CM Revanth Reddy: దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన..!!

CM Revanth Reddy: దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన..!!
x
Highlights

CM Revanth Reddy: దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన..!!

CM Revanth Reddy Davos Visit: తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో ఈసారి కూడా ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

దావోస్ సదస్సు వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, మల్టీనేషనల్ కంపెనీల అధినేతలు, గ్లోబల్ ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, నూతన విధానాలను ఈ సందర్భంగా ఆయన వివరించనున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్, ఫార్మా, డేటా సెంటర్లు వంటి రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరగనున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

దావోస్ పర్యటన అనంతరం అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశమూ ఉన్నట్లు సమాచారం. అయితే ఆ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఒకవేళ అమెరికా టూర్ ఫిక్స్ అయితే, సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 1న హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అమెరికా పర్యటనలో కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు, ఇండియన్-అమెరికన్ వ్యాపారవేత్తలతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణపై ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈ విదేశీ పర్యటనలు రాష్ట్రానికి కీలకంగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, గతంలో జరిగిన దావోస్ పర్యటనల ద్వారా తెలంగాణకు గణనీయమైన పెట్టుబడి ఒప్పందాలు కుదిరిన నేపథ్యం ఉంది. అదే తరహాలో ఈసారి కూడా రాష్ట్రానికి మేలు చేసే ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories