Fake Seeds: వరంగల్ జిల్లాలో నకిలీ విత్తన వ్యాపారులు.. 120 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం

Counterfeit Seed Traders In Warangal District
x

Fake Seeds: వరంగల్ జిల్లాలో నకిలీ విత్తన వ్యాపారులు.. 120 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం

Highlights

Fake Seeds: 15 మంది నకిలీ విత్తన వ్యాపారుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు

Fake Seeds: తొలకరి వర్షాలు ప్రారంభమయ్యాయంటే రైతులు విత్తనాలు కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు. ఇదే అదునుగా నాసిరకం విత్తనాలను అంటగట్టేందుకు కొందరు దళారులు గ్రామాల్లోకి వెళ్లి రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. తీరా విత్తనం వేసిన తర్వాత మొలకెత్తవు. అప్పుడుగానీ అవి నాసిరకమని తెలియక మోసపోవడం రైతు వంతవుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నకిలీ విత్తనాల బెడద పెరిగింది. ఇటీవల పోలీసులు రెండున్నర కోట్ల విలువ చేసే నకిలీవిత్తనాల గుట్టు రట్టుచేశారు ఉమ్మడి జిల్లాలో నకిలీ విత్తనాల దందాపై స్పెషల్ ఫోకస్.

వానాకాలం సాగు మొదలు అవ్వడంతో రైతులకు నకిలీ విత్తనాల బెడద ఎదురవుతోంది. నాలుగు రాష్ట్రాల్లో నకిలీ విత్తనాలను విక్రయించే రెండు ముఠాలకు చెందిన 15 మందిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. వారి నుంచి 120 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొన్నారు. నాసిరకం విత్తనాలకు అడ్డుకట్టకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏటా వీటి దందా కొనసాగుతూనే ఉంది. సరిహద్దు రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా కాలం చెల్లిన, నాసిరకం విత్తనాలు జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మించి కొందరు వ్యాపారులు అన్నదాతల్ని మోసం చేస్తున్నారు. జిల్లాలో పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు ప్రధానంగా సాగవుతాయి. దీనిని ఆసరా చేసుకొని నకిలీ వ్యాపారులు ఈ పంటలకు సంబంధించిన నకిలీ విత్తనాలను విచ్చలవిడిగా అమ్ముతున్నారు.

నకిలీ విత్తనాలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్నాటక, చత్తీ్‌సగఢ్‌, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా జిల్లాల నుంచి వస్తోన్న విత్తనాలను జిల్లాలోకి గట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రి తరలించి రహస్య ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు.నకిలీ విత్తన తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ఆచరణలో అది పెద్దగా కనిపించడం లేదు. వ్యవసాయ, పోలీసు శాఖ అడపాదడపా చర్యలు చేపడుతున్నా కట్టడి కావడం లేదు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖరీఫ్ లో పన్నెండు లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. ఉమ్మడి జిల్లాలో ఈసారి 5లక్షల 50 వేల ఎకరాల్లో పత్తిసాగవుతుందని వ్యవసాయాధికారులు ప్రణాళికనురూపొందించారు. ఒక్కో విత్తన సంచి 450 గ్రాములు ఉంటుంది. ఎకరానికి రెండు సంచులు అవసరం. ఈ లెక్కన 5.50 లక్షల ఎకరాలకు 10 లక్షల నుంచి 11లక్షల విత్తన సంచులు కావాలి. దీనిని దృష్టిలోపెట్టుకున్న అక్రమ వ్యాపారులు రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన బీటీ-3 పేరిట నకిలీ విత్తనాలను తయారుచేశారు. చేనులో గడ్డి మందును పిచికారి చేసినా ఈ మొక్కలు తట్టుకుంటాయని.. ఇవి అధీకృత డీలర్ల వద్ద లభించవని మాయమాటలు చెప్పి రైతులకు విక్రయిస్తున్నారు.

నకిలీ విత్తన వ్యాపారుల నుంచి పోలీసులు 9786ప్యాకెట్లతో పాటు 70 క్వింటాళ్ల విడి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి 12,660ఎకరాలకు అవసరమవుతాయి. పోలీసులు వాటిని పట్టుకోవడం వల్ల అన్ని ఎకరాల్లో నకిలీ విత్తనం పాగా వేయకుండాఅడ్డుకట్ట వేసి పత్తి రైతులకు భరోసాగా నిలిచారు. ఈ సందర్భంగా పోలీసులు కొన్ని సూచనలు చేశారు. జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా రైతులకు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్టు తెలిస్తే ఆ సమారాన్ని పోలీసు కమిషనర్‌ సీపీకు మెసేజ్‌ రూపంలో వాట్సాప్‌ చేయవచ్చని, లేదా పోలీసు కమిషనరేట్‌ కార్యాలయానికి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఒకవైపు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు పోలీసులు..

Show Full Article
Print Article
Next Story
More Stories