పతనం దిశగా పరుగులు తీస్తున్న కాంగ్రెస్‌.. గ్రేటర్‌లో గతంలోనూ రెండే..ఇప్పుడూ రెండే!

పతనం దిశగా పరుగులు తీస్తున్న కాంగ్రెస్‌.. గ్రేటర్‌లో గతంలోనూ రెండే..ఇప్పుడూ రెండే!
x
Highlights

ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీ.. రాష్ట్రంలో దిక్కులేని దివాణంగా మారింది. డజన్ల కొద్దీ నాయకులు. నడిపించే నాధుడు లేడు. ఎవరి మాట ఎవరూ వినరు.

ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీ.. రాష్ట్రంలో దిక్కులేని దివాణంగా మారింది. డజన్ల కొద్దీ నాయకులు. నడిపించే నాధుడు లేడు. ఎవరి మాట ఎవరూ వినరు. తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా పేరున్నా..ప్రజలు మెచ్చని పార్టీగా మారింది. అనేక రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో కూడా కనుమరుగయ్యేందుకు రెడీ అవుతోంది.

130 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయిలోనే కుక్కలు చింపిన విస్తరిలా మారుతోంది. అదే పరిస్థితి తెలంగాణలో కూడా ఏర్పడింది. రాష్ట్రంలో పతనం దిశగా వేగంగా పరుగులు తీస్తోంది. అన్నీ ఓటములే. పదవులు లేకపోతే ఉండలేని నాయకులు.... టీఆర్‌ఎస్‌లోకో...బీజేపీలోకో దూకేస్తున్నారు. మిగిలిన నాయకులు అష్టకష్టాలు పడుతూ సాగుతున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో డిపాజిట్లు కూడా రాని పరాభవం నుంచి తేరుకోకముందే..గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు మరో అవమానాన్ని మిగిల్చాయి. కాంగ్రెస్‌ ఓట్‌ బ్యాంక్‌ వేగంగా కనుమరుగవుతోంది.

రెండేళ్ళుగా పీసీసీ చీఫ్‌ను మారుస్తారంటూ ప్రచారం సాగుతోంది. ఢిల్లీలోనే సరైన నాయకత్వం లేక నానా అవస్థలు పడుతున్న కాంగ్రెస్‌...రాష్ట్రాలను పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ప్రత్యేక తెలంగాణను ఇచ్చినా కూడా దాన్ని అనుకూలంగా మలుచుకోలేకపోయిన అసమర్థత కాంగ్రెస్‍‌ నాయకత్వంలో స్పష్టంగా కనిపించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడిన తొలి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ..కేసీఆర్‌ తన చాణక్యంతో కాంగ్రెస్‌ను నిండా ముంచేశారు. రెండోసారి జరిగిన ఎన్నికల్లో కూడా అదే పునరావృతమైంది. ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. అధికారం లేకపోవడంతో నాయకులంతా చెల్లాచెదురవుతున్నారు. అధికార పదవుల కోసం...వ్యాపారాలు..ఆస్తులు కాపాడుకోవడం కోసం కాంగ్రెస్‌ను వదిలేస్తున్నారు.

డజన్ల కొద్దీ నాయకులున్నా...వారిలో సఖ్యత ఉండదు..ప్రతి ఒక్కరికీ పీసీసీ పీఠం కావాలి. ఒకరికిద్దామంటే..మరొకరు అడ్డుపుల్లలు వేస్తుంటారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌రెడ్డి పార్టీలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. తాను పీసీసీ పీఠం ఆశిస్తున్నారు. కాని పార్టీలో పాతుకుపోయిన నాయకులు రేవంత్‌కు ఇవ్వడానికి వీల్లేదంటూ అడ్డుపడుతున్నారు. ఈ ముఠాలతో వేగలేక రెండేళ్ళుగా కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఈ విషయాన్ని పట్టించుకోవడం మానేసింది. అటు నాయకులు సరిగాలేక...పట్టించుకునే దిక్కులేక కేడర్‌ అంతా ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోతున్నారు. దీంతో పార్టీ పునాదులు కదిలిపోయాయి. అందుకే ప్రతి ఎన్నికలోనూ ఓటమి ఎదురవుతోంది.

పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ సీటు హుజూర్‌ నగర్‌లో మొదలైన ఈ టర్మ్‌ ఓటమి..దుబ్బాక మీదుగా గ్రేటర్‌ హైదరాబాద్‌ చేరుకుంది. గ్రేటర్‌లో గతంలో రెండు సీట్లే దక్కాయి. ఈసారి కూడా మళ్ళీ రెండు సీట్లే వచ్చాయి. అవి కూడా రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్‌గిరి పరిధిలోనివే. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అంటూ కొద్ది కాలంగా బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్‌ వ్యవహరిస్తోంది..ఫలితాలు కూడా అలాగే వస్తున్నాయి. గ్రేటర్‌ ఎన్నికలు దీన్ని మరింత స్పష్టంగా నిరూపించాయి. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వంటి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సైతం బీజేపీనే గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయం అని స్వయంగా ప్రకటిస్తున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ మరింత దివాళా తీస్తుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి

Show Full Article
Print Article
Next Story
More Stories