తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోంది : మాణికం ఠాగూర్

తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోంది : మాణికం ఠాగూర్
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలోని గంజిమైదాన్లో శుక్రవారం నిర్వహించిన కిసాన్,...

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలోని గంజిమైదాన్లో శుక్రవారం నిర్వహించిన కిసాన్, మజ్దూర్ బచావో దివస్ కార్యక్రమానికి మణికం ఠాగూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమీషన్లతో దేశంలోనే అతిపెద్ద ధనవంతులలో ఒకరిగా కేసీఆర్ మారారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని, దానికి చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల పేరు చెప్పి లక్షల కోట్లు కమీషన్లు కొట్టేస్తున్నారని, వెయ్యి, రెండువేల రూపాయలతో ఓట్లు కొంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ అంబానీని మించిపోయేలా ఆస్తులను కూడబెడుతున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీకి బి టీంగా పనిచేస్తోందని ఆయన అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలు అదానీ, అంబానీలకు వ్యవసాయాన్ని కూడా తాకట్టు పెట్టేలా ఉందని విమర్శించారు. 2023లో కాంగ్రెస్ను అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు బలంగా కృషి చేయాలని ఆయన కోరారు.

అనంతరం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థిని మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ పోయిందని నిలదీశారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఎక్కడ అని, మైనార్టీలకు12శాతం రిజర్వేషన్ మాట మరిచిపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. పేదలకు ఇళ్లు లేవు కానీ ప్రగతి భవన్లో ఆయన టాయిలెట్ డబుల్ బెడ్రూంలను మించి ఉంటుందని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కొత్త చట్టాల ద్వారా నిత్యావసర వస్తువులు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లి ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. వ్యవసాయ బిల్లుల రద్దుకు ఒత్తిడికి దేశవ్యాప్తంగా 2 కోట్ల సంతకాలను సేకరించి రాష్ట్రపతికి అందజేస్తామని తెలిపారు. సోనియాగాంధీ అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో తెలంగాణను ఇచ్చారని, దాన్ని కేసీఆర్ కుటుంబం అధోగతి పాలు చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories