Congress: ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ

Congress Meeting At Tukkuguda On 6th April
x

Congress: ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ

Highlights

Congress: సభకు హాజరుకానున్న మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ

Congress: లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. తుక్కుగూడ వేదికగా సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం పూరించనుంది కాంగ్రెస్. ఏప్రిల్ 6న జరిగే ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవనున్నారు. ఈ సభలోనే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే.

ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఇటీవల జరిగిన కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్యారెంటీ స్కీమ్‌ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. 25 అంశాలతో గ్యారెంటీ స్కీమ్‌‌లను తమ మేనిఫెస్టోగా రూపొందించింది. ‘పాంచ్‌ న్యాయ్‌’ అంటూ మేనిఫెస్టోకు నామకరణం చేసింది. రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా.. ‘హిస్సేదారి న్యాయ్‌’, ’కిసాన్‌ న్యాయ్‌’, ’నారీ న్యాయ్‌’, ’శ్రామిక్‌ న్యాయ్‌’,’యువ న్యాయ్‌’ పేరిట హామీలను ప్రకటించింది కాంగ్రెస్. ఈ హామీలను తుక్కుగూడ సభావేదిక ద్వారా తెలుగులో ప్రకటించనున్నారు ఖర్గే.

హిస్సేదారి న్యాయ్ కింద సామాజిక, ఆర్థిక అంశాలతో పాటు కులాల ఆధారంగా జనగణన... రాజ్యాంగ సవరణ ఆధారంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ప్రస్తుతమున్న 50 శాతం గరిష్ట పరిమితి తొలగింపు..ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్ లాంటి హామీలను ప్రకటించింది కాంగ్రెస్. ఇక కిసాన్ న్యాయ్ స్కీమ్ కింద స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత... రుణమాఫీ కమిషన్ ఏర్పాటు... పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు లాంటి హామీలు చేర్చింది.

శ్రామిక్ న్యాయ్‌ గ్యారెంటీ స్కీమ్‌లో రైట్ టు హెల్త్ చట్టం చేయడం.. రోజుకు 400 రూపాయల కనీస వేతనం.. అసంఘటిత రంగ కార్మికులకు జీవిత, ప్రమాద బీమాలను అందిస్తామని తెలిపింది. ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాల నిలిపేస్తామని ప్రకటించింది. యువ న్యాయ్ కింద లక్షా 30వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపింది. యువతకు ఏడాది అప్రెంటిస్‌షిప్ కల్పించి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించింది. స్టార్టప్‌ల కోసం ఐదు వేల కోట్లు కేటాయింపు లాంటి పథకాలు చేర్చింది. నారీ న్యాయ్‌ పథకాన్ని ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్‌.. ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సాయం... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు... ఆశ, అంగన్వాడి, మిడ్ డే మీల్ వర్కర్లకు జీతంలో కేంద్రం వాటా రెట్టింపు... వర్కింగ్ విమెన్ కోసం సావిత్రిబాయి పూలే పేరుతో హాస్టళ్ల పెంపు లాంటి స్కీమ్‌లను చేర్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories