CM KCR: నేడు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

CM KCR Meeting at Pragathi Bhavan Today
x

CM KCR: నేడు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

Highlights

CM KCR: మంత్రులు, 33 జిల్లాల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులకూ ఆహ్వానం

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ ప్రకటనకు దాదాపు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.. పార్టీ పేరును కూడా కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ప్రకటన, కొత్త ఆఫీసు ప్రారంభ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ అంశంపై ఇవాళ ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమవుతారు. మంత్రులతోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 33 జిల్లాల అధ్యక్షులనూ ఈ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపారు.

సీఎం కేసీఆర్‌ ఇవాళ ఉదయం గాంధీ ఆస్పత్రి ఎదుట గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ప్రగతిభవన్‌కు చేరుకుంటారు. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఆ తర్వాత సమావేశం ప్రారంభం కానుంది. అయితే సమావేశ ఎజెండా ఏమిటనే దానిపై మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.

జాతీయ పార్టీ ఏర్పాటుపై ఈ నెల 5న దసరా రోజున పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ వేదికగా సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేయనున్నారు. ఆ కొత్త పార్టీ ప్రకటన, ఏర్పాట్లకు సంబంధించి ఇవాళ జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్‌ కీలక సంకేతాలు, సూచనలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన వెంటనే దేశవ్యాప్తంగా కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ ప్రకటనలు వెలువడేలా ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, ప్రాంతాల్లో భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇదే సమయంలో కొత్త జాతీయ పార్టీని స్వాగతిస్తూ పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. కొత్త పార్టీ ప్రకటనకు మరో మూడు రోజులు సమయం ఉన్నందున ఊరూరా సంబురాలు నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై ఇవాళ జరిగే భేటీలో కేసీఆర్‌ దిశానిర్దేశం చేసే అవకాశముంది.

సద్దుల బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో పండుగ వాతావరణాన్ని ఇనుమడించేలా కొత్త పార్టీని స్వాగతిస్తూ సంబురాలు ఉండాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దసరా రోజున పార్టీ ఏర్పాటు ప్రకటన వెలువడిన వెంటనే ఊరూరా ర్యాలీలు, ఊరేగింపులు, ముఖ్య కూడళ్ల అలంకరణ తదితర ఏర్పాట్లు చేయనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లు, సమన్వయం చేసే బాధ్యతను మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులకు అప్పగించనున్నట్టు సమాచారం. ఈ అంశాలన్నింటికీ సంబంధించి నేడు జరిగే భేటీలో సీఎం కేసీఆర్‌ సూచనలు చేయనున్నట్టు తెలిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories