Telangana: ఆ 10 సీట్లే టార్గెట్‌..

BJP targets 10 Main seats in Telangana | TSNews
x

Telangana: ఆ 10 సీట్లే టార్గెట్‌.. బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ

Highlights

Telangana: బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ

Telangana: తెలంగాణ కమలం పార్టీ ఆ పది ఎంపీ స్థానాలపై గురి పెట్టిందా? ఆ పార్లమెంటరీ స్థానాలే లక్ష‌్యంగా కమలనాథులు కసరత్తు మొదలుపెట్టారా? గతంలో ఓడిపోయిన సీట్లతో పాటు, తృటిలో గెలుపు ట్రాక్‌ నుంచి పడిపోయిన స్థానాల్లో కమలం జెండా ఎగురవేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారా? ఆ సెగ్మెంట్లలో ప్రచారంతో పాటు అభ్యర్ధుల గెలుపు కోసం వ్యూహాలకు పదును పెడుతున్న కమలం పెద్దలు... ఆ పరిధిలోని నేతలతో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్ధేశం చేస్తున్నారా? త్వరలో తెలంగాణలో జరగబోతున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు చేస్తారా? ఇంతకీ కమలం కన్నేసిన ఆ ఎంపీ సీట్లు ఏవి? గులాబీకి కంచుకోటలాంటి సెగ్మెంట్లలో కమలం జెండా ఎగిరే సత్తా ఎంత?

తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో బలోపేతం అవడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్న కమలనాథులు పది పార్లమెంట్‌ స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలు పెట్టారట. గతంలో గెలుస్తామనుకున్న నియోజకవర్గాలను చేజేతులా వదలుకున్నామన్న భావనతో ఉన్న కమలం నేతలు ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తున్నారట. అందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారని సైలెంట్‌గా లీక్‌లు ఇస్తుండటంతో ఆల్రెడీ కన్నేసిన కమలం అభ్యర్థులు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారట. ఫలానా చోట మాకు బలం ఉందని చాటి చెప్పేందుకు ఆశావహులు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తున్నారట. అంగ బలం, అర్థబలం, ఆర్థిక బలం ఉన్న నాయకులను ఒడిసి పట్టుకొని, వారిని గెలిపించి, జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న కమలం వ్యూహకర్తల ఆలోచనలకు సరిపోయేది తామేనంటూ కొందరు ఇప్పటికే చాప పరిచేశారట.

తెలంగాణలో లోక్‌స‌భ‌ ఎన్నిక‌లకు చాలా టైముంది. కానీ, బీజేపీ ముంద‌స్తు ప్రిప‌రేష‌న్ మొద‌లుపెట్టింది. అభ్యర్థుల ఎంపికపై ఈపాటికే న‌జ‌ర్ పెట్టింది. పార్టీ కీల‌కంగా భావిస్తోన్న స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక‌పై ఆచితూచి అడుగులు వేస్తూ ఎన్నిక‌ల వేడిని రగిలించే ప్రయత్నం చేస్తోందట. ప్రతిప‌క్ష కాంగ్రెస్‌తో పాటు, అధికార టీఆర్ఎస్‌ల‌కు అంద‌నంత స్పీడులో ఈసారి దూసుకుపోవాలన్న పట్టుదలతో ఉన్న కమలదళం రాష్ట్రంలోని 10 ఎంపీ స్థానాల్లో గెలుపే ల‌క్ష్యంగా పావులు కదుపుతున్నారట. ముచ్చటగా మూడోసారి మోడీని ప్రధానిగా చూడాలన్న కలతో ఉన్న కమలనాథులు తెలంగాణ నుంచి పది ఎంపీ సీట్లను ఆయనకు గిఫ్ట్‌గా ఇవ్వాలని వ్యూహరచన చేస్తున్నారట. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఎవరు ఎవరిని బరిలోకి దింపితే పార్టీకి ప్రయోజనంగా ఉంటుందనే విషయాలపై ఆరా తీస్తున్నారట. ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లలో స్థానిక నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న కమలం పెద్దలు... వాటి పరిష్కారం కోసం కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నారట. మరోవైపు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన బలమైన నేతలను బీజేపీలో చేర్చుకొనేలా పావులు కూడా కదుపుతున్నారట.

2014 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఒకే ఒక్క స్థానంలో గెలిచిన బీజేపీ 2019కి వచ్చేసరికి ఆ సంఖ్యను పెంచుకుంది. ఏకంగా నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. మొన్నటి సారి గెలవని హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, పెద్దపల్లి, జహీరాబాద్‌, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్‌ స్థానాలపై ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టారు కమలనాథులు. షెడ్యూల్‌ ప్రకారం తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా... రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పది స్థానాలను కైవసం చేసుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నారట. నిజామాబాద్‌ విషయానికొస్తే... ఇందూరు గులాబీకి కంచుకోట. ఇంతకుముందు 2014లో ఇక్కడి నుంచి కల్వకుంట్ల కవిత జయకేతనం ఎగరేశారు. 2019 ఎన్నికల్లో సీన్‌ రివర్సైంది. కవిత ప్లేస్‌ను కమలం పార్టీ నుంచి గెలిచిన ధర్మపురి అర్వింద్‌ రిప్లేస్‌చేశారు. అలాంటి పార్లమెంట్‌ స్థానాన్ని పదిలంగా కాపాడుకునేలా కసరత్తు మొదలుపెట్టారట. ధర్మపురి అర్వింద్‌ అసెంబ్లీ పోటీ చేసినా పార్లమెంట్‌ బరిలో ఉన్నా నిజామాబాద్‌ ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్నారట.

కరీంనగర్‌లో కూడా అంతే. ఇది కూడా కారు పార్టీ కంచుకోటే. 2014లో ఇక్కడి నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఎంపీగా గెలవగా, 2109లో కమలం పార్టీ సారథి బండి సంజయ్‌ చేతిలో వినోద్‌ ఓడిపోయారు. అలా గులాబీ కోటలో కమలం జెండా ఎగిరినట్టయింది. అయితే, ఈసారి కూడా టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా చేయడం ద్వారా ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించేందుకు కమలం పార్టీ వ్యూహలను రచిస్తోందట. కిందటిసారి నష్టపోయిన నియోజకవర్గాల్లో ఈసారి పట్టు సాధించే అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలుపెట్టిన బీజేపీ వ్యూహకర్తలు... రెండేళ్ల ముందే సీక్రెట్‌గా వారిపై సర్వే కూడా నిర్వహిస్తున్నారట. ఇంటి పోరుతో సతమతమవుతున్న కారు పార్టీకి చెందిన అసంతృప్త నాయకులకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యారట. అయితే, కేంద్ర బీజేపీ పెద్దలు రహస్యంగా నిర్వహిస్తున్న సర్వేలో పాసైతామా.. లేదా అనే టెన్షన్‌తో ఉన్న ఆశావహ కమలం అభ్యర్థులు టికెట్‌ చేజారకుండా... తాము నిలబడితే గెలుస్తామని రాష్ట్ర బీజేపీ పెద్దల ముందు ధీమాగా చెబుతున్నారట.

ఇటు, సొంత పార్టీలో కూడా ఇంటి పోరు షురు అవడంతో పార్టీలోని ప్రత్యర్థులు తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. పనితీరు సరిగా లేని నాయకులు, ప్రజల్లో ఆదరణ కోల్పోయిన వారు, నియోజకవర్గాల్లో వివాదాస్పదంగా మారిన వారి జాబితాను జల్లెడ పడుతున్న బీజేపీ అధినాయకత్వం... వచ్చే ఎన్నికల్లో వారి గెలపు అవకాశాలు ఎలా ఉంటాయన్న అంశాలపై దృష్టి సారించిందట. అటు కేంద్రం పెద్దలు, ఇటు రాష్ట్ర పెద్దలు నిర్వహిస్తున్న సర్వే ద్వారా సేకరించిన సమాచారంతో నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటే వారికే టికెట్లు ఇస్తామని ఇప్పటి నుంచే లెక్కలు తీస్తున్న బీజేపీ పెద్దలు కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు తప్పనిసరిని లీకులిస్తున్నారట.

ఏమైనా, తెలంగాణలో త్వరలోనే జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకొని రాష్ట్ర కమలం నాయకత్వానికి దిశానిర్దేశం చేసేందుకు బీజేపీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారట. ఇప్పటికే టీఆర్ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని ప్రజల్లో ఓ ఆలోచనను బలంగా నాటిన కాషాయదళం... జాతీయ కార్యవర్గ సమావేశంతో తమ సత్తా చాటాలని నిర్ణయించుకున్నారట. మరి ఈసారి తెరపైకి కొత్తగా తీసుకొచ్చే కొన్ని తీర్మానాలు, నిర్ణయాల విషయంలో కీలకంగా వ్యవహరించాలన్న ఆలోచనతో ఉన్న బీజేపీ ఢిల్లీ పెద్దలు తెలంగాణలో ఎక్కువ స్థానాలు కమలం ఖాతాలోనే పడేలా ప్లాన్‌ చేస్తున్నారట. మరి ఇది ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో, ప్రజా తీర్పు ఎలా ఉండబోతోందో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories