Corona Second Wave: కరీంనగర్ జిల్లాలో డేజంర్ బెల్స్..అక్కడ పెరుగుతున్న కేసులు, మరణాలు

CoronaVirus Karimnagar
x

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం 

Highlights

Corona Second Wave: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.

Corona Second Wave: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. వైరస్ ముప్పేట దాడితో జిల్లా గజగజ వణుకుతోంది. సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్ న్యూ స్ట్రెయిన్‌గా బలోపేతమై మరింత ప్రాణాంతకంగా మారిందని వైద్యులంటున్నారు. కేసులు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో మరణాలు పెరుగుతున్నాయి. బాధితులు చివరి దశలో ఆస్పత్రులకు వస్తుండడంతో మరణాల సంఖ్యలు పెరుగుతున్నాయని కూడా వైద్యులంటున్నారు.

ఎటు చూసినా అంబులెన్స్‌ల సైరన్లతో కరీంనగర్‌లో కరోనా మరణ మృదంగ ఘోష వినిపిస్తోంది. ప్రతి నలుగురిలో ఒకరికి ప్రతి నిమిషానికి ఐదుగురు కరోనా బారిన పడుతున్నారట. దీంతో జనాలు ఎప్పుడేం జరుగుతుందో కరోనా ఎటువైపు నుంచి దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు ఆర్టీపీసీఆర్ టెస్టులు వేగవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

లాక్‌డౌన్ ఎత్తేసి కరోనాకు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికాం. గత ఏడాది ఇదే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదైతే ఈ ఏడాది ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఐతే పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్‌లతో పాటు ఐసీ యూనిట్లను పెంచినట్లు వైద్యులు తెలిపారు.

వైద్య ఆరోగ్య శాఖామంత్రి సొంత జిల్లాలో కరోనా పాండమిక్ సమయంలో కృతిమ కొరత పేరుతొ ప్రయివేట్ ఆసుపత్రులు దోపిడీకి పాల్పడుతున్నాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కరోనా ట్రీట్మెంట్‌కు నిర్దిష్ట ప్రణాళికలు లేకపోవడంతో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయట కొన్ని ప్రయివేట్ ఆసుపత్రులు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అన్ని ఆసుపత్రులు కరోనా పేషంట్లతో కిటకిటలాడుతున్నాయి. ఓవైపు ఉమ్మడి జిల్లాలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ భయంతో గ్రామాలూ స్వచ్చంద లాక్‌డౌన్ లు పాటిస్తున్నాయి. ఓ వైపు వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంకోవైపు ఆరోగ్య కేంద్రాల్లో కోవిద్ టెస్టులు చేస్తున్నారు. కరోనా కారణంగా సంభవిస్తున్న మరణాలు ఒకవైపు ఆందోళన కలిగిస్తే స్మశాన వాటికలో మంటల్లో కాలుతున్న శవాల దృశ్యాలు చూసి ఒళ్లు గగుర్పాటుకి గురవుతోంది. ఇంకోవైపు.. ఆ పక్కనే కొత్త శవాల కోసం పేర్చిన కట్టెలు. ఈ దృశ్యాలు ఇప్పుడు నిత్యకృత్యాలుగా కరోనా విలయానికి సజీవ సాక్ష్యాలుగా కన్పిస్తున్నాయి.

సెకండ్ వేవ్‌లో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. న్యూ స్ట్రెయిన్ కరోనా మరింత ప్రమాదకరమంటున్నారు వైద్యులు. రెమిడీసీవీర్ లాంటి సపోర్టివ్ మెడిసిన్ అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రధానంగా పేషంట్లకు తగినంత ఆక్సిజన్ అందుబాటులో లేదన్నది నగ్నసత్యం.

ఉత్తర తెలంగాణలోనే అత్యధిక వైద్యాలయాలున్న కరీంనగర్‌లో అన్ని అస్పత్రుల్లోనూ కరోనా రోగులతో బెడ్స్ నిండిపోతున్నాయి.. పొరుగు జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కరీంనగర్ జిల్లా కేంద్రం లో ఉన్న ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా జగిత్యాల జిల్లా నుంచి బతుకుదెరువు కోసం ముంబై, బీవండి, షోలాపూర్‌లకు వలస వెళ్లిన వారంతా మహారాష్ట్రలో కరోనా తీవ్రంగా విజృభిస్తుండడంతో భయపడి తిరిగి తమ సొంతూళ్లకు తిరిగి రావడంతో వారి ద్వారా కూడా ఇప్పుడు గ్రామాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా పేషెంట్ల సమస్యలను తీర్చేందుకు మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో పలు ఎక్విప్‌మెంట్లను ప్రారంభించారు. అలాగే పలు సలహాలు, సూచనలు కూడా చేసారు.

వైరస్ పెరగడానికి ప్రధాన కారణం ప్రజల నిర్లక్ష్యమే. మాస్క్ ధరించకుండా ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండా ప్రభుత్వ నిబంధనలు గాలికొదిలేయడం మూలంగానే మనం ఈ విపత్కర పరిస్థితులకు గురవుతున్నాం. కరోనా వైరస్‌ను నిలువరించేందుకు మాస్క్ మాత్రమే శ్రీ రామ రక్షా అని అందరూ గుర్తు పెట్టుకోవాలి. భౌతిక దూరాన్ని పాటిస్తూ శానిటైజర్ వాడితే కరోనా సోకకుండా క్షేమంగా ఉండొచ్చని సూచిస్తున్నారు వైద్యులు.


Show Full Article
Print Article
Next Story
More Stories