Dalit Empowerment Scheme Name Finalized as a Telangana Dalita Bandhu
x

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

CM KCR:దళితుల సాధికారత పథకానికి పేరు ఖరారు చేసిన సీఎం కేసీఆర్‌

CM KCR: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళిత సాధికారత స్కీమ్‌కు సీఎం కేసీఆర్‌ కొత్త పేరును ఖరారు చేశారు. ఈ పథకానికి 'తెలంగాణ దళిత బంధు' పేరును ఖరారు చేశారు. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ స్కీమ్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీఎం సంకల్పించారు. ముందు నిర్ణయించిన ప్రకారమే 1,200 కోట్లతో తెలంగాణ దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందని, అయితే పైలట్‌ ప్రాజెక్టు అయినందున హుజూరాబాద్‌కు అదనంగా 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల రూపాయల వరకు వెచ్చించనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. ఇక్కడ 20,929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. నిబంధనల మేరకు అర్హులైన వారిని ఎంపిక చేసి.. ఆయా కుటుంబాలకు పరిపూర్ణ స్థాయిలో పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. త్వరలోనే తేదీని ప్రకటిస్తామన్నారు.

గత నెల 27న జరిగిన అఖిలపక్ష సమావేశంలో దళత సాధికారత పథకంపై సీఎం నిర్ణయం తీసుకున్నారు. స్వీయ ఆర్థిక సాధికారత ద్వారా తమ అభివృద్ధిని తామే నిర్వచించుకుని, నిర్ణయించుకునేలా ఒక్కొక్క నిరుపేద కుటుంబానికి యూనిట్ల ఏర్పాటుకు పది లక్షల ఆర్థిక సాయం చొప్పున ప్రతి నియోజకవర్గంలోనూ వంద కుటుంబాలకు ఇస్తామని ప్రకటించారు. మొత్తం 119 నియోజకవర్గాలలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. రైతుబంధు మాదిరే సాయాన్ని ఎంపికైన కుటుంబాల పేరిట నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఆరోజే సీఎం స్పష్టం చేశారు

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఆది నుంచి తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిలిచిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రారంభిస్తున్నారు. కరీంనగర్‌లో 2001లో తెలంగాణ సింహగర్జన సభ జరిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్‌లో రైతుబంధు, కరీంనగర్‌లో రైతు బీమా పథకాన్ని ప్రారంభించారు. అదే ఆనవాయితీని కొనసాగించాలని దళిత బంధు పథకం అమలుకు పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని దళిత కుటుంబాల వివరాల స్థితిగతులపై అధ్యయనం చేసి, నిబంధనల మేరకు ఉద్యోగులు, ఉన్నతస్థాయిలో ఉన్న వారు మినహా ఇతరులను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. హుజూరాబాద్‌ గ్రామీణ మండలంలో 5,323 దళిత కుటుంబాలు, కమలాపూర్‌ మండలంలో 4,346, వీణవంక మండలంలో 3,678, జమ్మికుంట మండలంలో 4,996, ఇల్లంతకుంట మండలంలో 2,586 కుటుంబాలున్నాయని అధికారులు నివేదించారు. పైలట్‌ ప్రాజెక్టు అమలు కోసం కలెక్టర్లతో పాటు ఎంపిక చేసిన అధికారులు పాల్గొంటారు. వారితో త్వరలోనే వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. దళితులను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చడమే ఈ పథకం లక్ష్యమని.. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి అనుభవాలను సమీక్షించుకుని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు చేయడం అధికారులకు మరింత సులువవుతుందని ఆయన తెలిపారు. ఇక ఈ నెలాఖరులోపు లేదా ఆగస్టు 15న ఈ పథకాన్ని సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌లో లేదా కమలాపూర్‌ మండలంలో పెద్దఎత్తున ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం


Show Full Article
Print Article
Next Story
More Stories