స్పీకర్ పై వ్యాఖ్యలు: తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్

BRS MLA Jagadeesh Reddy Suspended
x

స్పీకర్ పై వ్యాఖ్యలు: తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్

Highlights

Jagadeesh Reddy: తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీశ్ రెడ్డిని ఈ సెషన్ నుంచి సస్పెండ్ చేశారు.

Jagadeesh Reddy: తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీశ్ రెడ్డిని ఈ సెషన్ నుంచి సస్పెండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు.తెలంగాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ చేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఆ తర్వాత జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.

గవర్నర్ ప్రసంగంపై ధన్యావాదాలు తెలిపే చర్చలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో గందరగోళానికి దారితీశాయి. దీంతో సభను వాయిదా వేశారు. ఈ పరిణామాలను మంత్రి శ్రీధర్ బాబు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పీకర్ తో భేటీ అయ్యారు.స్పీకర్‌నుద్దేశించి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రులు పరిశీలించారు. మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశమైంది. ఈ సమావేశం ప్రారంభం కాగానే జగదీశ్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని అధికార కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తర్వాత సీతక్క ఈ విషయమై మాట్లాడారు. స్పీకర్ ను టార్గెట్ చేసిన జగదీశ్ రెడ్డి శాసనసభ సభ్వత్వం రద్దు చేయాలని కోరారు.

ఇదే విషయమై చర్చలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలను రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగం సమయంలో అమర్యాదగా వ్యవహరించారని ఈ చర్యలు తీసుకున్నారని ఉత్తమ్ చెప్పారు. గత పార్లమెంట్ లో టీఎంసీ సభ్యురాలిపై చర్యలు తీసుకున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నానని ఆయన ప్రస్తావించారు. జగదీశ్ రెడ్డి విషయంలో ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని ఆయన సూచించారు.

స్పీకర్ పై జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క తప్పుబట్టారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్ ను కోరారు.ఈ వ్యాఖ్యలపై చర్యల విషయంలో ఎథిక్స్ కమిటీకి పంపాలన్నారు. మరో వైపు ఈ అసెంబ్లీ సెషన్ వరకు జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కోరారు. ఇదే విషయమై మంత్రి శ్రీధర్ బాబు తీర్మానం ప్రతిపాదించారు. ఈ సమయంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు పదేపదే కోరారు. సస్పెన్షన్ కు గురైన జగదీశ్ రెడ్డిని సభ నుంచి వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు. జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ నిర్ణయాన్ని నిరసిస్తూ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు బయటకు వచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories