TDP: తెలంగాణ టీడీపీలో 'నయా జోష్' చంద్రబాబుతో కీలక సమావేశం

TDP: తెలంగాణ టీడీపీలో నయా జోష్ చంద్రబాబుతో కీలక సమావేశం
x

TDP: తెలంగాణ టీడీపీలో 'నయా జోష్' చంద్రబాబుతో కీలక సమావేశం

Highlights

సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

సుదీర్ఘ విరామం తరువాత తెలంగాణ తెలుగుదేశం నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ నిర్మాణం, కమిటీల నియామకంపై విస్తృత చర్చ జరిపారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికతో పాటు స్టేట్, పార్లమెంట్, మండల స్థాయి కమిటీల నియామకాలపై నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానికి తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి టీడీపీ నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో నేతలు పార్టీని మళ్లీ గ్రామస్థాయికి తీసుకెళ్లే సమయం వచ్చిందని ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కసరత్తు పూర్తయిన నేపథ్యంలో వచ్చే రెండు మూడు రోజుల్లో 638 మండల, డివిజన్ కమిటీల నియామకం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

కమిటీల నియామకంతో పాటు పార్లమెంట్ స్థాయి నాయకత్వ బృందాల ఏర్పాటుపై కూడా తమ అభిప్రాయాలను తెలిపారు నేతలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు లక్షా 78 వేల మంది సభ్యత్వం పొందినట్టు చంద్రబాబుకు వివరాలు అందించారు. ఈ సభ్యత్వాన్ని సక్రమంగా ఉపయోగించుకుని గ్రామం నుంచి జిల్లా స్థాయివరకు పార్టీ యాక్టివ్‌గా ఉండేలా చర్యలు చేపడతామని అధినేతకు హామీ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షుని నియామకం విషయంలో కూడా నేతలు కీలక సూచనలు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో.. ఆ లోపు సీనియర్ నేతలతో కలిపి తాత్కాలిక రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాలని నేతలు కోరారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ సమర్థవంతమైన నాయకత్వం చూపగల నేతకే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు.

మొత్తానికి పార్టీ సంస్థాగత బలోపేతమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశ్యమని నేతలు చెబుతున్నారు. రాష్ట్ర కమిటీ, మండల స్థాయి కమిటీలతో సమన్వయం పెంచి, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే వ్యూహం రూపొందించినట్టు వెల్లడించారు. తెలంగాణ టీడీపీ పునర్‌వ్యవస్థీకరణ దిశగా జరిగిన ఈ భేటీతో కొత్త ఉత్సాహం మొదలైందనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వస్తుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ టీడీపీ తిరిగి చైతన్యవంతం కావడానికి తొలి అడుగు పడిందనే దీమా కూడా వ్యక్తం అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories