Coronavirus Patients: సర్కారు దవాఖాలకు రాని కరోనా రోగులు.. బెడ్లు ఖాళీగా దర్శనమిస్తున్న వైనం

Coronavirus Patients: సర్కారు దవాఖాలకు రాని కరోనా రోగులు.. బెడ్లు ఖాళీగా దర్శనమిస్తున్న వైనం
x
Highlights

Coronavirus Patients | క్రమేపీ ప్రభుత్వం ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పోయినట్టు కనిపిస్తోంది.

Coronavirus Patients | క్రమేపీ ప్రభుత్వం ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పోయినట్టు కనిపిస్తోంది. ఒక పక్క కరోనా కేసులు తీవ్రమవతుంటే మరో పక్క ఆస్పత్రులు నిండా రోగులుండాల్సిన సమయంలో అవి ఖాళీగా దర్శనమిస్తుండటంతో విస్తుపోవాల్సి వస్తోంది. గతంలో కోవిద్ రోగులకు చికిత్స అందించడంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ప్రజలు ఈ విధంగా స్పందించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఇటీవల కాలంలో వైద్య సేవలందించే దిశగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినా, అవి వినియోగం కావడం లేదు. ఇదీ జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితి.

అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్నా ప్రభుత్వాస్పత్రుల పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. రోజురోజుకు కరోనా రోగులు పెరుగుతున్నా వారికి కేటాయించిన బెడ్లు ఖాళీగా దర్శనిమిస్తున్నాయి. చికిత్స కోసం మాత్రం సర్కారు దవాఖానాకు రావడం లేదు. అన్ని రకాల సౌకర్యాలు కల్పించామనీ, ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు దుబారా చేసుకోవద్దని పదేపదే రాష్ట్ర ప్రభుత్వం అంటున్నా ఆస్పత్రుల సౌకర్యాల్లో మార్పు తేలేకపోతున్నది. దీంతో కోవిడ్‌-19 రోగుల చికిత్స కోసం ఏర్పాటు చేసిన బెడ్లు మూడు జిల్లాల్లో, ఒక ఏరియా ఆస్పత్రిలో పూర్తిగా వెలవెలబోతుండగా, మరికొన్ని ఆస్పత్రుల్లో ఒకరిద్దరు రోగులకు చికిత్స అందిస్తూ మమ అనిపిస్తున్నారు. ప్రతిరోజూ రాష్ట్రంలో సగటున 3000 మంది వరకు కరోనా బారిన పడుతున్నారు. పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతున్నా, ఆ స్థాయిలోనే ప్రభుత్వాస్పత్రుల్లో రోగులసంఖ్య కనిపించకపోవడం గమనార్హం. వీరిలో ఎక్కువమంది ఇంటివద్ద ఉండటానికే ఇష్టపడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరేందుకే ఆసక్తి చూపించడం మారని సర్కారు దవాఖానాల తీరుకు అద్దం పడుతున్నది.

హొ హొరాష్ట్రంలో 42 ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా చికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఇందులో తాండూరు ఆస్పత్రిలో 300, ఉట్నూరులో ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో 80, దోమకొండ ఏరియా ఆస్పత్రిలో 25, జనగామ జిల్లా ఆస్పత్రిలో 13 బెడ్లు రోగులు లేకుండా ఖాళీగా ఉన్నాయి. ఈ నాలుగు ఆస్పత్రులున్న జిల్లాల్లో కేసులసంఖ్య తక్కువేమీ లేదు. గత వారంరోజుల్లో కామారెడ్డిలో అత్యధికంగా 516 కేసులు రాగా, జనగామలో 241, ఆదిలాబాద్‌లో 177, వికారాబాద్‌లో 123 వచ్చాయి. మరో ఏడు ఆస్పత్రుల్లో కేవలం 10 లోపే ఉన్నారు.

మెదక్‌ జిల్లా ఆస్పత్రిలో 46 పడకలకుగాను ఒక్కరు మాత్రమే ఉండగా, నారాయణపేటలో 160కి ఐదుగురు, జిహెచ్‌ఎంసి పరిధిలోని ఫీవర్‌ ఆస్పత్రిలో వందకు ఏడుగురు, మంచిర్యాల జిల్లా ఆస్పత్రిలో 240కి ఏడుగురు, గోధావరిఖని ఏరియా ఆస్పత్రిలో 60కి ఎనిమిది, పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో 84కు కేవలం తొమ్మిది మంది మాత్రమే రోగులుండడం గమనార్హం. మొత్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో కేవలం 2725 మందికి మాత్రమే చికిత్స అందిస్తున్నారు. రోగులను చూసేందుకు తగినంత మంది సిబ్బంది లేకపోవడం, సిబ్బంది ఉన్న ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మౌలిక సౌకర్యాల సమస్య ఇప్పటికీ కొనసాగుతుండడమే రోగులు ప్రభుత్వాస్పత్రుల పట్ల విముఖత చూపించడానికి కారణాలుగా ఉంటున్నాయి. అదే సమయంలో పలు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.

ప్రయివేటుకు అనుమతి.. హోం ఐసోలేషన్‌..

కరోనా చికిత్స విషయంలో ప్రభుత్వాస్పత్రులకే పరిమితం చేసి ఉంటే ఈపాటికి సిబ్బంది భర్తీ, సదుపాయల కల్పన అనివార్యమై ఉండేది. అలా కాకుండా ప్రయివేటు ఆస్పత్రులకు జిహెచ్‌ఎంసితో సహా 16 జిల్లాల్లో 199 ఆస్పత్రుల్లో 10,443 పడకలకు అనుమతించగా 4208 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వీటిని రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నారు. ఒకవైపు ప్రభుత్వాస్పత్రుల్లో రోగులను ఆకర్షించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాల్సిన సర్కారు అందుకు విరుద్ధంగా ప్రయివేటుకు అనుమతులిచ్చేందుకే పరిమితమవుతున్నది. ఈ తరహా విధానాల కారణంగానే పేద ప్రజలు ఇంటిపట్టున, స్థోమత కలిగిన వారు ప్రయివేటుకు వెళ్లేలా చేసిందని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నారు. ప్రయివేటు అనుమతలపై ఉన్న శ్రద్ధ తగ్గించి ప్రజారోగ్య వ్యవస్థను బలపరచడంపై పెట్టాలని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories