Revanth Reddy: ఇకపై ప్రతిరోజూ సచివాలయానికి సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy to the secretariat every day from Now onwards
x

Revanth Reddy: ఇకపై ప్రతిరోజూ సచివాలయానికి సీఎం రేవంత్‌రెడ్డి

Highlights

Revanth Reddy: వంద ఏళ్ళకు అవసరమైన ప్రణాళిక ఏర్పాటు చేస్తా

CM Revanth Reddy: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో పాలకులు తమ తమ విధులకు తిరిగి వెళుతున్నారు. గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారం, పోలింగ్‌ నిర్వహణలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇక పాలనపై దృష్టి పెడుతానని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు అయిన కొద్ది రోజుల్లోనే లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఇచ్చిన హామీల అమలుకు సమయం సరిపోలేదు.. సంక్షేమ పథకాల అమలుతోపాటు రేవంత్‌రెడ్డి కోసం చాలా సవాళ్ళు ఎదురు చూస్తున్నాయి.. వాటిని ఎలా ఎదుర్కొంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్నది.

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ఇక పరిపాలన పైనే దృష్టి పెడతానని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో పలు జనరంజకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు రేవంత్‌ రెడ్డి. సీఎం అయిన కొద్ది రోజుల్లోనే లోక్‌సభ ఎన్నికలు ముంచుకొచ్చాయి. దీంతో నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి రేవంత్‌ రెడ్డి బిజీ అయిపోయారు. అభ్యర్థుల ఎంపిక నుంచి పోల్‌ మేనేజ్‌మెంట్‌ వరకు రేవంత్‌ కాళ్ళకు బలపం కట్టుకుని రాష్ట్రమంతటా తిరిగారు. సీఎంగా.. పీసీసీ చీఫ్‌గా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం రేవంత్‌రెడ్డికి పెద్ద బాధ్యతగా మారింది. ఒక దశలో లోక్‌సభ ఎన్నికలు తన మూడు నెలల పాలనకు రెఫరెండం అన్న ప్రచారం కూడా జరిగింది.. దీంతో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం రేవంత్‌రెడ్డికి అన్నింటికంటే ప్రాధాన్యమైన అంశంగా మారింది. దీంతో నెలరోజుల పాటు రాష్ట్రంలో పాలనపై పెద్దగా దృష్టి పెట్టలేకపోయారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కోసం రాష్ట్రంలో పలు సమస్యలు ఎదురు చూస్తున్నాయి. ధాన్యం కొనుగోలు, రుణమాఫీ, ఉద్యోగ నియామకాలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌లు, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, మహిళలకు నగదు పంపిణీతో పాటు రాష్ట్రంలో రోజురోజుకూ తీవ్రమవుతున్న నీటి ఎద్దడి, దీనితో ఉత్పన్నమైన విద్యుత్‌ సమస్య, సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ విధానం.. ఇలా ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీల అమలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు లబ్దిదారులు. అయితే సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల హామీలో అతి ముఖ్యమైనవి రైతు రుణమాఫీ.. రైతుబంధు.. ఈ రెండు పథకాల్లో రైతుబంధు నగదు బదిలీ అయినప్పటికీ రుణమాఫీ కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నారు. రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న రేవంత్‌ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చేసింది. రాబోయే సీజన్‌లో రైతులు మళ్ళీ పంట రుణాలకు వెళ్లాల్సి ఉంటుంది.. ఆలోగా రుణమాఫీ జరిగాలి.. అంటే దీనికోసం పెద్దమొత్తంలో నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అయితే రైతు రుణమాఫీ కోసం FRBM పరిధిలో లోన్ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించనున్నట్లు మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి వెల్లడించారు.

గత కొన్నేళ్ళుగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గాడి తప్పింది.. సర్కారు స్కూళ్ళు సక్రమంగానే నడుస్తున్నప్పటికీ ప్రైవేటు విద్యా సంస్థలపై ప్రభుత్వ ఆజమాయిషీ కొరవడిందన్న టాక్‌ ఉంది. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల రూపంలో ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నారని పేరెంట్స్‌ లబోదిబోమంటున్నారు. ఇంకా ఉన్నత విద్య కోసం విద్యార్థుల ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ కూడా చాలా కాంగా ఆగిపోయింది. దీంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావాల్సిన దుస్థితి ఏర్పడింది. మరో నెల రోజుల్లో వేసవి సెలవులు ముగిసి.. విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.. దీంతో విద్యా వ్యవస్థపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సిన అసరం వచ్చింది.. వీటికి తోడు కొన్ని యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామకం చేపట్టాల్సి ఉంది.. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే కొత్త వీసీల నియామకం చేపట్టనున్నట్లు సీఎం తెలపడం హర్షణీయం.

విద్య, వైద్యంతో పాటు సీఎం ఎదుట ఉన్న సమస్యల్లో వ్యవసాయం కీలకంగా మారింది. స్టేట్ కు ఏం కావాలో వాటిని లిస్ట్ చేసుకొని రైతుల నుంచి వచ్చేలా చూస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు.. అంటే సామాన్యులు కొనుగోలు చేసే 9 వస్తువులు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని.. వాటిని రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నట్లు సీఎం ఆలోచన. ఇంకా రేషన్ షాప్ లలో సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇది కొంత కొత్త ఆలోచనగా ఉన్నా ఆచరణలో పెడితే మాత్రం అన్ని విధాలా ఉత్తమ ఆలోచనే అవుతుందిం. రైతుల నుంచి కొనుగోలు చేయడం ద్వారా అన్నదాతలకు గిట్టుబాటు ధర లభిస్తుంది.. అదే సమయంలో ప్రజలకు సరసమైన ధరలకు, నాణ్యమైన వస్తువులను సరఫరా చేసినట్లు అవుతుంది.. అయితే ఈ సమస్యఎలా పరిష్కరిస్తారన్నది ప్రభుత్వం ముందు ఉన్న పెద్ద సవాలే.. ఇంకా రైతుల దగ్గర తడిసిన ధాన్యం విషయం లో వెంటనే చర్యలు తీసుకోనున్నట్లు సీఎం తెలిపారు.. ఇక నుంచి ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయని. గోదావరి జలాలను హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ కు రెగ్యులర్ గా వచ్చేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పడం నగర వాసులకు చల్లని కబురు చెప్పినట్లు అయ్యింది...

రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో విద్యుత్‌ సమస్య అతి తీవ్రమైనది. రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం పెరిగిపోవడం, పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయడం.. విద్యుత్‌ సరఫరా చేస్తున్న సంస్థలు యూనిట్‌ రేటు పెంచేయడంతో ప్రభుత్వానికి విద్యుత్‌ సరఫరా అనేది పెద్ద గుదిబండగా మారింది. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తూనే మిగతా అవసరాలకు కొరత లేకుండా చూసుకోవడం.. విద్యుత్‌ కోతలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలను తిప్పికొట్టాలంటే విద్యుత్‌ విధానంపై కూడా సీఎం రేవంత్‌ రెడ్డి విస్తృతంగానే ఆలోచన చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యల విషయంలో కావాలనే కొందరు అధికారులు తప్పుడు విధానాలు అవలంభిస్తున్నారని.. అందుకే విద్యుత్‌ సమస్య తలెత్తిందని ముఖ్యమంత్రే విమర్శలు గుప్పించడం చూస్తుంటే.. రేవంత్‌ రెడ్డి విద్యుత్‌ సమస్యను సీరియస్‌గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది.

వంద సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళిక అందించడమే నా లక్ష్యమన్న సీఎం.. మండలాలు, రెవిన్యూ డివిజన్ లను క్రమబద్దీకరణ చేయడంతో పాటు జిల్లాల ఏర్పాటు ఉంటుందన్నారు. అయితే ఇప్పటికే కొత్త జిల్లాలు ఏర్పడి, ఇప్పుడిప్పుడే అంతా సెటిల్‌ అవుతుందనుకుంటున్న సమయంలో మళ్ళీ జిల్లాల విభజన చేయడం చాలా మందిని ఆందోళనకు గురి చేస్తుంది.. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు సొంత జిల్లాల్లో స్థానికేతరులుగా మారడం జరిగింది. మళ్ళీ కొత్త జిల్లాల ఏర్పాటు ఎటు పోయి ఎటు దారి తీస్తుందోనన్న ఆందోళన తలెత్తుతుంది. సీఎం ఎదుట ఉన్న మరో అతి ముఖ్యమైన సమస్య పేదవాడికి సొంతింటి కల.. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ కల అందని ద్రాక్షలాగే మారింది. గత ప్రభుత్వంలో ఎన్నికల ముందు కొంత మందికి డబుల్‌ బెడ్‌రూమ్‌లు కేటాయించారు.. అయినా వాటి తాళం చెవులు లబ్దిదారులకు ఇవ్వలేదు.. మరికొంత మంది పేర్లను లక్కీ డిప్‌లో తీశామని, ఎన్నికలు అయిన తర్వాత గృహప్రవేశం చేసుకోవచ్చని చెప్పారు. ఇంకొంత మంది దగ్గర దరఖాస్తులు తీసుకుని వారిని ఆశలపల్లకిలో ఊరేగించారు. ఇప్పుడు ఎన్నికలు ముగిసి.. ముఖ్యమంత్రి కార్యోన్ముఖుడు కావడంతో ప్రతి పల్లెలో డబుల్‌బెడ్‌రూమ్‌ లబ్దిదారులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

కొత్త ముఖ్యమంత్రి ఎదుట ఉన్న మరో సమస్య సాగునీటి ప్రాజెక్టులు. సీఎం సొంత జిల్లా అయిన పాలమూరు జిల్లా కొన్ని దశాబ్దాలుగా సాగునీరు లేక అల్లాడింది. అలాంటిది సొంత జిల్లా బిడ్డే ముఖ్యమంత్రి అయితే జిల్లా వాసుల ఆశలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దీనికి తగ్గట్టుగానే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంతో పాటు పాలమూరు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి తెలపడం రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ధరణి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ధరణి కమిటీతో చర్చలు జరిపి సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.. ఇన్ని సమస్యలను రేవంత్‌ రెడ్డి ఎలా తీర్చనున్నారు.. ఇందులో ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుర్కొంటారోనని రాస్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎన్నికలు ముగియడంతో ఇకపై ప్రతిరోజు సచివాలయానికి వచ్చి పరిపాలనపై దృష్టి పెడతానని ముఖ్యమంత్రి చెప్పడం సంతోషం.. అదే విధంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చ నిర్వహిస్తామని.. లేదంటే అఖిల పక్షంలో చర్చిస్తామని.. ఏకపక్ష నిర్ణయాలు అసలే ఉండవని సీఎం చెప్పడం కొసమెరుపు.

Show Full Article
Print Article
Next Story
More Stories