Coronavirus: సెకండ్‌ వేవ్‌తో విరుచుకుపడుతోన్న కరోనా

corona danger bells in telangana
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

Coronavirus: తెలంగాణలో నాలుగు వారాల్లో నాలుగు రెట్ల కేసులు

Coronavirus: సెకండ్‌వేవ్‌‌తో విరుచుకుపడుతున్న కోవిడ్‌.. తెలంగాణలో ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తోంది. నాలుగు వారాల్లో రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు నాలుగు రెట్లు పెరిగాయి. కేసులే కాదు.. పాజిటివిటీ రేటు కూడా భారీగా పెరిగింది. రోజురోజుకూ ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రం మొత్తం 4 వేల 347 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మార్చిలో ఆ సంఖ్య పెరిగింది. 30 రోజుల్లో 8 వేల 8 వందల మంది కోవిడ్ బారిన పడ్డారు. ఫిబ్రవరిలో పాజిటివిటీ రేటు 0.5 శాతం ఉండగా.. మార్చిలో 0.61 శాతానికి పెరిగింది. గత మూడురోజులుగా అధికంగా కేసులు నమోదవుతుండటంతో పాజిటివిటీ రేటు 1.21కి చేరింది.

మార్చి 1న తెలంగాణలో నమోదైన కేసుల సంఖ్య 163. మార్చి 30న ఆ కేసుల సంఖ్య 684కు చేరింది. గతేడాది డిసెంబర్‌ 9న 721 కేసులు నమోదవగా.. ఆ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. అయితే 30 రోజుల వ్యవధిలో కోవిడ్‌ కేసుల సంఖ్య నాలుగు రెట్లకు పైగా నమోదవడం ఆందోళన రేకెత్తిస్తోంది. గత పరిస్థితులే మళ్లీ పునరావృతమవుతాయా అనే సందేహం ప్రజల్లో నెలకొంది. గతేడాది ఇదే సమయంలో రాష్ట్రంలో కేసుల ఉధృతి పెరిగింది. మార్చిలో కాస్త అదుపులోనే ఉన్నా.. ఏప్రిల్‌లో విరుచుకుపడింది కరోనా. ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు వేగంగా విస్తరించిన కరోనా రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసింది.

గతేడాది ఇదే సమయానికి జీహెచ్‌ఎంసీలోనే అధికంగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న రాష్ట్రంలో 684 కేసులు నమోదవగా.. అందులో 184 కేసులు జీహెచ్‌ఎంసీలోవే. మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 61, నిజామాబాద్‌లో 48, రంగారెడ్డిలో 45 కేసులు నమోదయ్యాయి. ఈ నాలుగు జిల్లాలు సహా రాష్ట్రంలోని 15 జిల్లాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.

ఇక రాష్ట్రంలో కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయ్యే వారు అధికంగా ఉన్నా యాక్టివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. హాస్పిటల్‌లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మార్చి 1న హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులు 19 వందల మంది ఉండగా మార్చి 30కి ఆ సంఖ్య 5 వేలకు చేరువైంది. గడిచిన నాలుగు వారాల్లో మరణాలు కూడా పెరిగాయి. నెలరోజుల వ్యవధిలో మొత్తం 64 మంది ప్రాణాలు కోల్పోయారు.

గత నాలుగు వారాల గణాంకాలు చూస్తే కోవిడ్ సెకండ్ వేవ్‌ ప్రభావమేంటో స్పష్టంగా తెలుస్తోంది. కరోనాపై అదుపుతప్పితే గతేడాది ఎదురైన పరిస్థితులు మళ్లీ ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నాయి ఈ గణాంకాలు. రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొనడంతో కోవిడ్ నిబంధనలను ప్రతీ ఒక్కరూ పాటించాలని అధికారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండు నెలల్లో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories