తెలంగాణలో కులాల లెక్కల పంచాయితీ... రేవంత్ రెడ్డి అనుకున్నదేంటి, అవుతున్నదేంటి?


తెలంగాణలో కులాల లెక్కల పంచాయితీ... రేవంత్ రెడ్డి అనుకున్నదేంటి, అవుతున్నదేంటి?
Telangana Caste Census: కుల గణన దేశవ్యాప్తంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ ఫిబ్రవరి 4న తీర్మానం చేసింది.
Telangana Caste Census: కుల గణన దేశవ్యాప్తంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ ఫిబ్రవరి 4న తీర్మానం చేసింది. రాష్ట్రంలో ఏ సామాజిక వర్గానికి చెందినవారు ఎంతమంది ఉన్నారో లెక్కలు తేలాయి. అయితే పదేళ్లతో పోలిస్తే బీసీ జనాభా ఎలా తగ్గిందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. బీసీ జనాభా పెరిగితే తగ్గిందని ఎలా చెబుతారని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ తీర్మానంతో ఏం ఉపయోగమని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ సెల్ఫ్ గోల్ చేసుకుందా? విపక్షాలకు ఆయుధాన్ని ఇచ్చిందా? బీసీల్లో మార్కులు కొట్టేయాలనే ప్లాన్ దెబ్బతిందా?
కులగణన సర్వే ఎలా చేశారంటే?
కుల గణన చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ రంగంలోకి దిగింది. బీసీ జనాభా ఉందో తెలుసుకునేందుకు సర్వే చేయాలని నిర్ణయించారు. ఇందుకు 2024 ఫిబ్రవరి 2న తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే నెల 16న జరిగిన తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. సర్వే నిర్వహణకు సంబంధించి విధి విధానాలపై ఇతర రాష్ట్రాల్లోనూ అధ్యయనం చేశారు. మేధావులు, సామాజికవేత్తలతో చర్చించారు. 75 ప్రశ్నలతో సర్వే నిర్వహించారు. 2024 నవంబర్ 6న సర్వే ప్రారంభించారు. డిసెంబర్ 25తో సర్వే పూర్తి చేశారు.
కుల గణన సర్వేకు సంబంధించి 1,03,889 మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో ఒక కోటి 15 లక్షల కుటుంబాలు ఉంటే, వాటిలో ఒక కోటి 12 లక్షల కుటుంబాలను సర్వే చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అధికారిక సమాచారం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 66,99,602 కుటుంబాలను, పట్టణ ప్రాంతాల్లోని 45,15,532 కుటుంబాలను సర్వే చేశారు. సర్వే బృందం వెళ్లిన సమయంలో అందుబాటులో లేకపోవడమో, కొందరు ఉద్దేశపూర్వకంగా సర్వే బృందానికి సమాచారం ఇవ్వలేదని తెలిపారు.
ఏ కులం జనాభా ఎంత?
కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో జనాభా లెక్కలను ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసింది. రాష్ట్రంలో ఎస్సీల జనాభా 61,84, 319 అని ఈ సర్వే తేల్చింది. అలాగే, రాష్ట్రంలో ఎస్టీలు 37,05,929 మంది ఉన్నట్లు ఈ సర్వే వెల్లడించింది.
ముస్లిం మైనార్టీలు 44,57,012, ముస్లింలలో బీసీల సంఖ్య 35,76,588గా ప్రభుత్వ రిపోర్టు వెల్లడించింది. ఇక ముస్లింలలో ఓసీల జనాభా 8,80,424గా తేలింది. మైనార్టీలలోని ఓసీలను మినహాయిస్తే అగ్రకులాలకు చెందిన జనాభా 47,21,115 గా ఈ సర్వే బయటపెట్టింది. ఇక అసలు బీసీల జనాభా ఎంతో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో బీసీల జనాభా ఒక కొటి 60 లక్షల 9 వేల 179 మంది. ముస్లిం మైనార్టీలలోని బీసీలతో కలిపితే ఈ సంఖ్య 2 కోట్ల 85 వేలు అని ఈ సర్వే తేల్చింది.
బీసీ జనాభా ఎందుకు తగ్గింది?
కుల గణన సర్వే రిపోర్ట్ మేరకు తెలంగాణలో బీసీ జనాభా తగ్గిందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. పదేళ్లకు బీసీల జనాభా పెరగకుండా ఎందుకు తగ్గిందని ప్రశ్నిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 3 కోట్ల 50 లక్షలు. ప్రతి పదేళ్లకు 13.5 శాతం జనాభా పెరుగుతోందని ఒక అంచనా. 2014 నుంచి 2024 నాటికి బీసీ జనాభా 21 లక్షలకు ఎలా తగ్గిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు.
2014లో ఓసీల జనాభా 8 శాతం ఉంటే ఇప్పుడు 15 శాతానికి ఎలా పెరిగిందో తెలపాలన్నారు. రాష్ట్రంలో3.32 కోట్ల మంది ఓటర్లున్నారు.మరో 62 లక్షల మంది 17 ఏళ్లలోపు వయస్సులోపు వారు ఉన్నారు.ఇక ఆరేళ్లలోపు ఉన్నవారిని కలిపితే రాష్ట్ర జనాభా 4,33,29,722 కు చేరుకుందని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయని ఆయన అన్నారు. కానీ, కులగణన సర్వేలో రాష్ట్ర జనాభా 3.54 కోట్లే అని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు.
రేవంత్ సర్కార్ ఏం చెబుతోంది?
కుల గణన సర్వేపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వం మండిపడుతోంది. 2014లో ఓసీల జనాభా 21 శాతం అని ఉంది. కులగణన సర్వేలో 15 శాతం తగ్గిందని తెలంగాణ సీం రేవంత్ రెడ్డి చెప్పారు.ఓసీ జనాభా 21 శాతం పెరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. బీసీల సంఖ్య తగ్గిందని అబద్దాలు ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.2014లో బీసీలు 51శాతం బీసీలుంటే తమ ప్రభుత్వం చేయించిన సర్వేలో 56.33 శాతం ఉన్నారని తేలిందని సీఎం తెలిపారు. అంటే బీసీల జనాభా పెరిగిందా? తగ్గిందా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే అధికారికమా కాదా అనేది చెప్పాలని సీఎం కోరారు.2011 జనాభా లెక్కలు మినహా ఇతర అధికారిక లెక్కలు లేవని ఆయన వివరించారు.
స్థానిక సంస్థలకు రిజర్వేషన్ ఎలా?
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు జనాభా లెక్కలు అవసరం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు బీసీ జనాభా ఎంత ఉందో లెక్కలు సరిచూడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏర్పడింది. 2024 సెప్టెంబర్ 6న నిరంజన్ చైర్మన్ గా నలుగురు సభ్యులతో బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కానీ దీని కోసం డెడికేటేడ్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని 2024 నవంబర్ లో హైకోర్టు ఆదేశించింది.దీంతో రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఎఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు చైర్మన్ గా కమిషన్ ఏర్పాటు చేసింది. సెక్రటరీగా బీసీ గురుకులాల కార్యదర్శి సైదులును నియమిస్తూ2024 నవంబర్ లో జీవో విడుదల చేసింది.
ఈ కమిషన్ 2024 నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్ట్రంలో పర్యటించింది. వివిధ కుల సంఘాలు, మేధావుల నుంచి ఆర్జీలు స్వీకరించింది. మాసబ్ ట్యాంక్ లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించింది. వీటన్నింటిని విశ్లేషించి రిపోర్ట్ తయారు చేస్తున్నారు. గ్రామ పంచాయితీలకు గడువు ముగిసి ఫిబ్రవరి 1కి ఏడాది. ఫిబ్రవరి రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్.
ఈ లోపుగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన కులగణన సర్వే రిపోర్ట్ ఆధారంగా బీసీ డెడికేటేడ్ కమిషన్ రిజర్వేషన్లపై సిఫారసులు చేయనుంది. రాష్ట్రంలో 12,84 గ్రామ పంచాయితీలున్నాయి. ఇందులో 1,3,328 వార్డులున్నాయి. ఆయా పంచాయితీలు, వార్డుల యూనిట్ ఆధారంగా వార్డులు, ఎంపీటీసీ, జడ్ పీ టీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులను బీసీలకు ఎన్ని కేటాయించాలో సిఫారసు చేయనుంది కమిషన్.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించాలంటే ఏం చేయాలి?
దేశ వ్యాప్తంగా కులగణన సర్వే చేయాలని తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానం కేంద్రానికి పంపుతారు. ఈ తీర్మానంపై ఏం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తమ మిత్రపక్షాలు లేదా తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చిన తీర్మానాల విషయాల్లో సానుకూలంగా ఉంటాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కులగణన చేయాలని పంపిన తీర్మానంపై పార్లమెంట్ ఉభయసభల్లో పెట్టి చట్టం చేస్తోందా? అలా చేస్తే రాజకీయంగా ఎన్ డీ ఏకు ఏం ప్రయోజనం అనే వాదన కూడా ఉంది.
ఒకవేళ అదే జరిగితే అది రాజకీయంగా కాంగ్రెస్ కు కలిసివస్తోంది. కానీ బీజేపీకి ఏం లాభం? బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పంపలేదు. ఇదే డిమాండ్ తో తీర్మానం పంపినా కేంద్రం ఈ తీర్మానంపై సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుందా అంటే స్పష్టత లేదు. అయితే తీర్మానం చేసి బంతిని కేంద్రం కోర్టులో వేసింది రాష్ట్రం. కానీ, దీనివల్ల ప్రయోజనం ఉండదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అన్నారు. బీసీల జనాభాను తక్కువ చేసి చూపడం కరెక్టు కాదని ఆయన చెప్పారు.
రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోంది. తమిళనాడులో మాత్రమే 69 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. దీనికి సంబంధించి పార్లమెంట్ చట్టం చేసి 10వ షెడ్యూల్ లో చేర్చింది. దీంతో ఈ రాష్ట్రానికి మాత్రం రిజర్వేషన్లో మినహాయింపు ఉంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించాలంటే పార్లమెంట్ లో చట్టం చేయాలి. అది కోర్టుల్లో నిలబడాలి. మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ తరపున 42 శాతంటికెట్లు బీసీలకుఅందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మిగిలిన పార్టీలు కూడా ఇలానే టికెట్లు ఇవ్వాలని కోరారు.
కుల గణన సర్వేతో రాజకీయంగా పైచేయి సాధించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది తమకు ఒక నినాదంగా ఉపయోగపడుతుందని ఆశిస్తోంది. బీసీలకు తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి ఇదొక మంచి ప్రయత్నమని కూడా భావనిస్తోంది. అయితే, ఇప్పుడు సర్వే లెక్కలపైనే సందేహాలు రేకెత్తడం మరో వివాదానికి దారి తీస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ చట్టబద్ధం చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. లేదంటే ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగడగానే తేలిపోతుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



