ఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ

CM KCR to Announce Munugodu MLA Candidate
x

ఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ

Highlights

Munugodu: వెయ్యి కార్ల కాన్వాయ్‌తో మునుగోడుకు కేసీఆర్

Munugodu: తెలంగాణ రాజకీయం అంతా మునుగోడు చుట్టే తిరుగుతోంది. మునుగోడులో తమ పార్టీయే మొనగాడు అనిపించుకోవటానికి అటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్‎తోపాటు మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక రావటానికి కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరనున్న క్రమంలో కాంగ్రెస్‌కు కూడా మునుగోడు ప్రతిష్టాత్మకంగా మారింది. అలాగే.. తెలంగాణలో పట్టు నిలుపుకోవటానికి బీజేపీ పావులు కదుపుతున్న క్రమంలో బీజేపీకి కూడా మునుగోడులో గెలుపు తప్పనిసరిగా ఉంది. దీంతో మూడు పార్టీలు పోటా పోటీగా బహిరంగ సభలు నిర్వహించి సత్తా చాటాలనుకుంటున్నాయి.

ఇందులో భాగంగా మునుగోడులో నేడు టీఆర్ఎస్‌ ప్రజా దీవెన సభ నిర్వహించనుండగా.. వెనక్కి తగ్గకుండా మునుగోడు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రేవంత్ రెడ్డి ఇవాళ పాదయాత్ర నిర్వ‎హించనున్నారు. ఇక రేపు బీజేపీ కూడా మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా, ఈ సభకు అమిత్‌ షా రానున్నారు.

మునుగోడులో టీఆర్ఎస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌ నుంచి మునుగోడుకు రోడ్డు మార్గంలో బయల్దేరుతారు. ప్రగతి భవన్‌ నుంచి ఉప్పల్, ఎల్బీనగర్, పెద్ద అంబర్‌ పేట్‌, పోచంపల్లి క్రాస్‌ రోడ్స్‌, చౌటుప్పల్, నారాయణ్ పూర్, చల్మెడ మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు మునుగోడుకు చేరుకుని.. ప్రజా దీవెన సభలో ప్రసంగిస్తారు. ఇక మునుగోడు సభ నేపథ్యంలో టీఆర్ఎస్ భారీ కాన్వాయితో ర్యాలీకి ప్లాన్ చేసింది. దాదాపు వెయ్యి కార్ల కాన్వాయ్‌తో మునుగోడుకు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సభ నేపథ్యంలో మునుగోడులో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

మునుగోడులో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతారు..? ఎవరిని టార్గెట్ చేస్తారు..? ఎలాంటి కొత్త రాజకీయ అస్త్రాలు సంధిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ బీజేపీకి చెక్ పెట్టాలనే ఆలోచనతో ఉన్న కేసీఆర్.. ఇందుకోసం తనదైన వ్యూహాలను సిద్ధం చేసుకున్నారని టీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. మునుగోడులో టీఆర్ఎస్ తరపున పోటే చేసే అవకాశం ఎవరికి దక్కుతుందనే దానిపై చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలో ఉండటం ఖాయం కాగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ తరపున ఇక్కడి నుంచి పోటీ చేయ బోయేది ఎవరనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

ఇవాళ్టి స‎భలోనే మునుగోడు నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేయబోయేది ఎవరనే అంశంపై కేసీఆర్ స్పష్టత ఇస్తారని.. సభా వేదికగానే అభ్యర్థి పేరును ప్రకటిస్తారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మునుగోడులోనే అభ్యర్థిని ప్రకటించడం ద్వారా సమరశంఖం పూరించినట్టు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే టీఆర్ఎస్ నాయకత్వం మొగ్గు చూపుతుందనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు మద్దుతు ఇవ్వాలని నిర్ణయించుకుంది సీపీఐ. ఇందులో భాగంగా సీపీఎం నేతలతో సంబంధం లేకుండా కేసీఆర్‌ను కలిసిన చాడ వెంకట్‌రెడ్డి.. మునుగోడులో తాము పోటీచేయమని సీఎంకు చెప్పారు.

ఇక బీజేపీ సభకు పోటీగానే కేసీఆర్ ఒక రోజు ముందుగా మునుగోడులో సభ పెడుతున్నారని.. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. తెలంగాణలో వేలమంది సర్పంచ్‎లు, MPTCలు, ZPTCలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు BJPలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఈటల వెల్లడించారు. రేపటి అమిత్ షా సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ఆదివారం సభా వేదికగా భారీగా చేరికలుంటాయన్నారు ఈటల. మునుగోడును చేజిక్కించుకునేందుకు ఆరోజు నుంచే ప్రణాళికలను అమలు చేస్తామన్నారు. ఇటు అమిత్ షాకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

మునుగోడుపై టీకాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. మన మునుగోడు, మన కాంగ్రెస్ పోస్టర్ ను ఆవిష్కరించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రజల్లో సెంటిమెంట్ ను రగిల్చేలా.. కార్యాచరణ రూపొందించారు. నేడు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఒకే రోజు 5 మండలాల్లో పాదయాత్రకు రేవంత్ ప్లాన్ చేశారు. ఇక అదే సమయంలో నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రలు చేయనున్నారు. అయితే ఇవాళ మునుగోడులో సీఎం కేసీఆర్ సభ ఉండటంతో.. తొలుత పాదయాత్రల విషయంలో ఆలోచనలో పడ్డ టీపీసీసీ.. తర్వాత ఢీ అంటే ఢీ అనే రీతిలో ఉండాలనే.. ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పార్టీ క్యాడర్ ఎంత మంది.. తమతో కలిసివస్తారో తెలిసిపోతుందని నాయకులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మొత్తానికి మునుగోడు ఉపఎన్నిక చాలా ‎హాట్‌ హాట్‌గా సాగేలా ఉంది. ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికలు ఒక ఎత్తు అయితే మునుగోడు ఉపఎన్నిక ఒక ఎత్తు కానుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మునుగోడు ఉపఎన్నిక జరుగుతుంది కాబట్టి మూడు పార్టీలు తమ తమ బలాబలాలను చాటుకోవటానికి ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. గెలుపు గుర్రాలను బరిలో నిలపటానికి యత్నిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక జరుగుతున్న క్రమంలో అసంతృప్తులను చల్లార్చే పని పెద్ద టాస్క్‌ లాగానే ఉంది మూడు పార్టీలకు కూడా.

ఉపఎన్నికల్లో సత్తా చాటితేనే.. సాధారణ ఎన్నికల్లో కూడా సత్తా చాలగలమని మూడు రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే మూడు ప్రధాన పార్టీలు మునుగోడు ఉపఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ పార్టీ కీలక ఎత్తుగడలు వేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories