Cyber Crime: హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. దురాశే నేరగాళ్లకు పెట్టుబడంటున్న పోలీసులు

Cybercriminals Rampant In Hyderabad
x

Cyber Crime: హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. దురాశే నేరగాళ్లకు పెట్టుబడంటున్న పోలీసులు

Highlights

Cyber Crime: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏడాదిలో 200 కేసులు

Cyber Crime: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయక ప్రజల్ని టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. కష్టపడి సంపాదించి దాచుకున్నసొమ్మును గద్దల్లా తన్నుకు పోతున్నారు. కంటికి కనిపించకుండా క్షణాల్లోనే డబ్బు స్వాహా చేసేస్తున్నారు. ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఏడాదిలో 200 వరకూ ఘటనలు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సైబర్‌ నేరగాళ్లు చేసే మోసాలపై ప్రజల్లో అవగాహన వచ్చేలోపే. వారు కొత్తపంథాను ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు బ్యాంకు వివరాల అప్‌డేట్‌, క్రెడిట్‌ కార్డు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేర్లతో వల వేసేవారు. ఇప్పుడు రూటు మార్చి వ్యక్తులు, వారి వయసుల ఆధారంగా మోసాలకు పాల్పడుతున్నారు. వృద్ధులైతే కరెంటు, నల్లా బిల్లులు కట్టలేదంటూ.గృహిణులకు తక్కువ ధరతో గృహోపకరణాలు ఇస్తామంటూ యువకులైతే క్రిప్టో కరెన్సీ, పెట్టుబడులకు లాభాలంటూ వల విసిరి నిండా ముంచుతున్నారు.

ప్రజల వ్యక్తి గత వివరాలు సేకరించి దాని ఆధారంగా మోసాలు చేస్తున్నారు. వీటికితోడు గూగుల్‌లో తప్పుడు ప్రకటనలు, నకిలీ వెబ్‌సైట్లు భారీగా పుట్టుకొస్తున్నాయి. ఏ అంశం మీద వెతికినా దానికి సంబంధించిన ప్రకటనలు తెరపైకి వస్తున్నాయి. ప్రత్యేక సందర్భాల్లో కొన్ని సంస్థలకు వ్యక్తిగత వివరాలు అందిస్తుంటాం. ఇవన్నీ నేరగాళ్లకు చేరుతున్నాయి. ఇవే వివరాలతో మోసగాళ్లు ఫోన్లో సంప్రదించి డబ్బు కొల్లగొడుతున్నారు.

ఇటీవల కాలంలో రకరకాల పేర్లతో హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఒక్క సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే ఈ ఏడాది దాదాపు 200 వరకు ఫిర్యాదులొచ్చాయి. బాధితుల్లో యువత, గృహిణులు ఉంటున్నారు. యువతకు క్రిప్టోకరెన్సీ, షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. మహిళలకు అతితక్కువ ధరకు గృహోపకరణాలు అందిస్తామంటూ ఫోన్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.

కొందరు కుటుంబ సభ్యులకు చెప్పకుండా క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్‌లో పెట్టుబడులంటూ లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఎవరికైనా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ కానీ, మెస్సేజ్‌లు కానీ వస్తే చాలా జాగ్రత్త పడాలంటున్నారు పోలీసులు. తక్కువ పెట్టుబడి పెడితే దానికి నాలుగింతలిస్తామని ఎవరైనా మెస్సేజ్ చేస్తే అతడు మోసగాడని గుర్తించాలంటున్నారు. ఎవరైనా మార్కెట్ రేటు కంటే అతి తక్కువ ధరకు మీకేదైనా వస్తువు అమ్ముతానంటే ఆ వ్యక్తి మీకు ఎరవేస్తున్నాడని గుర్తించాలని పోలీసులంటున్నారు.

ఫోన్ నెంబర్ కు లాటరీ తగిలింది వెంటనే అది విడుదల కావాలంటే కొంత టాక్స్ కట్టాలని చెబుతారు ఆ ట్రాప్ పడ్డామా ? మనపని గోవింద.దురాశకు మించిన మత్తు మందులేదు. ఆ మత్తులో పడ్డామా అంతే సంగతులు. ఎందుకంటే దురాశే నేరాగాళ్లకు పెట్టుబడి. అందుకే డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి. అంతే కాని లాటరీలు, తక్కువ పెట్టుబడికే ఎక్కవ డబ్బులు వంటి ప్రకటనలకు దూరంగా ఉండాలి.

సైబర్‌ మోసాల బారిన పడినా, హ్యాకింగ్ లాంటివి జరిగినా ఆలస్యం చేయకుండా 1930 టోల్‌ ఫ్రీకి కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories