మేడ్చల్‌లో తాజా, మాజీల రచ్చేంటి?

మేడ్చల్‌లో తాజా, మాజీల రచ్చేంటి?
x
Highlights

రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు, ఒకప్పటి మిత్రులు నేడు శత్రువులు, నాటి శత్రువు నేడు మిత్రుడు అన్నట్టుగా సాగుతుంటాయి. ఇప్పుడు తెలంగాణలో కీలకమైన ఓ...

రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు, ఒకప్పటి మిత్రులు నేడు శత్రువులు, నాటి శత్రువు నేడు మిత్రుడు అన్నట్టుగా సాగుతుంటాయి. ఇప్పుడు తెలంగాణలో కీలకమైన ఓ నియోజకవర్గంలో ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేల మద్య వైరం తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే ఎన్నికల నుంచి మొదలైన వీరి యుద్దం, పార్లమెంట్‌లో మరింత ముదిరి, పరిషత్ ఎన్నికల్లో పాకాన పడింది. దీంతో ఒక వర్గంపై మరోవర్గం కేసులు పెట్టుకునే వరకు వెల్లింది. హైదరాబాద్‌లో ఆ కీలక సెగ్మెంట్‌ ఏది గులాబీ పార్టీ నేతలు ఎందుకంత రచ్చ చేసుకుంటున్నారు?

రంగారెడ్డి జిల్లాలో కీలకమైన మేడ్చల్‌ నియోజకవర్గం టీఆర్ఎస్‌లో, నేతల మధ్య కోల్డ్‌వార్‌ రచ్చరచ్చ అవుతోంది. అయితే ఈసారది మరింత ముదిరింది. మాజీ ఎమ్మెల్యే, తాజా ఎమ్మెల్యే మధ్య విభేదాలు, ఏకంగా గులాబీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి.

నియోజకవర్గంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మొన్నటి దాకా ఎంపీగా ఉన్న చామకూర మల్లారెడ్డికి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు చేరాయి. ఆర్నెళ్ల ముందు వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో, అనూహ్యంగా తెరపైకి వచ్చిన మల్లారెడ్డి, సుధీర్ రెడ్డికి చెక్ పెట్టి టికెట్టు దక్కించుకోవడం కోల్డ్‌వార్ స్టార్టయ్యింది. ఈ పరిణామంతో సుధీర్ రెడ్డి కంగుతిన్నారు. తన సీటుకే ఎసరుతెచ్చాడని సన్నిహితుల దగ్గర మల్లారెడ్డిపై రగిలిపోయారు. అప్పుడు పార్టీ అధిష్టానం మాట ప్రకారం చెప్పినట్టు వింటానన్న సుధీర్ రెడ్డికి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పదవిచ్చారు. ఆ తర్వాత ఎంపీగానో ఎమ్మెల్సీగానో అవకాశం వస్తుందని భావించినా అదీ దక్కలేదు. దీన్ని కూడా మల్లారెడ్డే అడ్డుకున్నాడన్నది సుధీర్‌ రెడ్డి ఫీలింగ్.

అప్పటి నుంచి కొనసాగుతున్న వర్గ విభేదాలు ఇప్పుడు పరిషత్ ఎన్నికలవేళ తారాస్థాయికి చేరాయి. జిల్లా పరిషత్, మండల పరిషత్‌ ఎన్నికల్లో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే పట్టుదలతో, వ్యూహ ప్రతివ్యూహాలు వేశాయి. ఇదికాస్త మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మధ్య నువ్వా నేనా అనే స్థాయికి చేరింది. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సుధీర్‌రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మంత్రి మల్లారెడ్డి అనుచరుడు, ఘట్కేసర్‌ ఎంపీపీగా ఇటీవల ఎన్నికైన సుదర్శన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది.

మల్కాజ్‌గిరి లోక్‌సభ ఎన్నికల్లో తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఓటమికి సుధీర్ రెడ్డి వర్గమే కారణమన్న వాదనతో ఇద్దరు నాయకుల మధ్య మళ్లీ మొదలైన ప్రత్యక్ష యుద్ధం, మండల పరిషత్‌ ఎన్నికల వివాదంతో పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కింది. ఘట్‌కేసర్‌ మండల పరిషత్‌ అధ్యక్ష పదవికి తాను సూచించిన వ్యక్తిని కాదని, ఇతర పార్టీల ఎంపీటీసీలతో కలిసి మంత్రి మల్లారెడ్డి తన వర్గీయుడైన సుదర్శన్‌రెడ్డికి పదవి కట్టబెట్టడాన్ని సుధీర్‌రెడ్డి తీవ్రంగా తప్పుపడుతున్నారు. తన సొంత మండలంలో పార్టీని నిలువునా చీల్చే ప్రయత్నాలు మొదలుపెట్టారని ఆరోపిస్తూ, మంత్రిని ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొంటానని సవాల్ విసురుతున్నారు. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో పూర్తి పట్టు కోసం మంత్రి మల్లారెడ్డి, మరోవైపు, తన ఆధిపత్యం చేజారకూడదన్న లక్ష్యంతో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేసే పనిలో ఉండడంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

మేడ్చల్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా తన కుమారుడు శరత్‌ చంద్రారెడ్డిని అడ్డుకునేందుకే మంత్రి తన బంధువు శ్రీనివాసరెడ్డిని చింతలపల్లిలో పోటీ చేయించారని సుధీర్‌రెడ్డి వర్గం అంటోంది. మరోవైపు మంత్రి మల్లారెడ్డి ప్రోద్బలంతోనే తన సొంత మండలమైన ఘట్కేసర్‌లో తనను కాదని, తన వ్యతిరేకి సుదర్శన్‌రెడ్డిని ఇతర పార్టీలతో కలిసి ఎంపీపీ చేశాడని సుధీర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆపై తనను రాజకీయంగా ఎదుర్కోలేక తనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని, తాను ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని సుధీర్‌రెడ్డి తన అనుచరులతో అంటున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మేడ్చల్‌ అసెంబ్లీ టికెట్‌ నుంచి మొదలైన సుధీర్‌ రెడ్డి, మల్లారెడ్డి మధ్య గొడవ పార్లమెంట్‌ పోరులో మరింత ముదిరి పరిషత్ సమరం దాకా సాగింది. రానున్నకాలంలో వీరిమధ్య గొడవ ఇంకెన్ని మలుపు తిరుగుతుందోనని, పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గులాబీ అధిష్టానం ఇరువురు నేతలపై దృష్టిపెట్టిందని, పార్టీ వర్గాలంటున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories