సూర్యాపేట జిల్లా యాదాద్రి టౌన్‌షిప్‌లో కరోనా టెన్షన్

సూర్యాపేట జిల్లా యాదాద్రి టౌన్‌షిప్‌లో కరోనా టెన్షన్
x
Highlights

* ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి పాజిటివ్ * గత నెల 24న అంత్యక్రియల్లో పాల్గొన్న కుటుంబసభ్యులు * కరోనా టెస్టులు చేయించుకోగా 22 మందికి పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఏదొక విధంగా దాడి చేస్తూనే ఉంది. తాజాగా వెలుగుచూసిన ఓ ఘటన రాష్ట్ర ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. సూర్యాపేట జిల్లా యాదాద్రి టౌన్‌షిప్‌లో ఓ వ్యక్తి అనారోగ్యంతో డిసెంబర్‌ 24న మృతిచెందాడు. ఆయన అంత్యక్రియలకు టౌన్‌షిప్‌లో ఉంటున్న కుటుంబసభ్యులతో పాటు, నల్గొండ, హైదరాబాద్‌కు చెందిన బంధువులు హాజరయ్యారు. అంత్యక్రియల అనంతరం కొంతమంది తమ ఇళ్లకు వెళ్లిపోగా కుటుంబసభ్యులు, సమీప బంధువులు మాత్రం కర్మకాండలు ముగిసేవరకు అక్కడే రెండిళ్లలో ఉండిపోయారు.

అయితే అంత్యక్రియలకు హాజరైన హైదరాబాద్‌కు చెందిన ఒకరు అలసటకు గురయ్యారు. దీంతో ఆయనకు వైద్యులు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సూర్యాపేటలోని బంధువులకు సమాచారమిచ్చారు. తనతోపాటు అంత్యక్రియల్లో పాల్గొన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రెండిళ్లలో ఉన్న కుటుంబసభ్యులు, బంధువులు వైద్య పరీక్షలకు వెళ్లారు. 38 మందికి పరీక్షలు చేయగా ఏ ఒక్కరికీ లక్షణాలు లేకపోయినా 22 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు.

ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా సోకడంతో జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. అందరినీ మూడు ఇళ్లలో క్వారంటైన్‌ చేశారు. అంత్యక్రియలకు హాజరైన వారందరిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఒకేసారి ఇంత మందికి కరోనా రావడంతో మున్సిపల్‌ అధికారులు యుద్ధ ప్రాతిపదికన అక్కడ శానిటైజేషన్‌ చేయించారు. కాలనీలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. ప్రతి ఇంటిని సర్వే చేసి ఎవరికైనా లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు అధికారులు.

యాదాద్రి టౌన్‌షిప్‌లో 22 మందికి కరోనా సోకడంపై జిల్లా వైద్యాధికారి, డాక్టర్‌ హర్షవర్ధన్‌ స్పందించారు. వారంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారని వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు టెస్టులు నిర్వహించి మందులు అందిస్తున్నారని తెలిపారు. అంత్యక్రియలు, చిన్నకర్మ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఒకేచోట ఎక్కువ మంది గుమిగూడడంతో వైరస్‌ వ్యాప్తి చెందిందని గుర్తించామన్నారు. శుభకార్యాలు, దేవాలయాలు, ఇలా ప్రజలు అధిక సంఖ్యలో ఉండేచోట కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌, శానిటైజర్‌ వాడాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories