CM KCR: ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR Visit to the Khammam District Today
x

CM KCR: ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

Highlights

CM KCR: సత్తుపల్లి, ఇల్లందులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వార సభలు

CM KCR: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్ ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో జరిగే బహిరంగసభలకు హాజరుకానున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాదసభల్లో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. మొదటిగా సత్తుపల్లి నియోజకవర్గంలో.. అనంతరం ఇల్లందులో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు.

మూడోసారి అధికారమే లక్ష్యంగా గులాబీదళం రాష్ట్రంలో ప్రచారాలతో హోరెత్తిస్తోంది. ఓ వైపు అభ్యర్థులు, రాష్ట్ర స్థాయి నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా..అటు అధినేత రోజుకు రెండు మూడు బహిరంగ సభలకు హాజరవుతూ..పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరుతున్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. సత్తుపల్లి, ఇల్లందులో బీఆర్​ఎస్​ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలకు గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం కేసీఆర్ కల్లూరుకు చేరుకుంటారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఈ సభ కోసం దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. సభకు భారీ జనసమీకరణ ద్వారా సత్తాచాటేలా ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. సభాప్రాంగాణాల్లో కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేశారు. 2018 ఎన్నికల్లో ప్రచారసభ అనంతరం మరోసారి ఎన్నికల సభకు కేసీఆర్‌ హాజరవుతుండటంతో నియోజకవర్గానికి ప్రకటించబోయే హామీల పట్ల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సత్తుపల్లి బహిరంగసభ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్‌లో ఇల్లెందుకు చేరుకుంటారు. ఈ సభకు బీఆర్​ఎస్​ అభ్యర్థి ఎమ్మెల్యే హరిప్రియ, బీఆర్​ఎస్​ నియోజకవర్గ ఇంఛార్జి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఇల్లెందు మండలం సుదిమళ్ల స్టేజీ సమీపంలోని బొజ్జాయిగూడెం వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. 20 ఎకరాల్లో బహిరంగసభకు ఏర్పాట్లు చేయగా.. ఇల్లెందు, టేకులపల్లి, కామేపల్లి, గార్ల, బయ్యారం మండలాల నుంచి భారీగా కార్యకర్తలను తరలించేలా ఏర్పాటు చేశారు.

సీఎం కేసీఆర్ పాల్గొనే 2 బహిరంగసభలకు పోలీసుశాఖ భారీబందోబస్తు ఏర్పాటు చేసింది. కల్లూరు సభ ప్రాంగణాన్ని ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణువారియార్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలు చేయాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇల్లెందు సభా ప్రాంగణాన్ని భద్రాద్రి జిల్లా ఎస్పీ పరిశీలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories