logo
తెలంగాణ

తెలంగాణలో పేదలకు సొంత జాగాలో ఇళ్ల నిర్మాణం

Construction of Houses on Own Land for the Poor in Telangana
X

తెలంగాణలో పేదలకు సొంత జాగాలో ఇళ్ల నిర్మాణం

Highlights

*రూ.3 లక్షల సాయంపై కసరత్తు ముమ్మరం

Telangana: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు స్థలం ఉన్న వారికి మూడు లక్షల ఆర్థిక సాయం చేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. ఇందులో భాగంగా వచ్చే సెప్టెంబర్ నుంచి ఈ స్కీమ్‌ను లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అర్బన్ రూరల్ ప్రాంతాల్లో ఎలా అమలు చేయనున్నారు? ఎన్ని విడతల్లో ఇవ్వాలనే దానిపై ఫోకస్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్‌ను ఇస్తోంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల ఇళ్లను ఈ అక్టోబర్ నాటికి అందించేందుకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఇదిలా ఉంటే సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునే వారికి 3 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించే పథకంపై సర్కారు కసరత్తును ముమ్మరం చేసింది. వచ్చే సెప్టెంబర్ నుంచి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై దృష్టి సారించింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

సొంత ఇల్లు నిర్మించుకునే వారికి 3 లక్షల రూపాయల మొత్తాన్ని నాలుగు విడతల్లో ఇవ్వాలని నిర్ణయించారు. ఇల్లును నిర్మించుకునే వారి సొంత ఇంటి స్థలం గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 75 గజాలు పట్టణ, నగర ప్రాంతాల్లో కనీసం 50 గజాలు ఉండాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం కాగానే సీఎం కేసీఆర్ ఆమోదం తీసుకుంటారని సమాచారం. 3 లక్షల సాయాన్ని ఇంటి నిర్మాణంలో బేస్మెంట్, గోడలు, శ్లాబ్, ఫినిషింగ్ నాలుగు దశల్లో 75 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొన్న బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి ఆర్థిక సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.

ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నియోజకవర్గానికి మూడు వేల మందికి ఈ సాయం అందించనుంది. గతంలో ఇల్లు పొందిన వారు అనర్హులని గృహనిర్మాణశాఖ పేర్కొంది. తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ సహకారంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ, తర్వాత పరిశీలనలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వార్డు సభలు, నగరాల్లో డివిజన్ సభలు పెట్టాలని భావిస్తున్నారు. ఎంపిక ప్రక్రియలో వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేటర్లనూ నియమించే అవకాశాలున్నాయి.


Web TitleConstruction of Houses on Own Land for the Poor in Telangana
Next Story